Search This Blog

Thursday, March 29, 2007

మళ్ళీ విజయనగరం చిన్న నాటి జ్ఞాపకాలకి. మాకు హైస్కూలులో లాఠం చెప్పిన వారిలో బలిజేపల్లి గోదావరిరాజుగారు ఒకరు. చక్కని పంచకట్టుతో మల్లెపువ్వు లాంటి జుబ్బాతో మూర్తీభవించిన తెలుగు హుందాతనం నడిచి వస్తున్నట్టుండేది ఆయన క్లాసుకి వస్తుంటే. యెస్ వీ రంగారావు గాత్ర గాంభీర్యం లేకపోయినా ఆకార గాంభీర్యం మాత్రం వుండేది. ఆ రోజుల్లో మాస్టర్లంటే భయం ప్రేమా రెందూ కలగలిపి వుండేవి. వారు మాకు సోషల్ స్టడీస్ చెప్పేవారు . ఆ మహానుభావుల వద్ద చదవ బట్టే అర్ధశతాబ్దం కింద చదివిన హిస్టరీ జాగ్రఫీ ఇంకా గుర్తున్నాయి. వారి కుమారుడు రామమోహన రావు గారు మెడిసిన్ చదివారు . ఆయన లాగ చదువు కోవాలని చెప్పే వారు మాకు.ఒక సారి మాస్టారు ఒక నెలానెలన్నర పాటు స్కూలు కి రాలేదు. చెప్పద్దూ మాకు కొంచెం పండగ లాగే వుంది అప్పుడు. తరవాత పెద్ద వాళ్ళు అనుకుంటుంటే తెలిసింది. రామమోహనరావుగారూ గాయని సుశీల గారూ ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారనీ.ఆ పెళ్ళి కి పెద్దలు ఇష్టపడలేదనీ. ఇద్దరూ ఒక వూరి వారే.ఒక కులం వారే. లబ్ధప్రతిష్ఠులే. అయినా పెద్దల అహంకారాలు అడ్డం వచ్చాయి. తరువాత అంతా మామూలయిందనే అనుకుంటాను. ఆ రోజుల్లో చూచాయ గానే తప్ప పెద్దల విషయాల్లో జొక్యం పిల్లలకి అంతగా వుండేది కాదు .

No comments: