Search This Blog

Saturday, June 30, 2007

m.r.college2

ప్రిన్సిపాలు గదికివెళ్ళే మెట్ల పక్కన ఒకరిద్దరు మాత్రమే పట్టే ఒక సన్నని దారి వుంది. అదిదాటి వెళితే ఒక క్లాసురూము వస్తుంది. ఆ క్లాసు లో మాకు యెక్కువగా లెక్కల క్లాసులు అయ్యేవి. పెరిశాస్త్రిగారి ఆల్జీబ్రా ఎం ఎస్ ఆర్ కృష్ణశాస్త్రిగారి కాల్క్యులస్ సోమనాధం గారి కోఅర్డినేట్ జామెట్రీ ఇక్కడే మమ్మల్ని ముగ్ధుల్ని చేశాయి.ఈ గది సరిగ్గా రోణంకి అప్పలస్వామి గారు పాఠాలు చెప్పిన గది యెదురు గానే వుంటుంది. యీ గది రెండో వైపు క్వాడ్రాంగిల్ వుంది. ఫిజిక్సు గాలరీకి వెల్లే మెట్ల పక్కనా ఇలాగే సన్నని దారి వుంది. అది దాటి వెళితే కెమిస్ట్రీ లాబరేటరీ , ఇంక అక్కడి నించి అంతా కెమిస్ట్రీ లాబరేటరీనే . దానికి రెండో వైపు పెద్ద స్టేజి.క్వాడ్రాంగిలు లో జనం అంతా ఈ స్టేజి మీద జరిగే సభలూ ప్రదర్శనలూ చూసేవాళ్ళు. దాదాపు ఆరేదు వేలమంది పట్టే ఈ ఆరుబయలు రంగస్థలం ప్రతిప్రదర్శనకీ కిక్కిరిసే వుండేది. అక్కడ కూర్చునే నేను జమ్మలమడక మాధవరాయశర్మ గారి వాగ్ఝరిలో గడ్డిపువ్వునై వూగిపోయాను. కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి అమృతభాషణ లో తడిసిపరవశించాను. ఆ స్టేజి మీదనే నటరాజ రామకృష్ణ గారి సోదాహరణ నృత్యప్రసంగం చూసి తన్మయుణ్ణయాను. గోపీకృష్ణ తన కాలికి కట్టిన మువ్వల్లో ఒకేఒక్క దాన్ని కదిలించి మోగించడం చూసి అబ్బురపడ్డాను.....ఆ స్టేజి మీద నేనుకూడా నాటకాలు వేశాను.

No comments: