Search This Blog

Saturday, June 30, 2007

m.r.college2

ప్రిన్సిపాలు గదికివెళ్ళే మెట్ల పక్కన ఒకరిద్దరు మాత్రమే పట్టే ఒక సన్నని దారి వుంది. అదిదాటి వెళితే ఒక క్లాసురూము వస్తుంది. ఆ క్లాసు లో మాకు యెక్కువగా లెక్కల క్లాసులు అయ్యేవి. పెరిశాస్త్రిగారి ఆల్జీబ్రా ఎం ఎస్ ఆర్ కృష్ణశాస్త్రిగారి కాల్క్యులస్ సోమనాధం గారి కోఅర్డినేట్ జామెట్రీ ఇక్కడే మమ్మల్ని ముగ్ధుల్ని చేశాయి.ఈ గది సరిగ్గా రోణంకి అప్పలస్వామి గారు పాఠాలు చెప్పిన గది యెదురు గానే వుంటుంది. యీ గది రెండో వైపు క్వాడ్రాంగిల్ వుంది. ఫిజిక్సు గాలరీకి వెల్లే మెట్ల పక్కనా ఇలాగే సన్నని దారి వుంది. అది దాటి వెళితే కెమిస్ట్రీ లాబరేటరీ , ఇంక అక్కడి నించి అంతా కెమిస్ట్రీ లాబరేటరీనే . దానికి రెండో వైపు పెద్ద స్టేజి.క్వాడ్రాంగిలు లో జనం అంతా ఈ స్టేజి మీద జరిగే సభలూ ప్రదర్శనలూ చూసేవాళ్ళు. దాదాపు ఆరేదు వేలమంది పట్టే ఈ ఆరుబయలు రంగస్థలం ప్రతిప్రదర్శనకీ కిక్కిరిసే వుండేది. అక్కడ కూర్చునే నేను జమ్మలమడక మాధవరాయశర్మ గారి వాగ్ఝరిలో గడ్డిపువ్వునై వూగిపోయాను. కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి అమృతభాషణ లో తడిసిపరవశించాను. ఆ స్టేజి మీదనే నటరాజ రామకృష్ణ గారి సోదాహరణ నృత్యప్రసంగం చూసి తన్మయుణ్ణయాను. గోపీకృష్ణ తన కాలికి కట్టిన మువ్వల్లో ఒకేఒక్క దాన్ని కదిలించి మోగించడం చూసి అబ్బురపడ్డాను.....ఆ స్టేజి మీద నేనుకూడా నాటకాలు వేశాను.

Thursday, June 28, 2007

m.r.college

విజయనగరం మహరాజా కాలేజి.అంతకు ముందు చాలాసార్లు చూసినా విద్యార్ధి గా చేరి నా కాలేజి అని అనుకునేప్పటికి అదో మంచి భావన. పెద్ద గేటు లోంచి లోపలికి వెళ్ళగానే రెండుపక్కలా బోటనీ శాఖ వారి పెద్ద తోటలు. యెదురుగా కాలేజ్ భవనం. కొద్దిపాటి మట్టినేల దాటివెళితే కాలేజ్ వరండా పైకివెళతాం. వరండాకి రెండు చివర్లా రెండు పెద్ద స్టెయిర్ కేసులు. కుడిపక్కది యెక్కితే ప్రిన్సిపాలు గారి గది కి వెళతాం. యెడమ పక్కది యెక్కితే ఫిజిక్సు గాలరీ కి వెలతాం. ఈ రెండూ కాక పోతే గేటు యెదురు గానే మధ్హ్యలో ఒక చిన్న స్టెయిర్ కేసు.దానికి యెడమ పక్క కామర్సు పాలిటిక్సు యెకనమిక్సు అధ్యాపకులుండే గదులు. రెందొ పక్క క్లాసు గదులు.ఫిజిక్సు గాలరీ కి వెళ్ళే మెట్ల పక్కన భవనం ఎల్ ఆకారం లో తిరుగుతుంది. ఆ ఎల్ లో బి ఎస్ సీ వాళ్ళ కోసం పెద్ద ఫిజిక్సు లేబరేటరీ. ప్రిన్సిపాలు మెట్లు దాటాక కుడి పక్క మరో భవనం. పెద్ద వరండాతో .అది లైబ్రరీ. ఆ భవనం లోనే నా జీవితానికి పునాదులు. ఆ వరండా మీద గంటల తరబడి కూర్చునే వాళ్ళూ వచ్చే పోయే అమ్మాయి లని చూసే వాళ్ళూ. ఆభవనం చివరన మేడమీద ఒక గది.ఒక్కటే. దానికి వేరే మెట్లు. ఆ గది లోనే రోణంకి అప్పల స్వామి గారు అందుకున్న వాళ్ళకి విజ్ఞానాన్నీ, అందుకోని వాళ్ళకి వినోదాన్నీ పుష్కలంగా పంచింది. ఈ టూరు ఇంకోసారి పొడిగిద్దాం. ఈ ముక్కలు యెవరికయినా తీపి గుర్తుల్ని నిద్దరలేపితే అందరితోపంచుకోండి

Sunday, June 24, 2007

starting college

నేను 1959 లో విజయనగరం ఎం ఆర్ కాలేజి లో చేరాను. అప్పటికి నాకు పదమూడో యేడు నడుస్తోంది.ఒక్కసారిగా కొత్త ప్రపంచం లోకి అడుగు పెట్టినా నాలో ఆ భావం ఎందుకనో అంతగా కలగలేదు..నేనింకా బాల్యంలోనేవుండడం వల్లనేమో. జీవితంలో వివిధ దశలు . చిన్నప్పుడు స్కూలులో మన అమ్మానాన్నల పిల్లలు గానే పెరుగుతాం. కాలేజీకి వచ్చేటప్పటికి కొంత వ్యక్తిత్వం మొదలవుతుంది.అదిన్యాయంగా డిగ్రీ పూర్తిచేసేటప్పటికి బాగావికసించాలి. కాని నా విషయంలో అది జరగలేదు. బాల్యం నించి కౌమారానికి వచ్చే సరికి నా డిగ్రీ అయిపోయింది. యూనివర్సిటీ నన్ను నిజంగా పురి విప్పి ఎగిరేలా చేసింది. కాలేజి అనగానే విశాల మయిన గదులు, పెద్దపెద్ద ప్రయోగశాలలు,భాషలు నేర్చుకోడానికి మరో ప్రాసాదానికి వెళ్ళడం, [విజయనగరం గురించి తెలిసిన వాళ్ళకితెలుస్తుంది. అవి నిజంగారాజప్రాసాదాలే] పెద్ద స్టేజీ క్వాడ్రాంగిలూ అందులో కళాప్రదర్శనలూ, అయోధ్య మైదానమూ అందులో టెన్నిస్ నించి కబడ్డీ దాకా అన్ని ఆటలూ ఆడే వాళ్ళూ. ఈ రోజుల్లో ముట్టుగదుల్లాంటి క్లాసురూములూ [క్షమించాలి]కారాగారాల్లాంటి ప్రయోగశాలలూ[అసలంటూ వుంటే] వాటిని కాలేజీ లనడం చూస్తే నిజంగా ఈ తరం మీద జాలి వేస్తుంది.కాలేజీ అనుభవాలని వచ్చే పోస్టు నించి మొదలెడతాను.

Friday, June 22, 2007

oka ammamma

అనగనగా ఇక అమ్మమ్మ. ఆమెకి యేడుగురు మనమలూ మనమరాళ్ళూ. ఆమె యెనభైయవ పుట్టిన రోజు, దేశకాల పరిస్థితుల వల్ల వాళ్ళకి తెలుగు రాయడం చదవడం రాదు. ఆమెకు తెలుగు తప్ప మరో భాష రాదు. అందుకని వాళ్ళు వాళ్ళ భావాల్ని తెలుగులో రాయడానికి నా సహాయం తీసుకున్నారు. వారి భావనలు నాకు నచ్చి వారి అనుమతితో ఇక్కడ ఉంచుతున్నాను ఆమె శిరస్సు పై మెరిసే చంద్రబింబాలనూ, ఆమె చుట్టూ దాక్కున్న శతసహస్ర సూర్యబింబాలనూ ఎవరమూ లెక్కపెట్టలేము. మనం ప్రేమగా అమ్మమ్మ అనో నాయనమ్మ అనో పిలుచుకునే వ్యక్తి కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు. ఒక సంస్థ. మన ఊహలకందని ఒక మహత్తర శక్తి. ఒక అనుభూతి. దైవం మా కోసం పంపిన దేవత నే మా భావన. ఆమె గురించి మా జ్ఞాపకాలలో అతి ప్రత్యేకమైనది ఒకటుంది. కర్లీ స్ట్రీట్ మా పూర్వీకుల నించీ వస్తున్న ఇల్లు. చిన్న ఎర్ర గేటు. గేటు దగ్గర ఆమె. ప్రపంచాన్ని చూస్తూ ప్రతి మనిషి కోసమూ చిరునవ్వు చిందిస్తూ, నవ్వుతున్న ఆమె కళ్ళలోని కాంతులు ఆమె చెవులకున్న వజ్రాల దుద్దులని హేళన చేస్తుంటే, ఆ గేటు దగ్గర అమ్మమ్మ. ఆమె పాలు పంచుకోని క్షణాలంటూ మా జీవితంలో యేవీ వుండేవికావు. యేడుగురు మనమలూ మనమరాళ్ళూ. యేడు జీవితాలు. అన్నీ విభిన్నమైనవీ విశిష్టమైనవీ. అన్నీ ఆమె పై మా ప్రేమతో విడదీయలేనంతగా అనంతంగా కలిసిపోయినవీ. ఆమె నవ్వులో మాకు ఆమె యెనభై సంవత్సరాల జీవితంలో ప్రదర్శించిన అంతశ్శక్తీ మనోధైర్యమూ వినబడతాయి. ఆమె కళ్ళలో మేము ప్రపంచంలోని మంచినంతా ప్రేమించడం నేర్చుకున్నాము. ఆమె అసామాన్యమైన మేధస్సు ఆమెతో గడిపిన ప్రతిక్షణం మాకు మరింత జ్ఞానాన్ని అందించింది మనం దేవుణ్ణి పూజిస్తాం. ఆ దేవుడు సహస్రచంద్రదర్శనం చేసినవారిని పూజిస్తాడంటారు. అంటే యెనభైయేళ్ళు పూర్తి చేసుకున్నవారిని. సహస్ర చంద్రుల్ని దర్శించడమే కాకుండా మా జీవితలలో సహస్రసూర్యుల వెలుగు నింపిన ఆ అమృతమూర్తిని మేము పూజిస్తాము. మా బాల్యం అంటే ఆమె చేత స్నానం పొయించుకోవడం ,ఆమె అన్నం పెట్టడం,ఆమె తిట్టేవి తినడం,ప్రేమించబడ డం,పాఠాలు నేర్చుకోడం, ఆమె వొళ్ళో నిద్రపోడం, నిద్ర లేచి ప్రశాంతత మూర్తీభవించిన ఆమె వదనం చూస్తూ భయాలూ బాధలూ మరిచిపోడం ఇంటి నించి దూరం గా వచ్చి జీవన సమరాలలో వ్యస్తులమైనప్పుడూ,ఒంటరితనం కుంగదీస్తున్నప్పుడూ కళ్ళు గట్టిగా మూసుకుని కన్నీళ్ళ మధ్యనించి మాకు తెలిసిన ఒకేఒక నిర్మల వదనాన్ని ఊహించుకోడం నాకు తెలుసు. క్షణక్షణం ఆ భావన బలపడి ఆ వదనం మరింత నిర్దుష్టం గా కనబడి ఆమె రూపంలో మాకు లభించిన అవ్యాజానురాగం మాలో మరింత శక్తిని నింపింది. ప్రియాతిప్రియమైన అమ్మమ్మా/నాయనమ్మా నీ యెనభయ్యవ పుట్టిన రోజు నాడు నిన్ను మేము అత్యంత పవిత్రంగా ప్రేమిస్తున్నామనీ,పూజిస్తున్నమ నీనితో అనుభవాని ఒక పండుగ లాగా అనుభవిస్తున్నామనీ నీవు లేని జీవితం నిస్సారమవుతుందనీ నీతో చెప్పడానికే యిదంతా. నీకు మేము జివితాంతం కృతజ్ఞులం యెప్పటికీ నీ

Saturday, June 16, 2007

pch

ప్చ్, మళ్ళీరెండు అప్పుతచ్చులు

Add to My AOL

apputachchulu

అప్పుతచ్చుల గురించి నన్ను మెలుకొలిపిన s గారు ఇంకో విధంగా నన్ను కొంచెం పెద్ద ముల్లుతోనే పొడిచారు. ద్వివేదుల విశాలాక్షి గారిని విషాలాక్షి అని రాసి రాక్షసమంత్రి విషకన్యను కనులముందు ఆడించారు. విశాలాక్షి గారు కాశీ విశాలాక్షి లాగానే అమృతమయి. ఆమె కళ్ళు విషాలు చిమ్మడం ఊహించుకోడమే కష్టం. ఒక్క కీ తేడాతో యెంత ప్రమాదం జరిగిపోయింది. ఇక మీద ఒళ్ళు దగ్గిర పెట్టుకుంటాను.నన్ను ఇలాంటి ప్రమాదాలనుంచి జాగరూకుణ్ణి చేసిన మిత్రుడికి కృతజ్ఞుణ్ణి. నరసింగరావు గారూ కుటుంబమూ అమెరికా వెళ్ళిన రోజుల్లో ఆ ఇంటిలో ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు గారు వుండేవారు. తరువాతి రోజుల్లో ఆయన చాలా లబ్ధప్రతిష్థులయ్యారు. విజయనగరం మహారాజా కాలేజి లో ఆయన చెరేనాటికే ఆయనకు డాక్టరేటు వుండేది. అది చాలా అరుదైన విషయమని వేరే చెప్పక్కరలేదు. అయినా అప్పటీ ఆయన చిన్న వయసును దృష్తిలో పెట్టుకుని కొంతమంది ఆయనను బచ్చా మేష్టరు అని ముద్దుగా పిలుచుకునే వారు. ఈ మాటరాసి యెవరినైనా నొప్పించివుంటే క్షంతవ్యుణ్ణి. వీరభద్రరావు గారి సతీమణి రాయప్రొలు సుబ్బారావు గారి కుమార్తె. కధల్లొ రాస్తూ వుంటారు- యేడు మల్లెల యెత్తు రాకుమారి అని. ఆ మాట సాక్షాత్కరించినట్టు వుందే వారు. అంతటి సౌకుమార్యం ఆరోజు నించి నేతిదాకా యెక్కడా నేను చూడలేదు.వారి యింతిలోనే వారి మెనల్లుళ్ళు ఇద్దరు వుండి చదువుకుంటుండేవాళ్ళు. చిన్నవాడు ఆనందమోహన్ ఫిఫ్తు ఫారం లో నా సహాధ్యాయి. అతని అన్న కాలేజి లో చదివే వాడు. వారిద్దరికి వడ్రంగం అంటే అభిరుచీ మంచి నిష్ణాతులు కూడానూ. ఇమంతిలో పుస్తకాల షెల్ఫులూ తబుళ్ళూ వాల్లే చేసే వాళ్ళు. ఇది కొంత విచిత్రం గానే వుండేది.తరువాత వీరభద్రరావు గారు హైదరాబాదు వెళ్ళిపోయారు. తాజాకలం: మిత్రుడు లంబోదర్ నా చందమామ జ్ఞాపకాలు చదివి నేను సైతం అన్నారు. ఇలాగే చందమామ ప్రేమికుల్లో మద్దిపత్ల నాగేస్వరరావును చెప్పుకుని తీరాలి. కిర్లంపూది హాస్తల్లో మాతో పాటు వుండేవాడు. ఫార్మసీ అధ్యాపకుడు. అతని వద్ద చిన్నప్పటి నించి అన్ని చందమామలూ బైండు అయి వుండేవి.

Monday, June 11, 2007

naani

నేను స్కూలులో చదువుతున్నరోజుల్లొ మా పక్క ఇంటిలో ద్వివేదుల నరసింగరావుగారు వుండేవారు.వారు మహారాజా కాలేజి లో యెకనామిక్స్ లెక్చరర్ గా పనిచేసేవారు. కొంతకాలం తరువాత వారు అమెరికా వెళ్ళడమూ తిరిగి వచ్చాక యు ఎస్ యెద్యుకేషనల్ ప్రోగ్రాం అధికారిగా మద్రాసు వెళ్ళడమూ జరిగింది. వరి సతీమణి విశాలాక్షి గారు తరువత కధా నవలారచయిత్రి గా ప్రసిధ్ధులు. అయితే అప్పటికి ఆమె రచనా వ్యాసంగం యింకా మొదలుపెట్టలేదు. దగ్గరలో ముఫ్ఫయ్యేళ్ళ వయసులో ఆమే ఆమె చుత్తాలమ్మాయి మరొకరూ ఆంధ్రామెట్రిక్ పరీక్షకి హాజరవడం ఆ చిన్నవూళ్ళో కొంత సంచలనమే అయింది. మా రెండు కుటుంబాలూ చాలా సన్నిహితం గా వుండేవి. వారి అబ్బాయి శ్రీనాధ్ నాకు మంచి మిత్రుడు. మా ఇంటి లోనో వాళ్ళింటిలోనో ప్రతివారం తప్పకుందా బాలానందం కార్యక్రమం వినేవాళ్ళం. మా స్నేహితులు కూడా వచ్చే వాళ్ళు. రేడియో వినడానికి ఇంకో ఇంటికి వెళ్ళడం అంటే యిప్పుడు పిల్లలు నవ్వుతారు. ఆఆంధ్రపత్రిక వారపత్రికలో ఆ రోజుల్లో టాం సాయర్, హకల్ బెర్రీఫిన్ స్కార్లెట్ పింపర్నల్ రాజూపేదా వంటి సీరియళ్ళు వచ్చేవి. చందమామలో తోకచుక్క మకరద్వీపం వంటి సీరియళ్ళు వచ్చేవి. యేకాక్షీ చతుర్నేత్రుడూ వంటి పాత్రలు మనసుకి హత్తుకునేవి. అందరం కలిసి చదవడం పైవరమో పై నెలో యేమవుతుందని చర్చించుకోడం యెంతో బాగుండేది. విశాలాక్షి గారు కూడా మాతో చర్చించేవారు. అమెలోని రచయిత్రి ఆ రోజుల్లోనే వికసించిందేమో.అమెరికా వెళ్ళాక నానీ అనబదే శ్రీనాధ్ చదువు అక్కదే గదిచింది. అమెరికాలోనే అతను కారుప్రమాదంలొ చిన్నవయసులోనే మరణించాదు. అతని చెల్లెలు ఛాయ కూదా మాతోనే ఆడుతుండేది.

Monday, June 4, 2007

bandaru

బందరు బ్లాగరుడు వ్యాఖ్య పంపించి బందరు జ్ఞాపకాలని వెలికి తెప్పించారు. బందరులో యెందరో మిత్రులు. మా అమ్మమ్మ గారి వూరు కావడంతో చిన్నప్పటి నించీ బాగా అలవాటైన వూరే. కాని యూనివర్సిటీలో మిత్రులైనవాళ్ళు అనేకులు. ఎన్ ఎస్ ఎస్ ప్రసాదూ నాకు ఒక సంవత్సరం జూనియరే. రిసెర్చ్ లో చేరిన మొదటి యేడాది అతని రూములో వుండనిచ్చాడు. చాలా మంచి మిత్రుడు. నా రెండొ కుమారుడి పెళ్ళికి వచ్చాడు. అప్పుడు కలిశాం. నా ఇద్దరు కొడళ్ళూ హైదరబాదు వాళ్ళే కావదం మిత్రుల్ని కలవడానికి అవకాశం ఇస్తోంది . సౌభ్యం అనబడే జీవీవీ సుబ్బారావు ని మిత్రుదు అనడానికి లేదు. ఇంకో ప్రాణం అనాలి. బందరు హిందూ కాలేజి లో ఫిజిక్సు చెప్పేవాడు. మీటియరాలజీ చదివిన ఆదిశేషు మరో మంచి మిత్రుడు. అతని మరణవార్త ఈ మధ్యనే విన్నాను.వృత్తిధర్మంలో రేదియేషను కి గురి అయ్యాడు. యూనివర్సిటీ మిత్రుల గురించి వరుసలో చివరికి రాద్దామనుకున్నాను కాని బ్లాగరుడు తాడు లాగి డొంకని కొంచెం కదిలించాడు. వీళ్ళందరి గురించీ రాయడానికి ఇంకా మజా అయిన సంగతులు బోలెడు. మళ్ళీ చెపుతా. ఇంకా స్కూలు రోజుల్లోనే వున్నాం కదా