Search This Blog
Tuesday, May 27, 2008
రాజావారి విడిదిలో దెయ్యం
ఒకటి రెండు రోజుల్లో నా రూమ్మేట్లిద్దరూ వచ్చి చేరారు. పిల్లలమర్రి త్రిమూర్తిది గుంటూరు.ఎం ఎస్ సీ కెమిస్ట్రీ చదవడానికి వచ్చేడు. వాళ్ళ నాన్న గారు పిల్లలమర్రి హనుమంతరావుగారు హిందూ కాలేజి లో తెలుగు ఉపన్యాసకులు. ప్రసిధ్ధులు. మా నాన్నగారికి యూనివర్సిటీలో సమకాలీనులు. పండిత పుత్రుణ్ణి కన్నవారు. త్రిమూర్తి మిగిలిన సంగతులేమైనా మంచి మిత్రుడు. ఇక వెంకటదాసు నెల్లూరు జిల్లా వెంకటగిరి నించి వచ్చేడు. మా ఇద్దరికన్నా వయస్సులో కొంచెం పెద్దవాడు.లైబ్రరీ సైన్సు డిప్లొమా [ఆ రోజుల్లో డిప్లొమా నే వుండేది] చదవడానికి వచ్చేడు. మాకు మిత్రులమవడానికి యెక్కువ సమయం పట్టలేదు. మహా అయితే అరగంట. ఆంధ్రా యూనివర్సిటీ జీవితం నాకు అనేక ప్రాంతాలనీ అక్కడి మనుషులనీ పరిచయమేకాదు-నా స్వంతమనేంతగా చేసింది. అప్పుడు ఈ రోజుల్లో లాగ అన్నికాలేజిలుగా విభజనలేకపోవడం వల్ల అనేక సబ్జెక్ట్లు చదివేవాళ్ళమందరం ఒకే చోట వుండి భావాలనీ జ్ఞానాన్నీ పంచుకోవడం మా మనస్సుల్ని విశాలం చెసింది. మేం ముగ్గురం మొదటిరోజు రాత్రి కబుర్లు చెప్పుకుని చెప్పుకుని నవ్వుకుని నవ్వుకుని నవ్వుకుని యే రాత్రికో నిద్రపోయాం. కొంత సేపటికి మధుర మనోహర స్వరంతో గానం .....యెవరో గంధర్వులు దిగివచ్చారా అనిపించుతూ నిద్రలేపింది. నిజమా కలా అనుకుంటూ నేనూ త్రిమూర్తీ లేచాం. బయటకి వెళ్ళి చూస్తే యెవరూ కనిపించలేదు. రాజావారి వేసవి విడిదిలో యెవరైనా దయ్యమై తిరుగు తున్నారేమో అనిపించింది. కొంచెం ముందుకి వెళ్ళి చూశాం. పక్క రూము లో లైటు వెలిగింది. అప్పుడు మొదటిసారి చూశాను గౌరీపతి శాస్త్రిని. ఆ రాగానికి ముక్తాయింపు మొదలు పెట్టాడు. దెయ్యాన్ని కాదు మనిషినేలే పొద్దున్న మాట్లాడుకుందాం వెళ్ళి పడుకోండి అన్నాడు. అలా ప్రారంభమైన ఆ స్నేహం చిరకాలం కొనసాగింది. అతని కబుర్లు చాలా వున్నాయి. కొద్ది కాలం కింద అతని అకాల మరణం దాకా ఆప్తులుగానే వున్నాం. మా అబ్బాయిలకి కూడామిత్రుడే అయ్యాడు. ఇంకా బొలెడంత వుంది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment