Search This Blog

Friday, October 19, 2012

తమ్మావారు

అప్లైడ్ ఫిజిక్సులో నా చదువు ని గురించి చెప్పేటప్పుడు తమ్మా కామేశ్వరరావుగారిని తలుచుకోకుండా ఉండడం చాలా కష్టం.సాత్విక భోజనంలో నంచుకోడానికి పచ్చిమిరపకాయలాగ ఆరోజుల్లోని ఫాకల్టీలో ఆయనొక్కడే కాస్త సెన్స్ అఫ్ హ్యూమర్( క్షమార్హుడిని ఎంత ఆలోచించినా దీనికి తెలుగు పదం కొన్నేళ్ళుగా దొరకడంలేదు) ఉన్న మనిషి.మిగిలినవారంతా బిగుసుకు పోయి ఉండేవారు.        
అంతేకాకుండా ఆయన చాలా వాక్శుధ్ధి ఉన్న ఉపాథ్యాయుడు.నాఉద్దేశం ఆయన ఏదైనా చెపితే అది కళ్ళకి కట్టినట్టు అనిపించేది.కళ్ళముందు హోలోగ్రామ్ లాగ ఆడేది. దీనికి మంచి ఉదాహరణ టార్షన్ స్ట్రైన్ గురించి ఆయన మాకు చెప్పినది. కేవలం చేతులు తిప్పుతూ టార్షన్ వల్ల వస్తువు ఏరకంగా విరుగుతుందో ఆయన చూపిన తీరు యిప్పటికీ
ఏభై ఏళ్ళతరవాతా నా కళ్ళముందు కదుల్తోంది. ఒక రకంగా ఆయన నాకు ఇన్ స్పిరేషన్ అని చెప్పాలి. ఆ మహాను భావుడి కొరడాల్లాంటి రిపార్టీలు చాలా ఉన్నాయి సందర్భాన్ని బట్టి చెప్తాను.

Sunday, August 5, 2012

60లలో ఆంధ్రా యూనివర్సిటీ కేంటీనుకి భలే పేరుండేది. ఎక్కడెక్కడినించో మనుషులు వచ్చి టిఫిన్లు తినేవారు.మా మిత్రుల జీనితాలలో దాని పాత్ర చాలా పెద్దది. లెక్కలేనన్ని గంటలు అక్కడేగడిపాము కబుర్లతో సరదాలతో. అక్కడి సర్వర్లుకూడాచాలా సరదాగా ఉంచేవారు. ఒకసాయంత్రం మిత్రులందరమూ కూడి ఉండగా ఒకరు ఉల్లి గారె, ఒకరు ఉల్లి దొశ ఇలా చెప్పుతుండగా చివరి వాడు ఉల్లి కాఫీ చెప్పాడు....
సర్వరు  మామూలుగానే వెళిపోయి అందరితోపాటు వాడికీ తెచ్చాడు.కప్పులో కాఫీ, సాసర్లో ఉల్లిముక్కలూ.

Saturday, March 3, 2012

రిప్ వాన్ వింకిల్

నేనుచాలా కాలంగా పోస్ట్ చెయ్యడానికి బద్ధకిస్తున్నానన్నది పదహారణాల (పాతరోజుల గురించి కదా ) పచ్చి నిజం. ఫేస్ బుక్ లూ ట్విట్టర్లూ పనిజరిపించెస్తున్నాయనడం కూడా నిజమే.సౌమ్యగారి కామెంట్ లేక పొతే మరి బద్ధకం వదిలేదో లేదో తెలియదు.నేనురాసేవన్నీ ఒకానొక సంధి యుగం లో యువకుని అనుభవాలు ఏభై సంవత్సరాల తరవాత గుర్తుచెసుకుని రాసినవి.

సంధి యుగం దేనికంటే ఆ రోజుల్లోనే కాసియస్ క్లే మహమ్మదాలీ అయ్యాడు.ఆ రోజుల్లోనే బీటిల్స్ ఆవిర్భవించారు. డిలాన్ థామస్ మనసులని వెలిగించాడు.మా ముందు ఆట చూపిన చంద్రశేఖర్ సునీల్ లాటివారు ప్రపంచం మనసు దోచారు. నక్సలైట్ ఉద్యమం మా మిత్రులు, పరిచయస్తులు ఎందరివో ప్రాణాలు తీసుకుంది. ఇలాటి యుగంలో రాడికల్ వాతావరణం లోపుట్టి పెరిగిన యువకుని భావాలెలా వున్నాయి కుర్రవాడిని మనిషిగా ఎలా మారాను ,ఒకానొక గిల్టీ భావం నించి బయటికి వచ్చినదెలాగో నాకే తెలీనిది ఎలా రాస్తానో మరి. అందుకేనేమో ఆలస్యం.

రేపో ఎల్లుండో ఒకసారి విజయనగరం వెళదామనుకుంటున్నాను. మరోసారి ఆ , మాహౌల్ , అన్నమాట బాగా సరిపోతుంది.. తెలుగులో సరైన పదం పరీశోధించాలి. ని అనుభవించి మనసేమైనా తిరిగి వెలుగుతుందేమో చూస్తాను.