Search This Blog

Monday, March 14, 2016

ఎవరు

నేనెవర్ని?
క్రేజీ అని నాకిచ్చిన నిర్వచనం నిజం చెయ్యడానికి కాదు.
నిజంగానే యిప్పుడే ఈ బ్లాగ్ పోస్టులు తిరిగి చదివినప్పుడు
నాకొచ్చిందీ అనుమానం.
నేనేనా ఇదంతా రాసింది? మరెందుకు రాయడం లేదు?
ఇది నేనే ఐతే మరి రోజూ తిని పడుకుని  టివి లో వాస్తుసిరి, ఆనందసిద్థి లాటి కార్యక్రమాలు చూస్తూ వాడి అజ్ఞానాన్నీ చూసేవాడి మూర్ఖత్వాన్నీ తిడుతూ ఉండే ఆపరమ మూర్ఖుడెవరు?
నేనేనా?
ఫేస్ బుక్ లో ఎవరేం రాస్తున్నారో చూస్తూ ఒకనాటి నావిద్యార్ధుల సంతోషాన్నీ విజయాలనీ పంచుకుంటూ 
ఆనందిస్తున్నదెవరు?
ఆదీ నేనేనా?
నా మనమళ్లరో ఓరిగామి బొమ్మలు చేసి కేరింతలు కొడుతున్న ఫూల్ ఎవరు?
అదీనేనే?
I am a crazy person who relishes doing what he feels at a particular moment and knows only enjoying life!
That's me

Wednesday, April 15, 2015

నిజంగా నిజంగా నిజంగా మళ్ళీ మొదలవుతోంది. యీ వారమే

Wednesday, May 21, 2014

తమ్మావారి మరో చమక్కు

మేము 2 వ సంవత్సరం పరీక్షలు రాస్తున్నప్పుడు కామేశ్వరరావుగారు ఇన్ ఛార్జ్ హెడ్ గా ఉన్నారు. ఆ ఏడాది ప్రాక్టికల్స్ లో అన్ని సబ్జెక్టులకీ ఆయనే ఇంటర్నల్ గా ఉండడం చాలా కామెంట్లకీ ఛలోక్తులకీ దారిచ్చింది.
అప్పట్లో థియరీ కాని ప్రాక్టికల్స్ కాని ఎందులో పరీక్ష పోయినా మొత్తం అన్నీ తిరిగి రాయాలిసిందే. అందువలన ప్రాక్టికల్స్ రాసేవారు చాలా మంది ఉండేవారు. మా బాచిలో అంతకుముందు ఐదారేళ్ళుగా పరీక్షకి వస్తున్న మేధావి
(! ) ఒకాయన ఉన్నాడు. తమ్మా వారిని చాలా కాలంగా తెలిసుండడం చేత ఆప్టిక్స్ అసలు తెలీని వాడు( అనే భావంతో) ఎగ్జామినరు గా రావడం వేళాకోళంగా భావించేడు ..తనా పరీక్ష పాసే కాలేదన్న సంగతి మరిచి.
అతని దగ్గరకి తమ్మా వారు రాగానే నవ్వుతూ చూశాడు.
ఏం చేస్తున్నావు అని తమ్మా వారి ప్రశ్న
ఏముందండీ.. యీపక్క ఆబ్జెక్ట్ పెట్టాను. యిది లెన్సు. ఆపక్క ఇమేజి వస్తుంది. దూరాలు చూస్తే జవాబు వస్తుంది, అని నవ్వుతూనే జవాబు చెప్పాడు.

మరైతే నీకెందుకలా చెమటలు పడుతున్నాయ్? అని అడిగి తమ్మా వారు ముందుకు సాగారు.

అతనికి ఏంతగిలిందో అర్థంకాక బిత్తర పోయాడు.

తమ్మావారా మజాకా

Wednesday, April 30, 2014

ధన్యవాదాలు

అభిమానంతో కోప్పడుతున్న మిత్రులందరికీ ధన్యవాదాలు. కొందరు యిక్కడ, కొందరు ఫేస్ బుక్ లో, కొందరు ఇమైల్ లో కోప్పడుతూ పలకరిస్తున్నారు. అందరికీ క్షమాపణలు.
మీరందరూ అనుకుంటున్నట్టు ఓపిక లేకపోవడంకాని, బద్ధకం కాని కారణంకాదు. కొంతమంది మిత్రుల అపార్ధం వల్లనే ఆపాను. కాని యింతమంది అభిమానంగా పలకరించాక మనసు స్థిరపరచుకుని తిరిగి ప్రారంభించాను. యిక ఆపనని మాట యిస్తున్నాను.

Monday, April 28, 2014

మరోసారి తమ్మా వారు

తమ్మా వారి గురించి చెప్పేటప్పుడు చాలా జ్ఞాపకాలు.
మా ప్రొఫెసర్ రామకృష్ణరావుగారు సెలవులో ఉండగా ఒక పక్షం పాటు ఆయన హెడ్డుగా నటించారు(ACTING  అనాలి.... ముక్క అనువాదం చేశాను..తమ్మావారు కొంతకాలం నాటకసంఘ కార్యదర్శి గా ఉన్నారని గుర్తొచ్చి) ఆప్పుడే లైబ్రరీ లో మీటింగు ఉందని హెడ్డుకి పిలుపొచ్చింది.
యిలాటివంటే ఆయనకి నప్పక నాగమునేశ్వరరావు గారిని వెళ్ళమని చెప్పారు.

 తమ్మావారిని వేళాకోళం చేసే అవకాశం వదులుకోలేక ఆయన  మీ హెడ్డెక్కడంటే ఏం చెప్తాను అన్నారు.

హెడ్డు లేదని చెప్పండి.. అని తిరిగి జవాబు వచ్చింది. తమ్మావారా మజాకా

Friday, October 19, 2012

తమ్మావారు

అప్లైడ్ ఫిజిక్సులో నా చదువు ని గురించి చెప్పేటప్పుడు తమ్మా కామేశ్వరరావుగారిని తలుచుకోకుండా ఉండడం చాలా కష్టం.సాత్విక భోజనంలో నంచుకోడానికి పచ్చిమిరపకాయలాగ ఆరోజుల్లోని ఫాకల్టీలో ఆయనొక్కడే కాస్త సెన్స్ అఫ్ హ్యూమర్( క్షమార్హుడిని ఎంత ఆలోచించినా దీనికి తెలుగు పదం కొన్నేళ్ళుగా దొరకడంలేదు) ఉన్న మనిషి.మిగిలినవారంతా బిగుసుకు పోయి ఉండేవారు.        
అంతేకాకుండా ఆయన చాలా వాక్శుధ్ధి ఉన్న ఉపాథ్యాయుడు.నాఉద్దేశం ఆయన ఏదైనా చెపితే అది కళ్ళకి కట్టినట్టు అనిపించేది.కళ్ళముందు హోలోగ్రామ్ లాగ ఆడేది. దీనికి మంచి ఉదాహరణ టార్షన్ స్ట్రైన్ గురించి ఆయన మాకు చెప్పినది. కేవలం చేతులు తిప్పుతూ టార్షన్ వల్ల వస్తువు ఏరకంగా విరుగుతుందో ఆయన చూపిన తీరు యిప్పటికీ
ఏభై ఏళ్ళతరవాతా నా కళ్ళముందు కదుల్తోంది. ఒక రకంగా ఆయన నాకు ఇన్ స్పిరేషన్ అని చెప్పాలి. ఆ మహాను భావుడి కొరడాల్లాంటి రిపార్టీలు చాలా ఉన్నాయి సందర్భాన్ని బట్టి చెప్తాను.

Sunday, August 5, 2012

60లలో ఆంధ్రా యూనివర్సిటీ కేంటీనుకి భలే పేరుండేది. ఎక్కడెక్కడినించో మనుషులు వచ్చి టిఫిన్లు తినేవారు.మా మిత్రుల జీనితాలలో దాని పాత్ర చాలా పెద్దది. లెక్కలేనన్ని గంటలు అక్కడేగడిపాము కబుర్లతో సరదాలతో. అక్కడి సర్వర్లుకూడాచాలా సరదాగా ఉంచేవారు. ఒకసాయంత్రం మిత్రులందరమూ కూడి ఉండగా ఒకరు ఉల్లి గారె, ఒకరు ఉల్లి దొశ ఇలా చెప్పుతుండగా చివరి వాడు ఉల్లి కాఫీ చెప్పాడు....
సర్వరు  మామూలుగానే వెళిపోయి అందరితోపాటు వాడికీ తెచ్చాడు.కప్పులో కాఫీ, సాసర్లో ఉల్లిముక్కలూ.