Search This Blog

Thursday, May 22, 2008

విశాఖలో ప్రవేశం

1963 ఆగస్టులో నేను యూనివర్సిటీ కి వచ్చేను. అంతకుముందురోజేవచ్చి రూము తెలుసుకున్నాక ఆ రోజు సామానుతో వచ్చేను. వచ్చింది మా కారులోనే కనుక నాతో బాటు మా రామచంద్రమూర్తీ వాళ్ళనాన్నగారు రమణమూర్తి మాస్టారూ కూడా వచ్చేరు.ఇప్పుడు గుర్తించేను. ఇన్నాళ్ళ విజయనగరం జ్ఞాపకాలలో వీళ్ళిద్దరి ప్రసక్తీ రానేలేదని. యెంత పొరపాటు.తొందరలోనే దిద్దుకుంటాను. రామం పుట్టినరోజు నిన్నే అయింది.వాడు ఎం ఎస్ సీ కెమిస్ట్రీ లో చేరాడు. మా ఇద్ద్దరికీ వేరు వేరు రూములు వచ్చేయి. మేం పట్టించుకోలేదు. పిఠాపురం రాజావారి వేసవి విడిది మా హాస్టలు.ఇల్లు లాగే వుండేది. ఒక పక్కగా కాంపౌండు గోడకి చిన్న గేటు. దాంట్లోంచి వెళితే మూడు గదులు. మూడింటికీముందు అరుగులు. ఒక కొళాయి. బలే సరదాగా వుండేది.నేను వెళ్ళేటప్పటికి ఆ గదిలో శివశంకరం గారూ,గంటి సూర్యనారాయణమూర్తిగారూ వున్నారు. వారు అంతకు ముందు సంవత్సరం ఆ గదిలో వున్నారు.ఎం ఎస్ సీ ఫైనల్ కి వచ్చి మరో రూముకి వెళ్ళే ప్రయత్నంలో వున్నారు. శివశంకరంగారు యెక్కడ వున్నారో తెలియదుకాని మూర్తిగారితో నా స్నేహం ఇంకా కొనసాగుతోంది.తరవాత నా రూం మేట్లుగా పిల్లలమర్రి త్రిమూర్తీ ఆనం వెంకటదాసూ వచ్చేరు.ఒక్కోళ్ళూ ఒక పోస్టుకి వస్తారు. మా రామం రూములో ఒకాయన వుండే వారు.ఆయన పేరేమిటో గుర్తులేదుకాని ఆయన తమ్ముడు ఎన్ సీ విజయా కూడా వుండేవాడు. అతనితో పరిచయం గాఢ స్నేహంగా మారి అతను ఐ ఐ టీ కాన్ పూరుకి వెళ్ళేదాకా గడిచింది.దూరం వున్నా స్నేహం స్నేహమే. అతని గురించి ఒక పుస్తకమే రాయచ్చు.ఇంకొన్ని పరిచయాల తరవాత జ్ఞాపకాల వరస మొదలు పెడతాను

No comments: