Search This Blog

Thursday, March 20, 2008

saradhi

సారధి విజయనగరంలో ఒక ప్రముఖ లాయరు గారి అబ్బాయి. మేము బి ఎస్ సీ కి వచ్చేటప్పటికి కొన్ని సంవత్సరాలముందునించే అతను బి యే చదువుతున్నాడు. ఈ మధ్య అదేదో సినిమాలో సీనియర్ పేషెంటు జూనియర్ డాక్టరు లాగన్నమాట. నిలువెత్తు మనిషి ఉంగరాల జుత్తు పెద్ద మీసాలు యెర్రటి కళ్ళు నోట్లో యెప్పుడూ కారాకిళ్ళీ కానీ అతన్ని చూస్తే ఆప్యాయతే కానీ భయమూ జుగుప్సా లాంటివి యెవరికీ కలిగేవి కావు. అతను కాలేజికి ఫీజెందుకు కడుతున్నాడో అప్పుడప్పుడు కాలేజికి యెందుకు వస్తున్నాడో కూడా అర్ధం కాని[లేని?] సంగతి. ఒకసారి దసరాల సమయంలో [విజయనగరం పక్క దసరాకి బొమ్మలకొలువు పెడతారు} రౌండ్ మహల్ ముందు గాలరీలో వరసగా గ్రూపు ఫొటొలాగ బెంచీలు వేసి విద్యార్ధులందరూ కొలువు తీరి మధ్యలో సారధిని కూర్చొబెట్టి అమ్మాయిలు కాలేజికి వస్తుంటే చూడాలి చూడాలి అని కేకలు వేశారు. వాళ్ళు నవ్వుకుంటూనే వెళిపోయారు. సారధికి అప్పటికే పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా వుండేవారు. అనధికారికంగా ఇంకో భార్య[లు] ఉన్నట్టు అనుకునేవారు. అల్లాంటి సారధికి ఫైనల్ బి య్యే పరిక్షలవుతుండగా ఒక పరీక్షరోజు పొద్దున్నే తొమ్మిదింటికి ఇంటర్వ్యూకి రమ్మని పిలుపొచ్చింది.టంచనుగా ఎనిమిదిన్నరకల్లా లేచి పేపరు పట్టుకుని ఇన్విజిలేటరు దగ్గరకి వెళ్ళి పేపరు ఇచ్చేసి వెళ్ళిపోబోయాడు. ఆ సంవత్సరమే పరీక్ష ప్రారంభమయిన గంటన్నరదాకా ఎవరూ బయటకి వెళ్ళకూడదనే రూలొచ్చింది. ఇన్విజిలేటరు హిస్టరీ మాస్టారు రంగారావు గారు.పూర్తిగా అయిదడుగులు కూడా వుంటాడో లేదో అనిపించే మనిషి. పేపరు తీసుకోనన్నారు. తీసుకోండీ అని ముద్దులు కురిశాడు సారధి. కుదరదంటే కుదరదని కరాఖండీగా తేల్చి చెప్పారు మాస్టారు.తీసుకోరా అని మళ్ళీ అడిగాడు. తీసుకోను అని మల్లీ చెప్పారు. తీసుకోరా అని మళ్ళీ అడిగాడు. తీసుకోను అన్నారు. అయితే మానీండి అని పేపరు మడిచి చంకలో పెట్టుకుని వెళ్ళిపోయాడు సారధి. లెక్కకో ఆన్సర్ షీటు తక్కువ రావడం దాని తరవాత వసంతరావు వెంకటరావు గారి చిందులు ఉగ్ర రూపం అన్నీ గుర్తు తెచ్చుకుని గజగజలాడిన [రోజులలాంటివి మరి ] రంగారావు గారు వెనక పరిగెత్తి వెళ్ళి పేపరు ఇమ్మని సారధిని ప్రాధేయ పడ్డారు. ఇందాకే తీసుకో వచ్చుగా అని విసుక్కుంటూ పేపరిచ్చి వెళ్ళిపోయాడు.

3 comments:

Anonymous said...

అదిరింది.

Anonymous said...

అదిరింది.

కొత్త పాళీ said...

భలే ఉన్నాయి మేస్టరూ మీ కాలేజి కబుర్లు.
మీ ఆరోగ్యం బాగుందని తలుస్తాను.