Search This Blog

Sunday, March 30, 2008

hindiitelugu

హిందీకి అంతగా ప్రాచుర్యం లేని వూళ్ళలో హిందీ సినిమా చూడడం ఒక తమాషా అనుభవం.ఒక సారి విజయనగరంలో ముఘల్ యె ఆజం సినిమా చూస్తున్నాము. మొదటిసారి రిలీజయినప్పటి సంగతి. పృధ్వీరాజ్ కపూర్ గంభీర కంఠంతో తహ్ లియా అని గర్జించాడు. మా ముందు కూర్చున్న ఇద్దరిలో ఒకడు యేటన్నాడురా అని అడిగేడు. యేట్నేదురా అని విదిలించుకున్నాడు రెండోవాడు. సందేహం తీరకపోతే మనసూరుకోదు కదా ! మళ్ళీ అడిగేడు. యేటన్నాడురా అని. ఈ సారి కొంచెం అసహనంగా. మరేట్నేదురా , ఆళ్ళందర్నీ దెం......మన్నాడు!!! ఇలాగే మరోసారి వో కౌన్ థీ చూస్తున్నాము. సినిమా అయిపోయే దగ్గరిలో మా ముందువాడు అతిసంతోషంగా అదీ అని అరిచేడు. పక్కవాడితో చెప్పాడు. తెలిసిపోనాదిరా . ఈ బొమ్మలో సాధనా డబల్ ఫొటో యేసినాది.

Sunday, March 23, 2008

narayanamurty

సారధి ఒక స్పెసిమెన్ అయితే నారాయణమూర్తి మరోటి. వాడి నాన్నా విజయనగరంలో పేరున్నాయనే. పెద్ద డాక్టరుగారు. సహజంగానే మాకు బాగా తెలిసిన కుటుంబం.మేధకుడు అన్న మాటకి ప్రాణం పోస్తే నారాయణమూర్తి అవుతాడని అందరూ అనే వాళ్ళు. నాకు మాత్రం అది నచ్చలేదు. అదే నిజమయితే పరీక్షలెలా పాసవుతాడు?కాలేజ్ దాకా యెలా వస్తాడు?కాలేజ్ కి వచ్చినాగాని వాడి ఇష్టాలు మారలేదు. బాధ్యతలూ అబ్బలేదు[ నాకో పెద్ద బాధ్యత యేడిచినట్టు ఆ వయసులో అందరమూ అంతే కదా!] కాని నారాయణమూర్తి కొంచెం స్పెషలే. యెందుకంటే సారధి లాగానే వాడూ ఒక పరీక్ష రోజున ఎనిమిదిన్నరకల్లా వెళిపోదామనుకున్నాడు.వెళ్ళనివ్వకపోతే యేం చేస్తాడు మరి. పాపం సీటు లోనే కూర్చున్నాడు. అరగంట కూర్చోవాలి కదా. తోచద్దూ... కొంచెంసేపు బెంచి మీద టైపింగు చేసాడు. టట్టటట్ట అంటూ. మేమందరమూ కూడా శృతి కలుపుతామేమో అనే అనుమానం వచ్చేక వాణ్ణి ఆపారు.ఇంకేం చెయ్యాలి? కొశ్చన్ పేపరు దొరికింది. రెండు ముక్కలు చేశాదు. ఒక్కొక్కదాన్నీ మడిచి ఆరోలు చేశాడు. ఒకటి నామీదకి విసిరాడు. నేను పక్కన పెట్టాను. ష్ ష్ అని పిలిచాడు. మళ్ళీ ఇమ్మని సైగలు చేశాడు. సరే అని నేను వాడి మీదకి విసిరాను. నేను విసిరింది ఇంకోడి మీదకి వెళ్ళి పడింది. యేమంటారు. ఇద్దరూ పెద్ద డాక్టర్ల పిల్లలు. ఒకడికి కాపీ తో పని లేదని అందరికీ తెలుసు. ఇంకోడికి పరీక్ష యేమయినా పరవాలేదు. పనిష్మెంటిచ్చే కేసు కాదు. ఇక భరించలేక వాణ్ణి పంపేశారు. మేం ప్రశాంతంగా పరీక్ష రాసుకుని పదకొండింటికి రౌండ్ మహల్ మెట్లు దిగి కిందకి వచ్చేసరికి మా కంట పడ్డదేమిటి. అత్యంత యేకాగ్రతతో ఇద్దరు మూడో క్లాసు కుర్రాళ్ళతో నారాయణమూర్తి గోలీలాడుతున్నాడు. నాకెంత ఆనందం కలిగిందో చెప్పలేను. నా గుండెల్లోతున దాగివున్న కోరిక వాడైనా తీర్చుకున్నందుకు. యెవరు మేధకులు. మనసులో యే కోరిక వున్నా అణగతొక్కి మరీచిక[కాదేమో లెండి] వెంట పడే వాళ్ళా? నారాయణమూర్తా?

Thursday, March 20, 2008

saradhi

సారధి విజయనగరంలో ఒక ప్రముఖ లాయరు గారి అబ్బాయి. మేము బి ఎస్ సీ కి వచ్చేటప్పటికి కొన్ని సంవత్సరాలముందునించే అతను బి యే చదువుతున్నాడు. ఈ మధ్య అదేదో సినిమాలో సీనియర్ పేషెంటు జూనియర్ డాక్టరు లాగన్నమాట. నిలువెత్తు మనిషి ఉంగరాల జుత్తు పెద్ద మీసాలు యెర్రటి కళ్ళు నోట్లో యెప్పుడూ కారాకిళ్ళీ కానీ అతన్ని చూస్తే ఆప్యాయతే కానీ భయమూ జుగుప్సా లాంటివి యెవరికీ కలిగేవి కావు. అతను కాలేజికి ఫీజెందుకు కడుతున్నాడో అప్పుడప్పుడు కాలేజికి యెందుకు వస్తున్నాడో కూడా అర్ధం కాని[లేని?] సంగతి. ఒకసారి దసరాల సమయంలో [విజయనగరం పక్క దసరాకి బొమ్మలకొలువు పెడతారు} రౌండ్ మహల్ ముందు గాలరీలో వరసగా గ్రూపు ఫొటొలాగ బెంచీలు వేసి విద్యార్ధులందరూ కొలువు తీరి మధ్యలో సారధిని కూర్చొబెట్టి అమ్మాయిలు కాలేజికి వస్తుంటే చూడాలి చూడాలి అని కేకలు వేశారు. వాళ్ళు నవ్వుకుంటూనే వెళిపోయారు. సారధికి అప్పటికే పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా వుండేవారు. అనధికారికంగా ఇంకో భార్య[లు] ఉన్నట్టు అనుకునేవారు. అల్లాంటి సారధికి ఫైనల్ బి య్యే పరిక్షలవుతుండగా ఒక పరీక్షరోజు పొద్దున్నే తొమ్మిదింటికి ఇంటర్వ్యూకి రమ్మని పిలుపొచ్చింది.టంచనుగా ఎనిమిదిన్నరకల్లా లేచి పేపరు పట్టుకుని ఇన్విజిలేటరు దగ్గరకి వెళ్ళి పేపరు ఇచ్చేసి వెళ్ళిపోబోయాడు. ఆ సంవత్సరమే పరీక్ష ప్రారంభమయిన గంటన్నరదాకా ఎవరూ బయటకి వెళ్ళకూడదనే రూలొచ్చింది. ఇన్విజిలేటరు హిస్టరీ మాస్టారు రంగారావు గారు.పూర్తిగా అయిదడుగులు కూడా వుంటాడో లేదో అనిపించే మనిషి. పేపరు తీసుకోనన్నారు. తీసుకోండీ అని ముద్దులు కురిశాడు సారధి. కుదరదంటే కుదరదని కరాఖండీగా తేల్చి చెప్పారు మాస్టారు.తీసుకోరా అని మళ్ళీ అడిగాడు. తీసుకోను అని మల్లీ చెప్పారు. తీసుకోరా అని మళ్ళీ అడిగాడు. తీసుకోను అన్నారు. అయితే మానీండి అని పేపరు మడిచి చంకలో పెట్టుకుని వెళ్ళిపోయాడు సారధి. లెక్కకో ఆన్సర్ షీటు తక్కువ రావడం దాని తరవాత వసంతరావు వెంకటరావు గారి చిందులు ఉగ్ర రూపం అన్నీ గుర్తు తెచ్చుకుని గజగజలాడిన [రోజులలాంటివి మరి ] రంగారావు గారు వెనక పరిగెత్తి వెళ్ళి పేపరు ఇమ్మని సారధిని ప్రాధేయ పడ్డారు. ఇందాకే తీసుకో వచ్చుగా అని విసుక్కుంటూ పేపరిచ్చి వెళ్ళిపోయాడు.

Wednesday, March 19, 2008

kaamaakshi

విజయనగరం ముగిద్దామనుకుంటే అలలు అలలుగా ఇంకా ఉన్నాం మా సంగతేమిటంటున్నాయి. మరి విశాఖ వెనక పడుతోందంటే నీ తోనే ఉందిగా అని ఇకిలిస్తున్నాయి. మధ్యలో కంచి యాత్రొకటి. చెన్నై నించి కంచికి వెళ్ళడం ఒక పెద్ద ప్రణాళిక అయిపోయింది. అంత చిక్కులతో ఉందని నేననుకోలేదు. అంత మరీ ప్రాచుర్యం లేదా అంటే మరి హోటళ్ళన్నీ నిండుగానే ఉన్నాయి.రైలేదీ లేదు లోకల్ తప్ప. బస్సెక్కాలంటే మరో వూరెళిపోవాలన్నారు. సరే అని టాక్సీ లో వెళ్ళాము. ఆటో యెక్కి కామాక్షి సన్నిధికెళ్ళాము.అంతా మరిచిపోయాను. ఆమె వదనం చూసి.ఆమె యెవరు? తల్లా , సోదరా , మిత్రురాలా, ప్రేమికా. యేమి ఆ ఆత్మీయత!యేమి ప్రశాంతత. జీవితం ధన్యమయిందనిపించింది. యీ విషయాలు మరో చోట. విజయనగరం గురించి రాస్తూ పంచాయతనేశ్వర్ సంగతే యెత్త లేదని గుర్తొచ్చింది. ఎన్ సి సి అండర్ ఆఫీసర్ గా అతను రూట్ మార్చ్ లీడ్ చేసుకుంటూ వెళుతుంటే అందరం ముగ్ధులమై చూసే వాళ్ళం . అప్పట్లో ఎన్ సీ సీ యూనిట్లతో పాటు మిలిటరీ ఆఫీసర్లు ఉండేవారు. ట్రైనింగ్ ఇవ్వడానికి. వాళ్ళ స్నేహం ప్రభావమో,సొంత తెలివో గాని పంచాయతనేశ్వర్ కూడా గెడ్డం పెంచి సర్దార్జీ లాగానే వుండేవాడు. బి కాం చదివే వాడు.యెర్రని మనిషి నిలువెత్తు విగ్రహం . ఇప్పుడేం చేస్తున్నాడో తెలీదు మరి . యెవరికైనా తెలుసా? ఇంకా సారధి గురించి రేపు రాస్తాను.