Search This Blog

Monday, July 30, 2007

back in form

మా డాక్టరు సరదా తీరింది. సర్జన్ రూపంలో నాకొక మంచి మిత్రులు దొరికేరు. మళ్ళీ తలుపులు మూసుకోకుండా అడ్డు పెట్టేరు. జరుగుబాటుంటే రోగమంత రాజభోగం లేదని మూడు రోజులు భోగం అనుభవించి ఇంటికి చేరాను. రేపట్నించి మామూలే. నలభయ్యేళ్ళ మైత్రి వెంకటరామశాస్త్రి [చూ: కిర్లంపూడి క్రికెట్] రూపంలో నా సర్జరీ అయినంతసేపూ గుమ్మం లోనే నిలబడివుంది. ఇంత మంచి అనుభూతి స్నేహం కాక మరేది ఇస్తుంది?

Wednesday, July 25, 2007

m.r college contd

ఇంకా రెండు రోజులుందిగా స్టెంటు వేసుకోడానికి. ఈ లోగా మాకాలేజి మేడ యెక్కుదాం. ఫిజిక్సు లాబ్ వైపు మెట్లెక్కగానే యెడమ వైపు ఫిజిక్సు గాలరీ వస్తుంది.అక్కడ మళ్ళీ రెండు మెట్లెక్కి వెళ్ళాలి. ముందు పెద్ద వరండా వుంటుంది.వరండాకి యెడమ వైపు కూడా ఒక లాబరేటరీ ఉంది.మేము బీ ఎస్ సీ చదివేటప్పు డు అక్కడ యేమీ చెయ్యలేదు కాని యూనివర్సిటీ లో పాఠాలు చెప్పడం మొదలెట్టాక ఒక ప్రాజెక్టు కోసం ఆంపియర్ బాలన్స్ అవసరమై అక్కడికి వెళ్ళాను.ఇదే చెపుతుంది ఆ ప్రయోగశాల స్థాయిని. ఫిజిక్సు గేలరీ లో మొదటిసారి అడుగుపెట్టడమే సంభ్రమం కలగచెసింది. అంత పెద్దది. ఆ బ్లాక్ బోర్డు . ఫిజిక్సు పాఠాలే కాకుండా అక్కద చిన్నా పెద్దా సాంస్కృ తిక కార్యక్రమాలూ డిబేట్లూ ఇంకా యేవైనా సమావేశాలూ జరిగేవి. ప్రీ యూనివర్సిటీ లో మా అదృష్టమో దురదృష్టమో కాని తెలుగు పాఠ్యపుస్తకంలో మా ప్రిన్సిపాలు వసంతరావు వెంకటరావు గారు రాసిన జగత్తు జీవము అనే పాఠం వుండేది. ఆయన బహుశా చాలామందికి తెలిసే వుంటుంది ఫిజిక్సు మాస్టారు.కాని ఆయన రాసినది కావడం చాత ఆయనే చెప్పడానికి వచ్చేవారు.వినిజీర్ణించుకోవడం యెంత కష్టంగా వుండేదో ఆ తరవాత చాలా యేళ్ళకి బ్రహ్మానందం సినిమాల్లో ముఖభంగిమలు చూశాక మళ్ళీ గుర్తుకొచ్చింది. వెంకటరావు గారు కాలేజికి యెప్పుడూ పంచా ఖద్దరు జుబ్బా లోనే వచ్చే వారు.ఆయనకి పూర్తిగా వ్యతిరేకంగా కే ఎస్ రామకృష్ణరావు గారు యెప్పుడూ ఫుల్ సూటులోనే కాలేజికి వచ్చే వారు. ఆయన అంత సీరియస్ గా యెందుకు వుండేవారో పెద్దయ్యాక ఈ వాతావరణంలో సూటు వేసుకోవలసిన సందర్భాలు వచ్చినప్పుడు బాగా అర్ధమయ్యింది.ఇంతకీ వెంకటరావు గారి గురించి కదా చెప్పుతున్నాను. ఆయన యెప్పుడేమంటారో యెవరికీ తెలిసేదికాదు. మాటవరసకి ఒకసారి మా మిత్రుడొకడు ఉదయాన్నే కాలేజిలో ఆయనకి యెదురు పడి అలవాటు ప్రకారం చెయ్యెత్తి గుడ్ మార్నింగ్ చెప్పి వెళిపోతుంటే చొక్కా పట్టుకుని ఆపి రెండవ చెయ్యి లేవదా పక్షవాతమా అని గద్దించారు.ఇలాటివి ప్రత్యక్షంగా ఇబ్బందిగానూ పరోక్షంగా వినోదం గానూ వుండేఅవి. తరవాత చాలాయేళ్ళకి వారి అమ్మాయి నా దగ్గర రిసెర్చికి చేరడమూ వివాహానంతరం భర్తతో కలిసి వ్యాపారవేత్తగా యెదగడమూ జరిగాయి. మెట్లకి కుడి పక్కన ఫిజిక్సు లాబ్ వుంటుంది. దానిలోకి మరో సారి వెళదాం ఇప్పుడు ముందుకి వెళ్ళి కుడివైపు తిరిగి మళ్ళీ యెడమవైపు తిరిగితే రెండు క్లాసు రూములు వస్తాయి. అక్కడ తెలుగు ఇంగ్లీషు క్లాసులు అయ్యేవి. ఇది 1960 తరవాత మాట. 59-60 లో నేను మొదట చేరి నప్పుడు భాషా ఆర్ట్సు క్లాసులు రాజు గారి కోట లోపల రౌండు మహల్ అనబడే అంతః పురం లో జరిగేవి. రౌండు మహల్ జ్ఞాపకాలు చాలా రసవత్తరమైనవి. మరోసారి రాస్తాను

Saturday, July 21, 2007

thanks

యెందరో మిత్రులు సహృదయంతో పలకరించేరు. అందరికీ కృతజ్ఞతలు

i am ok

డాక్తరే రైటని తేలింది.నిన్ననే ఆంజియో ప్లాస్టీ చేసి చిన్నదాంట్లొనే కాని ఒక పెద్ద అడ్డమే ఉందని తేల్చారు.వచ్చే శనివారం ఒక బెలూను ఊది స్టెంటు పెడతారట. చేతిలో కన్నం పొడవడం చాత కొంచెం నొప్పి పెడుతోంది. రేపు మళ్ళీ కలుస్తా.

Tuesday, July 17, 2007

who ia right?

మెదడు మోకాల్లో ఉండడం అందరికీ తెలిసిందే. నా గుండె మోకాలు కిందకి దిగిందని అనుమానంగా ఉంది. ఎందుకంటే కాళ్ళు నొప్పిగా ఉన్నాయని మా డాక్టరు దగ్గరకెళితే మోకాలికీ బట్టతలకీ ముడేసినట్టు గుండె నాళం సగం మూసుకు పోయిందన్నాడు. నా హృదయ కవాటాలు యెప్పుడూ తెరుచుకునే ఉంటాయంటే గుండె వేరూ హృదయం వేరూ కావాలంటే రేపు హాస్పిటల్లో చేరు అంజియోగ్రాం తీస్తా అన్నాడు. కాసేపాగితే మరేమంటాడో అని వొప్పేసుకున్నా. నిజానికి అన్నాళ్ళు పిల్లలకి పాఠాల్లో చెప్పినవి నామీదే వాడతానంటే నాకూ సరదాగానే వుంది.నేను రైటయితే రెండ్రొజుల తరవాత ఎం ఆర్ కాలేజి మేడ మీదకి టూరు తీసుకెళతా. డాక్టరు రైటయితే మరొ రెండు రోజులు పడుతుందేమో. అందాకా ఓపిక పట్టండి.

Monday, July 16, 2007

here again

ఈ మధ్య ట్రాన్స్ లేషన్ అనబడే మంత్రసానితనానికి ఒప్పుకుని చాలానే పట్టుకోవలసి వచ్చి కాలయాపన జరిగింది. అంత లోనే మళ్ళీ ఒక అమ్మాయి టీ వీ లో నా పాట మళ్ళీ పాడింది[ చూ : నా పాత పోస్టు] చాలా మట్టుకు పాట గుర్తు వచ్చింది. తూరుపు దిక్కున సూరీదూ నిదురలేపి పిలిచేనూ పడమర దిక్కున యారాడా కొండ నిన్ను పిలిచేనూ ఊగిపోతున్నదీ సాగీపోతున్నదీ ఉయ్యాలగా పడవ వయ్యారి పడవా వల లోంచి కొర్రమీను జారిపోతది జాగరతా జారిపోతే నోటికాడ కూడుపోతదీ జాగరతా లాగరా నా చక్కనివోడా లాగరా నీ ఒడుపంతా సూపిలాగరా నావోడా లాగరా యీ సేపలన్నీ రూకలేనురా రేతిరికీ ఊగి పోతున్నదీ.. ఇంకా కొంచెం ఉండాలి. విజయనగర్ కాలనీ లో ఒక అద్దె ఇంట్లో ఉండే వాళ్ళం పది మంది స్కాలర్లం. ఆ కధలు చెప్పడం ఇంకా బాకీ ఉంది. ఆ ఇంట్లో పీ ఎస్ ప్రభాకర రావూ నేనూ ఒక వర్షా కాలం సాయంత్రం పక్కింటి పంజాబీ అమ్మాయి ఇచ్చిన టీ తాగుతూ ఈ పాట కట్టాం. అతను వరస అంటూ వుంటే నేను మాటలు చెప్పడం. నేను కొంచె ముందుకి పోతే అతను వరస కట్టడం.మధ్యలో ఇవీవీ భాస్కర్ ఇత్యాదులు ఒహొ అనీ చీ చీ అనీ అంటుండడం అలా సాగింది. పంజాబీ అమ్మాయి కి ట్యూషను చెప్పిన వైనం, ఈవీవీ భాస్కర్ కథా ఇంకా ముందు ముందు రాస్తాను.

Tuesday, July 3, 2007

m.r. college 3

మైన్ బిల్డింగుకీ లైబ్రరీ బిల్డింగు కీ విడిగా క్వాడ్రాంగిలు నాలుగో అంచుని నిర్దేశిస్తూ ఒక చిన్న భవనం వుండేది. అందులో లెక్కల విభాగమూ జియాలజీ విభాగమూ వుండేవి.ఎం పీ సీ విద్యార్ధిగా నాకు ఆ భాగం తో సంబంధం వుండడం సహజమే అయినా ఇంకా మరో ముఖ్యమయిన అనుబంధం కూడా వుంది.విజయనగరం కళల కాణాచిగా పేరొందడం అందరికీ తెలిసినదే అయినా ఇదో కమ్మని జ్ఞాపకం. మా లెక్కల లెక్చరర్ పేరిశాస్త్రి గారు అతికమ్మగా పాడే వారు. పాటలకి అతి మనోహరంగా వరసలు కట్టేవారు. విజయనగరం కాలేజి నించి విశ్వకళాపరిషత్తు యువజనోత్సవాలకు వెళ్ళే జట్లకు లలిత సంగీతమూ బృందగానాల్లో ఆయనే శిక్షణ ఇచ్చే వారు. సోమనాధం గారు నాటకాల్లో శిక్షణ ఇచ్చే వారు. దురదృష్ట వశాత్తూ నేను కాలేజికి వచ్చే నాటికి సొమనాధం గారు ఆ వ్యాపకం యెందుకో మానుకున్నారు. అయినా వారూ ఎం ఎస్ ఆర్ కే గారూ ఇతర అధ్యాపకులూ పేరిశాస్త్రి గారి శిక్షణ లో ఉత్సాహంగా పాలుపంచుకునేవారు.నాకు పాడడం అంత రాకపోయినా ఆసక్తీ, నాటకాల జట్టులో వుండడం నించి నేనూ ఆ శిక్షణలో వుండేవాణ్ణి. అన్నట్టు సోమనాధం గారు ఎన్ సీ సీ కమాండెంటుగా కూడా వుండేవారు. బీ సీ వంటి సర్టిఫికేట్లేమీ లేకపోయినా ఎన్ సీ సీ క్విజ్ పోటీల్లొ మాత్రం ప్రతిసారీ ప్రైజు వచ్చేది నాకు. ఆ ప్రక్కనే వున్న జియాలజీ విభాగం లో రామలింగశాస్త్రి కొత్త గా చేరారు. ఆయన నాటకాల్లో శిక్షణ ఇచ్చే వారు. ఆయన గురించి రాసేది ముందుముందు ఇంకా చాలా వుంటుంది. యెందుకంటే నేను యూనివర్సిటీ కి వచ్చే నాటికి ఆయన కూడా అక్కడికి మారి తరవాత కాలం లో మిత్రునిగా మారేరు.నిజంగా ఆ కాలేజిలో ఆ రోజుల్లో చదవడం పూర్వజన్మ సుకృతం. ఆగస్టు పదిహేనూ నవంబరు ఒకటీ యువజనోత్సవాలూ జనవరి ఇరవయ్యారూ స్థాపనోత్సవమూ అలా యేదో ఒక కార్యక్రమం పండుగలాగ జరుగుతూనే వుండేది.సహృదయులైన అధ్యాపకులూ అంతపెద్ద క్రీడాప్రంగణమూ విద్యార్ధి సంఘానికంటూ ఒక ప్రత్యేక భవనమూ యెంతో బాగుండేది.రాధికగారు రాస్తూ ఆ కాలేజి ని చూడాలని వుంది అన్నారు. నలభై మైళ్ళ దూరంలోనే వున్నా నేను విజయనగరం వెళ్ళి చాలాకాలమైంది. భయం. ఇవన్నీ వున్నాయో మారిపోయాయో అని. ఈ జ్ఞాపకాలు మాసిపోవడం భరించలేను.