Search This Blog

Tuesday, May 5, 2009

యూనిసెక్సూ బ్రాహ్మణోత్తముడూ

కాన్వొకేషన్ కి ఇచ్చిన పాసులపై నంబర్లుండేవి. దాని ప్రకారం సీటు దగ్గరకి వెళితే ఆ కుర్చీలో ఒక పాకెట్లో డిగ్రీ , కాన్వొకేషన్లో చెయ్యాల్సిన పనుల జాబితా ,తీసుకోవల్సిన శపథం కాపీ ఇత్యాదులు వుండేవి. అవి తీసుకుని కూర్చోవాలి. వేరే ఇవ్వడం అదీ ఏమీ వుండదు-మెడల్సు పుచ్చుకునే వాళ్ళకి తప్ప.నేను ఎం ఎస్ సీ టెక్ ఫస్టియర్ చదువుతున్నప్పుడు బి ఎస్ సీ డిగ్రీ తీసుకున్నాను అందర్లాగే.మా పాతకాలేజి నించి మిత్రులు కూడా వచ్చేరు ఈ పని మీదే. వాళ్ళలో గోపాలరత్నం అనే అమ్మాయి కూడా వచ్చింది.ఈ యూనిసెక్స్ పేరుతోనే వచ్చింది తంటా. ఆ అమ్మాయి తన సహ విద్యార్ధినులతో కలిసి లోపలకి వెళ్ళాక అసలా అమ్మాయి నంబరున్న సీటే లేదు అక్కడ!ఇలాంటి చిన్న పొరపాట్లు ఆ రోజుల్లో జరిగేవికాదు--చండశాసనులనిపించుకున్న సూపరింటెండెంట్లుండేవాళ్ళు రిజిస్ట్రారాఫీసులో.వెతగ్గా వెతగ్గా సంగతి బయటపడింది. ఆ నంబరు సీటు మగవాళ్ళ సీట్లలో వుంది. పోనీ పాకెట్ తీసేసుకోమంటే-- డిగ్రీ మీద మిస్టర్ గోపాలరత్నం అని రాసి వుంది.అది పనిచెయ్యదే!ఈలోపల కాన్వొకేషన్ మొదలయ్యే టైమయిపోతోంది.అక్కడ వున్న సూపరింటెండెంటుని అడిగితే. ఆ పాకెట్ ఆఫీసులో ఇచ్చేసి లెటర్ పెట్టమన్నాడు. అమ్మాయి మాతో హాస్టల్లో పడుకునే రోజులు కాదుకదా. అందుకని ఒక కాగితం మీద సంతకం పెట్టించి ఆ పాకెట్ తీసుకుని ఆమెని సరదా చూసేసి ఇంటికి పొమ్మన్నాం మరునాడు ఉదయమే క్లాసు ఎగ్గొట్టి ఆ డిగ్రీ , జరిగింది వివరిస్తూ ఒక ఉత్తరమూ పట్టుకుని రిజిస్ట్రారు వారి ఆఫీసుకి వెళ్ళి మొదటి అంతస్తులో ఒక చివరికి వున్న ఆ సెక్షను కి వెళ్ళి గుమ్మం లో నిలబడి లోపలికి తొంగి చూస్తూ నిలబడ్డాం. యు వి రమణయ్య గారనే సూపరింటెండెంటు కళ్ళజోడు పైనించి చూసి తల యెగరేశాడు యెందుకూ అన్నట్టు. ఆ రోజుల్లో వాళ్ళన్న భయంగానే వుండేది--వాళ్ళ నిజాయితీ రుజువర్తనమే వాళ్ళకా మర్యాద తెచ్చేవనుకుంటాను.పైగా యే క్షణంలోనైనా రిజిస్ట్రారు వస్తారేమోనన్న దడ --కూర్మావేణుగోపాలస్వామి గారివ్యక్తిత్వమూ అలాంటిదే. సరే రమణయ్యగారి సైగకి జవాబుగా చేతిలోని కాగితాలని పైకెత్తి ఆడించాను . మళ్ళీ తల తాటించారు. అంటే రమ్మని అన్న మాట.లోపలికి వెళ్ళి ఆయన ముందు నిలబడి చేతికి కాగితాలు అందించాం. ఒక సారి డిగ్రీ పక్క చూసి రేపు సాయంకాలం అన్నారు. ఒక్కమాటే నన్నమాట ఆ వేళకి.సమస్యకొంచెం వివరించబోయాం 'ఇదీ' అంటూ. ఈ సారి తల గుండ్రంగా తిప్పి చెయ్యి గాల్లోకి ఊపేరు. అర్థం అయింది వెళ్ళమని మేమూ అర్థం చేసుకుని ఇంకోచెంసేపుంటే గెంటిస్తాడేమోనని వచ్చేశాం. గెంటిస్తే ధర్నా చెయాలని అప్పట్లో తెలీదుగా.రెండోరోజు సాయంత్రం అయిదింటికల్లా టంచనుగా వెళ్ళీ నిలబడ్డాం. మళ్ళీ ఆయనే. సూపరింటెండెంటుకి తప్ప మరెవరికీ బయటవాళ్ళతో మాట్లాడే హక్కు లేదు ఆ సెక్షన్లో. పేరు ? అని ప్రశ్నించేరు--డిగ్రీ మీదదని ఊహించి గోపాలరత్నం అన్నా ఊఉ అని తన ముందున్న దస్త్రం లోంచి వెతికి చేతికిచ్చేడు.చూసుకున్నాం. మిస్ గోపాలరత్నం అని వుంది. థాంక్సండీ అని వెనుతిరిగాం. ఉండు అని హుంకరించేడు. గతుక్కుమని వెనక్కి తిరిగేం. సంతకం చెయ్యద్దా అని పుస్తకం ముందుకి తోసేడు. సరేనని సంతకం చేసిచ్చి నిలబడ్డాం మళ్ళీ పిలిస్తే వెనక్కి తిరగడమెందుకని. ఒకసారి సంతకం చూసి ఇదేమిటి ? గోపాలరత్నం నువ్వు కాదా? అని డిగ్రీ వెనక్కిమ్మన్నట్టు చెయ్యి చాచేడు. కంగు తిని సీత రాముడికేమవుతుందో పూర్తిగా వివరించి చెప్పాను. అవును కదూ అని కళ్ళ జోడు సర్దుకుని మళ్ళీ చెయ్యి ఊపాడు. అమ్మయ్య అని బయటపడ్డాం. అయ్యా అదీ రమణయ్య గారితో నా తొలి పరిచయం. తరవాతి రోజుల్లో ఆ బ్రారహ్మణోత్తముడు చాలా మంచి మిత్రులయ్యేరు.