Search This Blog

Sunday, October 28, 2007

paiditalli

టెలివిజన్లో వార్తావాహికలు తామరతంపరగా పెరిగిపోవడంతో చూపించడానికి వస్తువులు వెతుక్కుంటున్నారు. యేతావాతా విజయనగరం పైడితల్లమ్మ జాతరని చూడడం జరిగింది. నేను చెపుతూ వచ్చిన మా ఇల్లూ ఆ పక్కన ద్వారం వారుండిన ఇల్లూ అవీ అలానే వున్నట్టు అనిపించింది. కాస్మెటిక్ మార్పులూ కొంచెం కమ్మర్షియల్ మెరుగులూ తప్పితే వూరు పెద్దగా మారినట్టనిపించలేదు--తెలుగు సినిమాలా-- మా ఇంటి యెదురుగా కో ఆపరేటివ్ బాంకు ఉందని చెప్పాను కదా ఆ భవనంలో ఒక పక్క మేడమీద గెస్టు రూములు ఉండేవి. అందులో ఒక దానిలో ఒక ఆఫీసర్ చాలాకాలం ఉండేవారు. చాలా యెర్రగా సన్నగా కొంచెం పొడుగ్గా ఉండేవారు. ఆయన్ని బల్లి గాడని ముద్దుగా పిలుచుకునే వాళ్ళం. మాకెవరికీ పెద్ద పరిచయం లేకపోయినా.ఒకసారి యెందుకో ఆయన రూముకి వెళ్ళడం తటస్థించింది. ఆయన టేబుల్ పైనా అలమారలోనూ ఉన్న పుస్తకాలూ చూసి ముగ్ధుణ్ణయాను. ఆంధ్ర సాహిత్యంలో చెప్పుకోదగ్గ పుస్తకాలన్నీ ఆయన వద్ద వున్నాయి.ఆయన మీద గౌరవం పెరిగింది. బల్లిగాడని పిలవడం మానేశాం. చదువుకున్న బల్లి అనడం మొదలుపెట్టాం.

Friday, October 19, 2007

happy dasara

మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు. విజయనగరంలో మేమొకప్పుడుండిన ఇంటి సంగతి చెప్పుకుంటున్నాం కదా. మొదట్లో ఆ ఇంటిలో మేడపైనే వుండేవాళ్ళం. నాకు బహుశా అయిదేళ్ళుంటాయేమో. ఆ మేడమెట్లపైనించి మొగ్గలేసుకుంటూ కింద పడ్డాను.తలమీద కూడా లాండయ్యాను. అందుకే కొంచెం వెర్రి యెక్కువేమోననిపిస్తుంది అప్పుడప్పుదు. నిజానికి అప్పటికి నేను చూసిన కొన్ని సినిమాల బట్టి చచ్చిపోవడమో పిచ్చెక్కడమో లేక అన్నీ మరిచిపోవడమో అవాలి. యేదీ కాకపోవడం నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమాలని నమ్మడం అప్పట్నించే మానేశాననుకుంటాను. ఆ రోడ్డు మీద మా ఇంటి తరవాత రాజు కిరాణా కొట్టుండేది.దానికెదురుగా లాయరు మొసలికంటి రామారావు గారి యిల్లు ,దాని పక్కన ఒక మిఠాయి షాపు. రాజు కొట్టు తరవాతే చిదంబరం కొట్టు.చిదంబరం కొట్టు తరవాత ఒక ఫాన్సీ షాపు ఉండేది. ఆ షాపు మాత్రం చాలారోజులుంది. మా పిల్లలకి కూడా అవీ ఇవీ కొనిపెట్టే వాళ్ళం. మరి ఇప్పుడుందోలేదో తెలియదు. అదే ఆ రోడ్డు కార్నర్.రోడ్డెదురుగా కోఆపరేటివ్ సెంట్రల్ బాంక్ ఉంటుంది. ఆ జంక్షన్లో ఒకసారి లారీ కింద పడబోతుంటే ఒక రిక్షా వాడు తృటిలో వెనక్కి లాగేడు.ఆ జంక్షన్లో యెడమ వైపు తిరిగితే కోట ముఖద్వారానికి వెళతాం. కుడిసైడు కార్నర్లో ఒక కర్రల అడితీ ఒక కిళ్ళీ కొట్టూ ఉండేవి.వెనక కందకం, కోటగోడా. ఇప్పుడా కందకం అంతా కప్పేసి షాపింగ్ కాంప్లెక్సులు కట్టేరని నాగరాజుగారు మైల్లో చెప్పారు.యెడమపక్క తిరిగితేఫాన్సీ షాపు పక్కన ఒక సైకిల్ షాపు తరవాత నేను కాలేజ్ కి వచ్చాక మేం ఉన్న ఇల్లు దాని పక్కన మా చిన్న తనంలో ద్వారంవెంకతస్వామినాయుడు గారుండిన ఇల్లు వస్తాయి.ఆ జ్ఞాపకాలు మరోసారి

Tuesday, October 16, 2007

saahityam

నిన్న యేదో సందర్భంలో ఉండమ్మాబొట్టుపెడతా లోని యెందుకీసందెగాలి అన్న పాట వినడం తటస్థించింది. ఆ తరవాతే సన్నగవీచే చల్ల గాలికి అన్న పాట--అప్పుడనిపించింది. ఈనాటి సినిమాల్లో కూడా ఇలాంటి సంగీతమూ కవిత్వమూ ఉంటే మనుషుల్లో ఈ నాడున్న కంగారూ అభద్రతా ఉండవేమోనని.నిజంగా ఆ రోజుల్లో డిగ్రీ క్లాసులో ఇంగ్లీషు తెలుగు సాహిత్యం విభిన్న పాత్రల స్వభావాలూ చిత్రీకరణా అన్నీ చెప్పడం జరిగేది. నిజంగా వాటిని జీవితంలో అనుసరించకపోయినా ఇది మంచిది వీడు మంచివాదు లేకపోతే ఇలా ప్రవర్తిస్తే మంచివాడంటారు అనే విచక్షణ కొంచెమైనా మనసులో నాటుకునేది. చెడ్డపని చేసినప్పుడు అంతరాంతరాలలోనైన కొంత జంకుగా వుండడం అలాంటివి చాటుగా చెయ్యడం ఉండేవి.సాహిత్యం మన జీవితంలో పోషించే పాత్ర అంచనాలకి అందనిది.మరీ భాషాజ్ఞానం అదీ మాట్లాడడానికి సరిపోయేంత అని నిర్దేశించి ఒక తరం ప్రవర్తనా సరళిని ప్రభావితం చేశారనిపిస్తొంది.

Saturday, October 13, 2007

vijayanagaram

నిన్నటి పోస్టు మిత్రుల్లో కూడా జ్ఞాపకాలని కదిపింది. టాన్ తీటా అన్న పేరు ఇంకా సన్నని సన్నజాజులకి వాడుతూనే వున్నామని ఒక మిత్రులన్నారు. అలాగే ఇంకో అమ్మాయి ఉండేది. కొంచెం మిరపకాయ తత్వం ఉండేది. వాళ్ళ నాన్న గారు అగ్గిపెట్టెల కంపెనీ డీలరు. ఆ పిల్లకి అగ్గిపెట్టె అని పేరుండేది. ఈ పేరు ఇప్పుడుండే అవకాశం లేదు.. ఉదయగిరివారింటిదగ్గిర ఆగాం కదా. కొంచెం ముందుకి వెళితే లలితావిలాస్ స్కూలు వస్తుంది. రోడ్దు మీంచి కొంచెం లోపలికి వెళ్ళాలి లెండి. ఆలోపలికి వెళ్ళేటప్పుడు జీవీరమణమూర్తీ వాళ్ళ ఇల్లు వస్తుంది. వాణ్ణి మరణమూర్తి అంటే గింజుకునేవాడు. ఇది దాటి రోడ్డు మీద ఇంకా ముందుకి వెళితే గురజాడ అప్పారావు గారి ఇల్లు వస్తుంది. మా చిన్నప్పుడు ఆ యింట్లో అప్పారావు గారి పుత్రులు రామదాసు గారూ కుటుంబమూ వుండేవారు.ఒక భాగం స్థానిక గ్రంధాలయానికి అద్దెకి ఇచ్చారు.ఆ యింటి యెదురుగా ఒక సందు వుంది. ఆ సందులో లోపలకి వెళితే నా చిన్న తనం చాలా భాగం గడిచిన ఇల్లు వస్తుంది. ఆ ఇంటి పక్కింట్లోనే ద్వివేదుల నరసింగరావు గారూ, తరువాత కొత్తపల్లి వీరభద్రరావు గారూ వుండే వారు.రోజూ స్కూలుకి అప్పారావు గారి ఇల్లు చూసుకుంటూనే వెళ్ళే వాళ్ళం. అందుకేనేమో సాహిత్యాభిరుచి ఇంతో కొంతో జీర్ణమయింది.సందులోకి వెళ్ళకుండా ముందుకి వెళితే యెడమవైపు నేను మరీ చిన్నవాడిగా ఉన్నప్పుడు వున్న ఇల్లు వస్తుంది. మేము ఆ ఇంటిలో ఉన్నప్పుడు అరుణా అసఫ్ అలీ, సొహన్ సింఘ్ భాక్నా ,భూపెష్ గుప్తా , జ్యొతీ బసూ మొదలయిన అనేకులు మా యింటిలోనే ఆతిధ్యం పొందారు. ఆ ఇంటి లో ఒక రెందు వందల మంది దాకా కూర్చొ గలిగే ఆరుబయలు వసారా వుండేది. ఆ వసారాలో కూర్చుని మా నాన్నా, అమ్మా , బావామరుదులైన తరిమెలనాగిరెడ్డి గారూ నీలం సంజీవరెడ్డి గారూ ఇల్యా యెహ్రెంబెర్గ్ 'థా' నవల గురించి చర్చించుకోడం లీలగా గుర్తుంది.నాగిరెడ్డిగారి ని చూసి అంత గొప్ప వ్యక్తి చార్మినార్ సిగరెట్లు కాల్చడం నాకు వింతగా అనిపించేది. ఇంకా స్మృతులు రేపు .

Thursday, October 11, 2007

hello friends

చాలా కాలమైంది మిత్రులందరినీ పలకరించి.నేను హస్పిటల్ నించి వచ్చిన తరువాత ఒక నెల రోజులు నన్ను చిన్నపాపలా చూసుకున్న నా భార్య కొంత అస్వస్థురాలవడంతో సమయం చిక్కలేదు. మధ్యలో కుంభవృష్టి- యెప్పుడూలేనంతగా మా యింటిలోకి కూడా నీళ్ళు రావడం గందరగొళం అంతా సందడిగా గడిచిపోయింది. యిప్పుదు అంతా కుదుటబడింది. విజయనగరం జ్ఞాపకాలలో కాలేజ్ వర్ణణ తో మళ్ళీ అక్కడ తిరుగుతున్న అనుభూతి కలిగింది. కాలేజ్ ఊరిమధ్యలోనే వుంది.--ఆ రోజుల్లో. యిప్పుడు మరి వూరెంత పెరిగిందో ఒకసారి వెళ్ళి చూడాలి. నలభై మైళ్ళ దూరంలోనే వున్నా యింతకు ముందే చెప్పినట్టు మనో చిత్రాలేవి చెరిగిపోవలసి వస్తుందో అనే భయం వెళ్ళనీకుండాచేస్తోంది. కాలేజ్ మైన్ గేట్ నించి యెడమవైపు ఒక పెద్ద రోడ్డు వెళుతుంది. మా యింటికి వెళ్ళే దారి అదే.కాలేజ్ యెదురుగానే ఒక చిన్న రామాలయం ఉంది. ఆ రోడ్డు మీద కొంచెం ముందుకి వెళితే ఒక రెండంతస్థుల యిల్లు వస్తుంది. ఆ యింటిలో అప్పుడు ఒక తమిళ కుటుంబం వుండేది. వారమ్మాయి , జయలక్ష్మి అని గుర్తు, మాకు మూడు నాలుగేళ్ళ సీనియర్. అందంగానే వుండేది. చాలా సన్నగా పొడుగ్గా ఉండేది. విద్యార్ధులందరూ ఆప్యాయతతో ఆమెని టాన్ తీటా అని పిలుచుకునే వారు. ఆ యింటి తరవాత రోడ్డు యెడమ పక్కకి తిరుగుతుంది. ఆ రోడ్డు ని ఆను కుని రాజా వారి కోట గోడా దాని చుట్టూ కందకం.అక్కడ కుడిపక్కకి ఒక మట్టి రోద్దు వుండేది. దాని సంగతి తరవాత. మన మైన్ రోడ్డు మీద ముందుకి వెళితేఉదయగిరిసీతారామస్వామి గారి యిల్లు వస్తుంది.ఆయన పెద్ద లాయరు, నేను చిన్నప్పుడు చదివిన లలితా విలాస్ స్కూలు మేనేజరు. వారమ్మాయి వుమన్స్ కాలేజ్ లో లెక్చరర్ గా చేసింది. మేం చదివే రోజుల్లో వుమన్స్ కాలేజ్ లేదు. వారబ్బాయి మాధవరావు మాకు కొంచెం సీనియరే అయినా మిత్రుడు చిన్నప్పుడు అందరం ఆడుకునే వాళ్ళం. ఈ మధ్యనే బాచ్ మేట్స్ సైటులో కలిసి పలకరించాడు. జ్ఞాపకాలు ముంచెత్తుకొస్తున్నాయి. కొంచెం వడబోసి మళ్ళీ రాస్తాను.