Search This Blog

Sunday, May 11, 2008

my visakhapatnam

అరవైమూడు ఆగస్టులో నేను విశాఖపట్నం వచ్చాను.అంటే అంతకుముందు రాలేదనికాదు. విశాఖతో నా చిన్నప్పటినించీ అనుబంధం ఉన్నదే. మా చిన్నాన్నగారు యూనివర్సిటీ లైబ్రరీలో ఉద్యోగం చేసేవారు. ఆయనతో కలిసి యేడెనిమిదేళ్ళవయసులో లైబ్రరీకి వెళ్ళిన మొదటిసారే అక్కడ పెద్దపెద్ద పుస్తకాలు చదువుతున్న స్కాలర్లని చూసి యెప్పటికైనా నేనూ ఇక్కడ చదివి పరిశోధనలు[ అంటే యేమిటో తెలీకపోయినా యేదో చెయ్యాలని భావన] చెయ్యాలనే కోరికపాతుకుపోయింది.అది చెయ్యగలిగినందుకూ తరువాతకూడా కొనసాగించగలిగినందుకూ నాకు చాలా సంతృప్తేకలిగింది.అప్పట్లో లైబ్రరీ ప్రస్తుతం యూనివర్సిటీ ప్రెస్ ఉన్నచోట ఉండేది.ప్రస్తుత విషయానికొస్తే 63 లో వచ్చినతరువాత ఇదే నా వూరయింది.పధ్ధెనిమిదేళ్ళ వయసునించి అరవైరెండేళ్ళదాకా నేనెంత యెదిగానో యెంత మారానో విశాఖ కూడా అంత యెదిగింది. అయినా నేను అశోక్ నే అయినట్టుగానే విశాఖ కూడా వ్యక్తిత్వం పెంచుకుంది గాని మారలేదనే నాకనిపిస్తుంది.యే మనిషి జీవితంలోనైనా వివిధ స్థాయిలుంటాయి. 63 కి ముందు విజయనగరంలో నేనెన్ని చేసినా యేం చేసినా మా అమ్మానాన్నల కొడుకుగానే. నాకంటూ ప్రత్యేకత అప్పటికి లేదు. విశాఖ వచ్చిన మొదటి సంవత్సరమూ కొంత అలానే గడిచింది. మా తల్లిదండ్రుల సహాధ్యాయులెందరో ప్రొఫెసర్లగానూ ఇతరత్రానూ ఇక్కడ వుండడం ఒహో నువ్వటొయ్ అంటూ పలకరించడం జరిగేవి. నెమ్మదిగా నాకంటూ ఒక వ్యక్తిత్వం నేనేంచేస్తున్నానో దానికి నేనే జవాబుదారీ అన్న బాధ్యత పెరిగేయి. 66లో నేను రిసెర్చ్ కి చేరే సమయానిక్ నాకు ఒక గుర్తింపూ స్థాయీ తెచ్చుకోగలిగాను . అప్పటినించీ మూడో దశ.

No comments: