Search This Blog

Wednesday, May 7, 2008

dabbuludabbulu

విజయనగరం జ్ఞాపకాల్లో క్రికెట్ సంబంధితాలు కొన్ని. సర్ విజ్జీ అనబడే విజయానంద గజపతిగారు క్రికెట్ లోకానికి చిరపరిచితులు. ఆయన పి వి జి రాజు గారికికి పినతండ్రి. వారణాసిలో వుండేవారు [వున్నప్పుడు]. ఆయన్ని కాశీ రాజు గారని పిలవడమూ కద్దు. విశాఖ పార్లమెంటు మెంబరు గా వున్నారు.[విజయనగరం చాలారోజులు విశాఖ స్థానంలో భాగమే.] ఆయనకి రాజకీయాల్లో ఆసక్తి లేకపోయినా రాజు గారు కదామరి. ఆయన పూర్వీకుల వూరికి వచ్చి కోటలో బస చేసినప్పుడు క్రికెట్ ఆడే కాలేజ్ కుర్రాళ్ళందరినీ పిలిచి ఒక ఆట ఆడించి చూసి వెళ్ళే వారు[కాలేజ్ కైనా రాందే క్రికెట్ గురించి తెలిసినవాళ్ళు ఆ రోజుల్లో వుండేవారు కాదు] రాజభోజనాలు తినడం కోసం అందరూ చేరే వాళ్ళం. అలాంటి ఒక రోజు వాన పడింది. ఆట లేదుగా మరి. రాజావారు కారెక్కి కోటకి వెళిపోయేరు. భొజనాలు మాత్రం రెడీ. ఆయనంటే కారులో వూరేగారు కాని మేం తడుసుకుని యేం వెళ్తాం . అక్కడే పెవిలియన్ అనబడే అయోధ్య మైదానపు ముందు భాగంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. మాటో పాటు ఒక పెద్ద రాజు గారు కూడా ఉన్నారు.ఆయన పేరు చెప్పను. మాకన్నా పెద్ద వారు, తరువాతి కాలంలో విద్యారంగంలో అనేక ప్రముఖ పదవులని అలంకరించేరు. ఆయన కాళ్ళు సాగదీసుకుంటా అని లేచి కొంచెం పచార్లు సాగించేరు.వాన కదా ఆక్సిడెంట్లు సహజం. జారిపడ్డారు. తొందరగానే లేచి సర్దుకున్నారు. కాని కొందరికుండే కోతిబుధ్ధి నిరంతరం వుంటూనే వుంటుంది కదా. మాధవరావు అప్రయత్నం గానే రాజుగారూ డబ్బులు డబ్బులు అని అరిచినట్టు అన్నాడు. అంత పెద్దమనిషీ మళ్ళీ మోకాళ్ళమీద కూచుని పాకుతూ యేవీ యెక్కడ అని వెతుకుతుంటే మా మొహాలు మీరు ఊహించుకోగలరుకదా. దరిమిలా అనేక మీటింగుల్లో ఆయనతో పాటు కూర్చున్నప్పుడల్లా ఈ ఘట్టం గుర్తుకిరావడమూ నవ్వాపుకోడానికి విశ్వప్రయత్నమూ చెయ్యాల్సి రావడమూ వేరే సంగతి.