Search This Blog

Friday, October 22, 2010

అసాసినేషన్

లిటరరీ అండ్ కల్చరల్ అసాసినేషన్ పేరు ఊరికే రాలేదు.ఒక సారి యువజనోత్సవాలలో ఏటుకూరి బలరామమూర్తి గారు వక్తగా వచ్చారు. ఆయన్ని పరిచయంచేస్తూ అప్పటికార్యదర్శి మహానుభావుడు కీర్తిశేషులు బలరామమూర్తిగారు అని సంబోధించాడు. వారు చిరునవ్వుతో నాకింకా కీర్తితోనేమిగలాలనిలేదు అనిసర్దుకున్నారు.

Thursday, October 7, 2010

ఇంకా ఎన్నెన్నో

కాన్వొకేషన్ లాగే మరో ముఖ్యమైన ఘట్టం ఎన్నికలు. పార్టీలు ప్రవేశించి ప్రతిష్ఠ దిగజార్చకముందు చాలా ఆనందదాయకమైన సమయం. పానెళ్ళని ఎన్నుకునేవాళ్ళం. పానెల్ లో అద్యక్షునిగా నిలబడే వాళ్ళకి వక్తృత్వ పోటీలు జరిగేవి. మంచి వక్తలే నిలబడే వారు మామూలుగా. ఎన్నికవడానికి ఆ డిబేటే ప్రధానంగా వుండేది. ఆంధ్రా యూనివర్సిటీ అద్యక్షులుగా ఎన్నికైన వారు ఐ ఏ ఎస్ వంటి వాటికీ లేదా ఇతర వున్నత పదవులనీ అధిష్టించడం మామూలే హెచ్ జె దొర ,వ్యాస్ వంటి ఐ ఏ ఎస్ అధికారులూ,భాస్కరప్రసాద్ వంటి ఐ ఏ ఎస్ ఆఫీసర్లూ అందరినీ మించి ప్రసన్నకుమార్ గారి వంటి విజ్ఞులూ ఆ జాబితాలో వున్నారు. ఎంత జనం వెనక వున్నా మంచి వక్త కాకపోతే ఎన్నికవడం దాదాపు అసాధ్యమే. అన్ని కాలేజీలూ కలిసి వుండడంతో ఆ రోజుల్లో ఇంజనీరింగ్ వాళ్ళూ సైన్స్ వాళ్ళూ అద్యక్షపదవికి అంతగా ఆసక్తిచూపేవారు కాదు.మహా అయితే బాగుండదని జాయింట్ సెక్రెటరీ గా వుండే వాళ్ళు. దీనితో పాటు హాస్టళ్ళ ఎన్నికలు కూడా కేతిగాడిలా వుండేవి. వాటిలో కూడా అన్ని సబ్జెక్ట్ల వాళ్ళూ కలిసే వుండడంతో మజాగానే వుండేది. . ఇక్కడ ఒక మాట చెప్పాలి. లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ అనేది ఒకటి వుండేది. దానికి లిటరరీ అండ్ కల్చరల్ అసాసినేషన్ అనె ముద్దుపేరుతో పిలుచుకునే వాళ్ళం. మరిప్పుడేమనాలో తెలీటంలేదు.

Sunday, August 15, 2010

మళ్ళీ విశాఖ కబుర్లు

కాన్వొకేషన్ గురించి రాస్తున్నానుకదా. కాన్వొకేషన్ అంటే ఆరోజుల్లో ఒక జాతరలాగే వుండేది.వారం రోజుల ముందునించే షెడ్స్ అనబడే హాస్టళ్ళ వరండాలలో గౌన్లు అద్దెకిచ్చే వాళ్లు మకాం వేశేవాళ్ళు. కాన్వొకేషన్ కి గౌన్ తప్పనిసరి.సాధారణంగా వాళ్ళందరూ తమిళులూ మళయాళీలూ వుండేవారు. కారణం తెలీదుకాని దక్షిణభారతంలోని యూనివర్సిటీలన్నిట్లోనూ వీళ్ళే వుంటారని అనుకుంటాను.మూడు రూపాయలిస్తే గౌను ఇచ్చేవారు.మంచిగా మాట్లాడితేనూ బతిమాలితేనూ తగ్గించేవారు.నవ్వొస్తుందేమోకాని ఆ రోజుల్లో 2 ప్లేట్ల టిఫినూ కాఫీకి అర్ధరూపాయే అయేది. లీలామహల్లో సినిమా టిక్కెట్టు రూపాయి పది పైసలు బస్సు టిక్కెట్టు పన్నెండు పైసలూ. రూపాయిన్నర తీసుకెళితే సినిమాప్రోగ్రామంతా అయేది-ఇంటర్వెల్లో ఐస్ క్రీం సోడాతోసహా.మరో విశేషం ఆ వారంలోనే యువజనోత్సవాలూ నాటక పోటీలూ జరిగేవి. రాష్ట్రంలో వివిధ కాలేజిలనించి వచ్చిన జట్లు నాటకాలాడేవి.జె వి డి ఎస్ శాస్త్రిగా వచ్చి తస్మాత్ జాగ్రత నాటకంలో ఉత్తమనటుడూ ఉత్తమ నాటకం ప్రైజు పొందిన వ్యక్తి జంధ్యాల గా సినిమారంగంలో ప్రసిధ్ధుడయారు. అది చాలాకాలం తరవాత జరిగింది. సమయం ఒచ్చినప్పుడు ఆ సంగతి. 63 లో నేను బి ఎస్ సి డిగ్రీ తీసుకున్నప్పుడు మావూరి మిత్రులతోనూ ఇక్కడి మిత్రులతోనూకలిసి స్టీవ్ మెక్వీన్ డర్టీడజన్ లీలామహల్లో సెకండ్ షో చూడ్డం ఒక మంచి జ్ఞాపకం.ఆ మోటార్ సైకిల్ రైడ్ మనసులో చాలాకాలం వుంది. ఇప్పటికీ సి డీ వేసుకుని చూస్తుంటానప్పుడప్పుడు.

Monday, August 2, 2010

పిడుగురాళ్ళ లో పోలార్ బేర్

మొహమాటానికి పోయి కొన్ని కాంట్రాక్టుల లంపటంలో చిక్కుకుని యేడాది పాటు పిడుగురాళ్ళ లో పోలార్ బేర్ లాగ బతికేను.సంతృప్తికరంగానే పేరూ ధనమూ వచ్చినా నేనెందుకు చేస్తున్నాను అనే చింత మిగిలింది. అదృష్ట వశాత్తూ సునీతా, అనూష్కా, కీరవాణీ కలిసి "ఎగిరిపోతే ఎంతబాగుంటుందీ" అంటూ నన్ను నాకు మళ్ళీ పరిచయం చేశారు. విశ్వవిద్యాలయం జ్ఞాపకాలమధ్యలోనే ఆగాను.అవి జ్ఞాపకాలు కావే --నా జీవితమే-ఆ మనుషులందరూ నా హృదయస్పందనలే. మనసా వాచా ఎప్పుడూ కలిసే వుంటాం.ఈ వారం నించీ మళ్ళీ జూలు విదిల్చి బూజు దులుపుకుని తప్పకుండా రాస్తాను-లేకపోతే నేను నేను కాకుండా పోతున్నట్టు అనుమానంగా వుంది.