Search This Blog

Tuesday, July 3, 2007

m.r. college 3

మైన్ బిల్డింగుకీ లైబ్రరీ బిల్డింగు కీ విడిగా క్వాడ్రాంగిలు నాలుగో అంచుని నిర్దేశిస్తూ ఒక చిన్న భవనం వుండేది. అందులో లెక్కల విభాగమూ జియాలజీ విభాగమూ వుండేవి.ఎం పీ సీ విద్యార్ధిగా నాకు ఆ భాగం తో సంబంధం వుండడం సహజమే అయినా ఇంకా మరో ముఖ్యమయిన అనుబంధం కూడా వుంది.విజయనగరం కళల కాణాచిగా పేరొందడం అందరికీ తెలిసినదే అయినా ఇదో కమ్మని జ్ఞాపకం. మా లెక్కల లెక్చరర్ పేరిశాస్త్రి గారు అతికమ్మగా పాడే వారు. పాటలకి అతి మనోహరంగా వరసలు కట్టేవారు. విజయనగరం కాలేజి నించి విశ్వకళాపరిషత్తు యువజనోత్సవాలకు వెళ్ళే జట్లకు లలిత సంగీతమూ బృందగానాల్లో ఆయనే శిక్షణ ఇచ్చే వారు. సోమనాధం గారు నాటకాల్లో శిక్షణ ఇచ్చే వారు. దురదృష్ట వశాత్తూ నేను కాలేజికి వచ్చే నాటికి సొమనాధం గారు ఆ వ్యాపకం యెందుకో మానుకున్నారు. అయినా వారూ ఎం ఎస్ ఆర్ కే గారూ ఇతర అధ్యాపకులూ పేరిశాస్త్రి గారి శిక్షణ లో ఉత్సాహంగా పాలుపంచుకునేవారు.నాకు పాడడం అంత రాకపోయినా ఆసక్తీ, నాటకాల జట్టులో వుండడం నించి నేనూ ఆ శిక్షణలో వుండేవాణ్ణి. అన్నట్టు సోమనాధం గారు ఎన్ సీ సీ కమాండెంటుగా కూడా వుండేవారు. బీ సీ వంటి సర్టిఫికేట్లేమీ లేకపోయినా ఎన్ సీ సీ క్విజ్ పోటీల్లొ మాత్రం ప్రతిసారీ ప్రైజు వచ్చేది నాకు. ఆ ప్రక్కనే వున్న జియాలజీ విభాగం లో రామలింగశాస్త్రి కొత్త గా చేరారు. ఆయన నాటకాల్లో శిక్షణ ఇచ్చే వారు. ఆయన గురించి రాసేది ముందుముందు ఇంకా చాలా వుంటుంది. యెందుకంటే నేను యూనివర్సిటీ కి వచ్చే నాటికి ఆయన కూడా అక్కడికి మారి తరవాత కాలం లో మిత్రునిగా మారేరు.నిజంగా ఆ కాలేజిలో ఆ రోజుల్లో చదవడం పూర్వజన్మ సుకృతం. ఆగస్టు పదిహేనూ నవంబరు ఒకటీ యువజనోత్సవాలూ జనవరి ఇరవయ్యారూ స్థాపనోత్సవమూ అలా యేదో ఒక కార్యక్రమం పండుగలాగ జరుగుతూనే వుండేది.సహృదయులైన అధ్యాపకులూ అంతపెద్ద క్రీడాప్రంగణమూ విద్యార్ధి సంఘానికంటూ ఒక ప్రత్యేక భవనమూ యెంతో బాగుండేది.రాధికగారు రాస్తూ ఆ కాలేజి ని చూడాలని వుంది అన్నారు. నలభై మైళ్ళ దూరంలోనే వున్నా నేను విజయనగరం వెళ్ళి చాలాకాలమైంది. భయం. ఇవన్నీ వున్నాయో మారిపోయాయో అని. ఈ జ్ఞాపకాలు మాసిపోవడం భరించలేను.

No comments: