Search This Blog
Tuesday, May 27, 2008
రాజావారి విడిదిలో దెయ్యం
ఒకటి రెండు రోజుల్లో నా రూమ్మేట్లిద్దరూ వచ్చి చేరారు. పిల్లలమర్రి త్రిమూర్తిది గుంటూరు.ఎం ఎస్ సీ కెమిస్ట్రీ చదవడానికి వచ్చేడు. వాళ్ళ నాన్న గారు పిల్లలమర్రి హనుమంతరావుగారు హిందూ కాలేజి లో తెలుగు ఉపన్యాసకులు. ప్రసిధ్ధులు. మా నాన్నగారికి యూనివర్సిటీలో సమకాలీనులు. పండిత పుత్రుణ్ణి కన్నవారు. త్రిమూర్తి మిగిలిన సంగతులేమైనా మంచి మిత్రుడు. ఇక వెంకటదాసు నెల్లూరు జిల్లా వెంకటగిరి నించి వచ్చేడు. మా ఇద్దరికన్నా వయస్సులో కొంచెం పెద్దవాడు.లైబ్రరీ సైన్సు డిప్లొమా [ఆ రోజుల్లో డిప్లొమా నే వుండేది] చదవడానికి వచ్చేడు. మాకు మిత్రులమవడానికి యెక్కువ సమయం పట్టలేదు. మహా అయితే అరగంట. ఆంధ్రా యూనివర్సిటీ జీవితం నాకు అనేక ప్రాంతాలనీ అక్కడి మనుషులనీ పరిచయమేకాదు-నా స్వంతమనేంతగా చేసింది. అప్పుడు ఈ రోజుల్లో లాగ అన్నికాలేజిలుగా విభజనలేకపోవడం వల్ల అనేక సబ్జెక్ట్లు చదివేవాళ్ళమందరం ఒకే చోట వుండి భావాలనీ జ్ఞానాన్నీ పంచుకోవడం మా మనస్సుల్ని విశాలం చెసింది. మేం ముగ్గురం మొదటిరోజు రాత్రి కబుర్లు చెప్పుకుని చెప్పుకుని నవ్వుకుని నవ్వుకుని నవ్వుకుని యే రాత్రికో నిద్రపోయాం. కొంత సేపటికి మధుర మనోహర స్వరంతో గానం .....యెవరో గంధర్వులు దిగివచ్చారా అనిపించుతూ నిద్రలేపింది. నిజమా కలా అనుకుంటూ నేనూ త్రిమూర్తీ లేచాం. బయటకి వెళ్ళి చూస్తే యెవరూ కనిపించలేదు. రాజావారి వేసవి విడిదిలో యెవరైనా దయ్యమై తిరుగు తున్నారేమో అనిపించింది. కొంచెం ముందుకి వెళ్ళి చూశాం. పక్క రూము లో లైటు వెలిగింది. అప్పుడు మొదటిసారి చూశాను గౌరీపతి శాస్త్రిని. ఆ రాగానికి ముక్తాయింపు మొదలు పెట్టాడు. దెయ్యాన్ని కాదు మనిషినేలే పొద్దున్న మాట్లాడుకుందాం వెళ్ళి పడుకోండి అన్నాడు. అలా ప్రారంభమైన ఆ స్నేహం చిరకాలం కొనసాగింది. అతని కబుర్లు చాలా వున్నాయి. కొద్ది కాలం కింద అతని అకాల మరణం దాకా ఆప్తులుగానే వున్నాం. మా అబ్బాయిలకి కూడామిత్రుడే అయ్యాడు. ఇంకా బొలెడంత వుంది
Thursday, May 22, 2008
విశాఖలో ప్రవేశం
1963 ఆగస్టులో నేను యూనివర్సిటీ కి వచ్చేను. అంతకుముందురోజేవచ్చి రూము తెలుసుకున్నాక ఆ రోజు సామానుతో వచ్చేను. వచ్చింది మా కారులోనే కనుక నాతో బాటు మా రామచంద్రమూర్తీ వాళ్ళనాన్నగారు రమణమూర్తి మాస్టారూ కూడా వచ్చేరు.ఇప్పుడు గుర్తించేను. ఇన్నాళ్ళ విజయనగరం జ్ఞాపకాలలో వీళ్ళిద్దరి ప్రసక్తీ రానేలేదని. యెంత పొరపాటు.తొందరలోనే దిద్దుకుంటాను. రామం పుట్టినరోజు నిన్నే అయింది.వాడు ఎం ఎస్ సీ కెమిస్ట్రీ లో చేరాడు. మా ఇద్ద్దరికీ వేరు వేరు రూములు వచ్చేయి. మేం పట్టించుకోలేదు. పిఠాపురం రాజావారి వేసవి విడిది మా హాస్టలు.ఇల్లు లాగే వుండేది. ఒక పక్కగా కాంపౌండు గోడకి చిన్న గేటు. దాంట్లోంచి వెళితే మూడు గదులు. మూడింటికీముందు అరుగులు. ఒక కొళాయి. బలే సరదాగా వుండేది.నేను వెళ్ళేటప్పటికి ఆ గదిలో శివశంకరం గారూ,గంటి సూర్యనారాయణమూర్తిగారూ వున్నారు. వారు అంతకు ముందు సంవత్సరం ఆ గదిలో వున్నారు.ఎం ఎస్ సీ ఫైనల్ కి వచ్చి మరో రూముకి వెళ్ళే ప్రయత్నంలో వున్నారు. శివశంకరంగారు యెక్కడ వున్నారో తెలియదుకాని మూర్తిగారితో నా స్నేహం ఇంకా కొనసాగుతోంది.తరవాత నా రూం మేట్లుగా పిల్లలమర్రి త్రిమూర్తీ ఆనం వెంకటదాసూ వచ్చేరు.ఒక్కోళ్ళూ ఒక పోస్టుకి వస్తారు. మా రామం రూములో ఒకాయన వుండే వారు.ఆయన పేరేమిటో గుర్తులేదుకాని ఆయన తమ్ముడు ఎన్ సీ విజయా కూడా వుండేవాడు. అతనితో పరిచయం గాఢ స్నేహంగా మారి అతను ఐ ఐ టీ కాన్ పూరుకి వెళ్ళేదాకా గడిచింది.దూరం వున్నా స్నేహం స్నేహమే. అతని గురించి ఒక పుస్తకమే రాయచ్చు.ఇంకొన్ని పరిచయాల తరవాత జ్ఞాపకాల వరస మొదలు పెడతాను
Monday, May 12, 2008
hrudayatakku
విజయనగరం నించి విశాఖకి దూకిన మీదట కొంత మంది మిత్రులు ఆ కాలంలో జరిగిన కొన్ని విషయాలగురించి రాయలేదేమని కొంచెం నిలదీసినట్టుగానే మైల్ చెశారు. వారందరికీ నా సమాధానం ఒక్కటే.వ్యక్తుల కి సంబంధించి వారి వ్యక్తిత్వానికి భంగం కలిగించే సంగతులేమీ రాయక పోవడం ఉద్దేశపూర్వకమే. వ్యక్తిగతాలు ఇక్కడ కాదని మనవి.ఇది నా ఆత్మకధ కాదు. కాలక్షేపం మాత్రమే.హృదయ టక్కు అనేది మా నాగమునేశ్వర రావు గారికోసం మేము ఫస్ట్ యియర్ చదువుతున్నప్పుడు 1963 లో సీతారామారావు కాయిన్ చెసినది. మేము కాయిన్ చేసినదని యెందుకన్నానంటే ఇర్రివరెన్స్ అన్నది దాదాపుగా యూనివర్సిటీలో మా బాచిల తోనే మొదలైంది. అంతకుముందు గురువులంటే భక్తిశ్రధ్ధలు బాగానే వుండేవి. దీనికి చాలా ఉదాహరణలు ముందు ముందు రాస్తాను. ప్రస్తుతానికి మా నాగమునేశ్వరరావు గారు రష్యా వెళ్ళేముందు పాంటు నడుము గుండె దగ్గర కాకుండా నడుముకి ఇంకొంచెం దగ్గరగా వుండేటట్లు కుట్టించడానికి మాలో కొందరు టైలరు దగ్గరకి వెళ్ళి కాపలా కాయాల్సి వచ్చింది. టాన్ తీటా హృదయటక్కు వంటివి మాతోనే ఆగకుండా ఇంకా ప్రాచుర్యంలో వున్నందుకు కొంచెం ఆశ్చర్యం గానే వుంది.
Sunday, May 11, 2008
my visakhapatnam
అరవైమూడు ఆగస్టులో నేను విశాఖపట్నం వచ్చాను.అంటే అంతకుముందు రాలేదనికాదు. విశాఖతో నా చిన్నప్పటినించీ అనుబంధం ఉన్నదే. మా చిన్నాన్నగారు యూనివర్సిటీ లైబ్రరీలో ఉద్యోగం చేసేవారు. ఆయనతో కలిసి యేడెనిమిదేళ్ళవయసులో లైబ్రరీకి వెళ్ళిన మొదటిసారే అక్కడ పెద్దపెద్ద పుస్తకాలు చదువుతున్న స్కాలర్లని చూసి యెప్పటికైనా నేనూ ఇక్కడ చదివి పరిశోధనలు[ అంటే యేమిటో తెలీకపోయినా యేదో చెయ్యాలని భావన] చెయ్యాలనే కోరికపాతుకుపోయింది.అది చెయ్యగలిగినందుకూ తరువాతకూడా కొనసాగించగలిగినందుకూ నాకు చాలా సంతృప్తేకలిగింది.అప్పట్లో లైబ్రరీ ప్రస్తుతం యూనివర్సిటీ ప్రెస్ ఉన్నచోట ఉండేది.ప్రస్తుత విషయానికొస్తే 63 లో వచ్చినతరువాత ఇదే నా వూరయింది.పధ్ధెనిమిదేళ్ళ వయసునించి అరవైరెండేళ్ళదాకా నేనెంత యెదిగానో యెంత మారానో విశాఖ కూడా అంత యెదిగింది. అయినా నేను అశోక్ నే అయినట్టుగానే విశాఖ కూడా వ్యక్తిత్వం పెంచుకుంది గాని మారలేదనే నాకనిపిస్తుంది.యే మనిషి జీవితంలోనైనా వివిధ స్థాయిలుంటాయి. 63 కి ముందు విజయనగరంలో నేనెన్ని చేసినా యేం చేసినా మా అమ్మానాన్నల కొడుకుగానే. నాకంటూ ప్రత్యేకత అప్పటికి లేదు. విశాఖ వచ్చిన మొదటి సంవత్సరమూ కొంత అలానే గడిచింది. మా తల్లిదండ్రుల సహాధ్యాయులెందరో ప్రొఫెసర్లగానూ ఇతరత్రానూ ఇక్కడ వుండడం ఒహో నువ్వటొయ్ అంటూ పలకరించడం జరిగేవి. నెమ్మదిగా నాకంటూ ఒక వ్యక్తిత్వం నేనేంచేస్తున్నానో దానికి నేనే జవాబుదారీ అన్న బాధ్యత పెరిగేయి. 66లో నేను రిసెర్చ్ కి చేరే సమయానిక్ నాకు ఒక గుర్తింపూ స్థాయీ తెచ్చుకోగలిగాను . అప్పటినించీ మూడో దశ.
Wednesday, May 7, 2008
dabbuludabbulu
విజయనగరం జ్ఞాపకాల్లో క్రికెట్ సంబంధితాలు కొన్ని. సర్ విజ్జీ అనబడే విజయానంద గజపతిగారు క్రికెట్ లోకానికి చిరపరిచితులు. ఆయన పి వి జి రాజు గారికికి పినతండ్రి. వారణాసిలో వుండేవారు [వున్నప్పుడు]. ఆయన్ని కాశీ రాజు గారని పిలవడమూ కద్దు. విశాఖ పార్లమెంటు మెంబరు గా వున్నారు.[విజయనగరం చాలారోజులు విశాఖ స్థానంలో భాగమే.] ఆయనకి రాజకీయాల్లో ఆసక్తి లేకపోయినా రాజు గారు కదామరి. ఆయన పూర్వీకుల వూరికి వచ్చి కోటలో బస చేసినప్పుడు క్రికెట్ ఆడే కాలేజ్ కుర్రాళ్ళందరినీ పిలిచి ఒక ఆట ఆడించి చూసి వెళ్ళే వారు[కాలేజ్ కైనా రాందే క్రికెట్ గురించి తెలిసినవాళ్ళు ఆ రోజుల్లో వుండేవారు కాదు] రాజభోజనాలు తినడం కోసం అందరూ చేరే వాళ్ళం. అలాంటి ఒక రోజు వాన పడింది. ఆట లేదుగా మరి. రాజావారు కారెక్కి కోటకి వెళిపోయేరు. భొజనాలు మాత్రం రెడీ. ఆయనంటే కారులో వూరేగారు కాని మేం తడుసుకుని యేం వెళ్తాం . అక్కడే పెవిలియన్ అనబడే అయోధ్య మైదానపు ముందు భాగంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. మాటో పాటు ఒక పెద్ద రాజు గారు కూడా ఉన్నారు.ఆయన పేరు చెప్పను. మాకన్నా పెద్ద వారు, తరువాతి కాలంలో విద్యారంగంలో అనేక ప్రముఖ పదవులని అలంకరించేరు. ఆయన కాళ్ళు సాగదీసుకుంటా అని లేచి కొంచెం పచార్లు సాగించేరు.వాన కదా ఆక్సిడెంట్లు సహజం. జారిపడ్డారు. తొందరగానే లేచి సర్దుకున్నారు. కాని కొందరికుండే కోతిబుధ్ధి నిరంతరం వుంటూనే వుంటుంది కదా. మాధవరావు అప్రయత్నం గానే రాజుగారూ డబ్బులు డబ్బులు అని అరిచినట్టు అన్నాడు. అంత పెద్దమనిషీ మళ్ళీ మోకాళ్ళమీద కూచుని పాకుతూ యేవీ యెక్కడ అని వెతుకుతుంటే మా మొహాలు మీరు ఊహించుకోగలరుకదా. దరిమిలా అనేక మీటింగుల్లో ఆయనతో పాటు కూర్చున్నప్పుడల్లా ఈ ఘట్టం గుర్తుకిరావడమూ నవ్వాపుకోడానికి విశ్వప్రయత్నమూ చెయ్యాల్సి రావడమూ వేరే సంగతి.
Monday, May 5, 2008
apputachchu
మిత్రులందరూ ముఖ్యంగా రాజెంద్రప్రసాద్ గారు నన్ను క్షమించాలి. 1962 కి 1982 అని టైపుచేశాను.ఇదే శాస్త్రీ మేమూ అందరమూ విశాఖ ఎబ్డెన్ క్రికెట్ టోర్నమెంటు కి ఆ రోజుల్లోనే వెళ్ళాము. శాస్త్రి నీటుగా టక్ చేసి బెల్టు బిగిస్తుంటే మాధవరావు వొరేయ్ అది నడుము రా హోల్డాలు కాదు మరీ అంత బిగించి కట్టకు అని అరిచేడు.
dharmayudhdham
ఒక నెల దాటాక మళ్ళీ మిత్రుల్ని కలుస్తున్నాను. ఈ నెలలో మా పెద్దబ్బాయి ఈ వూరినించి రిలొకేట్ అవడం ఒక కారణమయితే కోడలూ మనవడి బాధ్యత కూడా కొంత కారణం. విజయనగరం గురించి ఇంక ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకుని రాయడంకన్నా విశాఖకి దూకడమే బాగుంటుందని భావన. ఈ లోగా మా శాస్త్రి గురించి ఒక మాట. శాస్త్రి మా కన్నా ఒక సంవత్సరం సీనియర్. బి యే చదివే వాడు. మా వూరిలో పెద్ద లాయరు గారి అబ్బాయి. మాకిద్దరికీ క్రికెట్ గ్రౌండు మీదా వరహాలు ద్వారానూ పరిచయం. మేం బి ఎస్ సీ చదివే రోజులంటే 1982 చైనా యుధ్ధం రోజులు. రోజూ రేడియో లో యుధ్ధం వార్తలు వచ్చేవి.శాస్త్రీ వాళ్ళింట్లో ఒక రోజు వార్తలు అందరూ శ్రధ్ధగా వింటుంటే వాడికి అనుమానం వచ్చింది.నిన్న రాత్రి అని వార్తల్లో యేదో చెప్పారు. వాళ్ళ నాన్న గారినే అడిగాడు.నాన్నా రాత్రి పూట కూడా యుధ్దం చేస్తారా అని. ఆయన కూడా అంతే సీరియస్ గా లేదురా నాన్నా ధర్మయుధ్ధం. ఆరింటికల్లా శంఖం వూదేస్తారు అని చెప్పారు. అవాక్కవడం శాస్త్రివంతూ నవ్వుల్ని ఆపుకోడం మా వంతూ
Subscribe to:
Posts (Atom)