Search This Blog

Sunday, March 23, 2008

narayanamurty

సారధి ఒక స్పెసిమెన్ అయితే నారాయణమూర్తి మరోటి. వాడి నాన్నా విజయనగరంలో పేరున్నాయనే. పెద్ద డాక్టరుగారు. సహజంగానే మాకు బాగా తెలిసిన కుటుంబం.మేధకుడు అన్న మాటకి ప్రాణం పోస్తే నారాయణమూర్తి అవుతాడని అందరూ అనే వాళ్ళు. నాకు మాత్రం అది నచ్చలేదు. అదే నిజమయితే పరీక్షలెలా పాసవుతాడు?కాలేజ్ దాకా యెలా వస్తాడు?కాలేజ్ కి వచ్చినాగాని వాడి ఇష్టాలు మారలేదు. బాధ్యతలూ అబ్బలేదు[ నాకో పెద్ద బాధ్యత యేడిచినట్టు ఆ వయసులో అందరమూ అంతే కదా!] కాని నారాయణమూర్తి కొంచెం స్పెషలే. యెందుకంటే సారధి లాగానే వాడూ ఒక పరీక్ష రోజున ఎనిమిదిన్నరకల్లా వెళిపోదామనుకున్నాడు.వెళ్ళనివ్వకపోతే యేం చేస్తాడు మరి. పాపం సీటు లోనే కూర్చున్నాడు. అరగంట కూర్చోవాలి కదా. తోచద్దూ... కొంచెంసేపు బెంచి మీద టైపింగు చేసాడు. టట్టటట్ట అంటూ. మేమందరమూ కూడా శృతి కలుపుతామేమో అనే అనుమానం వచ్చేక వాణ్ణి ఆపారు.ఇంకేం చెయ్యాలి? కొశ్చన్ పేపరు దొరికింది. రెండు ముక్కలు చేశాదు. ఒక్కొక్కదాన్నీ మడిచి ఆరోలు చేశాడు. ఒకటి నామీదకి విసిరాడు. నేను పక్కన పెట్టాను. ష్ ష్ అని పిలిచాడు. మళ్ళీ ఇమ్మని సైగలు చేశాడు. సరే అని నేను వాడి మీదకి విసిరాను. నేను విసిరింది ఇంకోడి మీదకి వెళ్ళి పడింది. యేమంటారు. ఇద్దరూ పెద్ద డాక్టర్ల పిల్లలు. ఒకడికి కాపీ తో పని లేదని అందరికీ తెలుసు. ఇంకోడికి పరీక్ష యేమయినా పరవాలేదు. పనిష్మెంటిచ్చే కేసు కాదు. ఇక భరించలేక వాణ్ణి పంపేశారు. మేం ప్రశాంతంగా పరీక్ష రాసుకుని పదకొండింటికి రౌండ్ మహల్ మెట్లు దిగి కిందకి వచ్చేసరికి మా కంట పడ్డదేమిటి. అత్యంత యేకాగ్రతతో ఇద్దరు మూడో క్లాసు కుర్రాళ్ళతో నారాయణమూర్తి గోలీలాడుతున్నాడు. నాకెంత ఆనందం కలిగిందో చెప్పలేను. నా గుండెల్లోతున దాగివున్న కోరిక వాడైనా తీర్చుకున్నందుకు. యెవరు మేధకులు. మనసులో యే కోరిక వున్నా అణగతొక్కి మరీచిక[కాదేమో లెండి] వెంట పడే వాళ్ళా? నారాయణమూర్తా?

No comments: