Search This Blog

Tuesday, May 5, 2009

యూనిసెక్సూ బ్రాహ్మణోత్తముడూ

కాన్వొకేషన్ కి ఇచ్చిన పాసులపై నంబర్లుండేవి. దాని ప్రకారం సీటు దగ్గరకి వెళితే ఆ కుర్చీలో ఒక పాకెట్లో డిగ్రీ , కాన్వొకేషన్లో చెయ్యాల్సిన పనుల జాబితా ,తీసుకోవల్సిన శపథం కాపీ ఇత్యాదులు వుండేవి. అవి తీసుకుని కూర్చోవాలి. వేరే ఇవ్వడం అదీ ఏమీ వుండదు-మెడల్సు పుచ్చుకునే వాళ్ళకి తప్ప.నేను ఎం ఎస్ సీ టెక్ ఫస్టియర్ చదువుతున్నప్పుడు బి ఎస్ సీ డిగ్రీ తీసుకున్నాను అందర్లాగే.మా పాతకాలేజి నించి మిత్రులు కూడా వచ్చేరు ఈ పని మీదే. వాళ్ళలో గోపాలరత్నం అనే అమ్మాయి కూడా వచ్చింది.ఈ యూనిసెక్స్ పేరుతోనే వచ్చింది తంటా. ఆ అమ్మాయి తన సహ విద్యార్ధినులతో కలిసి లోపలకి వెళ్ళాక అసలా అమ్మాయి నంబరున్న సీటే లేదు అక్కడ!ఇలాంటి చిన్న పొరపాట్లు ఆ రోజుల్లో జరిగేవికాదు--చండశాసనులనిపించుకున్న సూపరింటెండెంట్లుండేవాళ్ళు రిజిస్ట్రారాఫీసులో.వెతగ్గా వెతగ్గా సంగతి బయటపడింది. ఆ నంబరు సీటు మగవాళ్ళ సీట్లలో వుంది. పోనీ పాకెట్ తీసేసుకోమంటే-- డిగ్రీ మీద మిస్టర్ గోపాలరత్నం అని రాసి వుంది.అది పనిచెయ్యదే!ఈలోపల కాన్వొకేషన్ మొదలయ్యే టైమయిపోతోంది.అక్కడ వున్న సూపరింటెండెంటుని అడిగితే. ఆ పాకెట్ ఆఫీసులో ఇచ్చేసి లెటర్ పెట్టమన్నాడు. అమ్మాయి మాతో హాస్టల్లో పడుకునే రోజులు కాదుకదా. అందుకని ఒక కాగితం మీద సంతకం పెట్టించి ఆ పాకెట్ తీసుకుని ఆమెని సరదా చూసేసి ఇంటికి పొమ్మన్నాం మరునాడు ఉదయమే క్లాసు ఎగ్గొట్టి ఆ డిగ్రీ , జరిగింది వివరిస్తూ ఒక ఉత్తరమూ పట్టుకుని రిజిస్ట్రారు వారి ఆఫీసుకి వెళ్ళి మొదటి అంతస్తులో ఒక చివరికి వున్న ఆ సెక్షను కి వెళ్ళి గుమ్మం లో నిలబడి లోపలికి తొంగి చూస్తూ నిలబడ్డాం. యు వి రమణయ్య గారనే సూపరింటెండెంటు కళ్ళజోడు పైనించి చూసి తల యెగరేశాడు యెందుకూ అన్నట్టు. ఆ రోజుల్లో వాళ్ళన్న భయంగానే వుండేది--వాళ్ళ నిజాయితీ రుజువర్తనమే వాళ్ళకా మర్యాద తెచ్చేవనుకుంటాను.పైగా యే క్షణంలోనైనా రిజిస్ట్రారు వస్తారేమోనన్న దడ --కూర్మావేణుగోపాలస్వామి గారివ్యక్తిత్వమూ అలాంటిదే. సరే రమణయ్యగారి సైగకి జవాబుగా చేతిలోని కాగితాలని పైకెత్తి ఆడించాను . మళ్ళీ తల తాటించారు. అంటే రమ్మని అన్న మాట.లోపలికి వెళ్ళి ఆయన ముందు నిలబడి చేతికి కాగితాలు అందించాం. ఒక సారి డిగ్రీ పక్క చూసి రేపు సాయంకాలం అన్నారు. ఒక్కమాటే నన్నమాట ఆ వేళకి.సమస్యకొంచెం వివరించబోయాం 'ఇదీ' అంటూ. ఈ సారి తల గుండ్రంగా తిప్పి చెయ్యి గాల్లోకి ఊపేరు. అర్థం అయింది వెళ్ళమని మేమూ అర్థం చేసుకుని ఇంకోచెంసేపుంటే గెంటిస్తాడేమోనని వచ్చేశాం. గెంటిస్తే ధర్నా చెయాలని అప్పట్లో తెలీదుగా.రెండోరోజు సాయంత్రం అయిదింటికల్లా టంచనుగా వెళ్ళీ నిలబడ్డాం. మళ్ళీ ఆయనే. సూపరింటెండెంటుకి తప్ప మరెవరికీ బయటవాళ్ళతో మాట్లాడే హక్కు లేదు ఆ సెక్షన్లో. పేరు ? అని ప్రశ్నించేరు--డిగ్రీ మీదదని ఊహించి గోపాలరత్నం అన్నా ఊఉ అని తన ముందున్న దస్త్రం లోంచి వెతికి చేతికిచ్చేడు.చూసుకున్నాం. మిస్ గోపాలరత్నం అని వుంది. థాంక్సండీ అని వెనుతిరిగాం. ఉండు అని హుంకరించేడు. గతుక్కుమని వెనక్కి తిరిగేం. సంతకం చెయ్యద్దా అని పుస్తకం ముందుకి తోసేడు. సరేనని సంతకం చేసిచ్చి నిలబడ్డాం మళ్ళీ పిలిస్తే వెనక్కి తిరగడమెందుకని. ఒకసారి సంతకం చూసి ఇదేమిటి ? గోపాలరత్నం నువ్వు కాదా? అని డిగ్రీ వెనక్కిమ్మన్నట్టు చెయ్యి చాచేడు. కంగు తిని సీత రాముడికేమవుతుందో పూర్తిగా వివరించి చెప్పాను. అవును కదూ అని కళ్ళ జోడు సర్దుకుని మళ్ళీ చెయ్యి ఊపాడు. అమ్మయ్య అని బయటపడ్డాం. అయ్యా అదీ రమణయ్య గారితో నా తొలి పరిచయం. తరవాతి రోజుల్లో ఆ బ్రారహ్మణోత్తముడు చాలా మంచి మిత్రులయ్యేరు.

Friday, February 13, 2009

convocation

ఆంధ్రా యూనివర్సిటీ జీవితంలో ముఖ్య స్థానంలో హాస్టల్ జీవితం, మెస్సులు , కాంటీన్ ఆక్రమిస్తాయి. ఇక్కడేకాదు --ఐ ఐ టీ విద్యార్ధులని అడిగినప్పుడూ ఇదే చెప్పారు. వీటికి సంబంధించిన జ్ఞాపకాలూ మధురమే. మెస్సుల్లో ఫీస్టులని వివిధ సమయాల్లో నిర్వహించే వాళ్ళు. వాటికి మిత్రులని గెస్టులుగా పిలిచే యేర్పాటు వుండేది. దాదాపు పెళ్ళి భోజనాల్లాగ మంచి సందడి వుండేది. సంవత్సరాంతంలో వోపెన్ ఎయిర్ ఫీస్టు వుండేది. దానికి మాస్టర్లని పిలిచే రివాజు వుండేది. ఒక చీఫ్ గెస్టు ప్రముఖుల్నెవర్నైనా పిలిచే వాళ్ళం. కాన్వొకేషన్ ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదటి శనివారం నిర్వివాదంగా నిర్వహించే వారు. దీనికి ఒక ప్రాముఖ్యత యేమంటే అప్పట్లో డిగ్రీ [బి ఏ, బి ఎస్ సీ వంటివి] పాసైనవాళ్ళకి కూడా కాన్వొకేషన్ లోనే డిగ్రీ ఇచ్చే వారు. ఎం ఏ ఎం ఎస్ సీ మొదటి సంవత్సరం విద్యార్ధులందరూ ఆ మార్చిలో డిగ్రీ పాసయిన వాళ్ళే వుండేవాళ్ళు--స్వాభావికంగా. అందుకని వాళ్ళందరూ కూడా కాన్వొకేషన్లో డిగ్రీ తీసుకునే వాళ్ళు యూనివర్సిటీలో చేరకపోయినా మిత్రులిక్కడవుండడంతో పాసైన మిగిలిన వాళ్ళు కూడా కాన్వొకేషన్ కి హాజరయ్యే వాళ్ళు. దానితో ఒక పండగ వాతావరణం వుండేది.పైగా డిగ్రీ తీసుక్లునే వాళ్ళు గౌన్ ధరించాలనే నిబంధన వుండడంతో గౌన్లు అద్దెకిచ్చే వాళ్ళతో హాస్టల్ అరుగులన్నీ నిండి వుండేవి. మరి ఫొటోలు తీసే వారు సరేసరి. ఈ సమయంలోనే యువజనోత్సవాలు జరిగేవి. అంతర్ కళాశాలల నాటక పోటీలు జరిగేవి. మూడేళ్ళకోసారి ఈ సమయంలోనే వైజ్ఞానిక ప్రదర్శన కూడా వుండేది. పైగా ఈ సమయంలోనే ఒక ఫీస్టు కూడా వుండేది.స్వస్థలాలనించి డిగ్రీ తీసుకోడానికి వచ్చిన మిత్రులకి ఆతిధ్యమియ్యడానికి మంచి అవకాశంగా వుండేది. ఈ పండగలో పాలు పంచుకోడానికి నాకు చాలానే అవకాశాలు వచ్చాయి. యెందుకంటే విజయనగరంలో బి ఎస్ సీ చదువుతున్నప్పుడుకూడా నాటకాల పోటీలకి మూడేళ్ళు వచ్చాను.సరే తరవాత ఆ గూటి పక్షినే కాబట్టి అలవాటైపోయింది.సంఖ్య యెక్కువ కావడంతో క్రమేణా డిగ్రీ పాసయిన వాళ్ళకి ఇక్కడ పట్టాలివ్వడం మానేశారు. ఆ అందమూ పోయింది--అన్నిటిలాగానే. ఇంతకీ ఇదెందుకు మొదలెట్టానంటే నేను డిగ్రీ తిసుకున్న సంవత్సరం ఒక విచిత్ర సంఘటన జరిగింది.దానిగురించి వచ్చే సారి.

Sunday, January 25, 2009

సహదేవోపాఖ్యానం-2

సాయంత్రం ఆరయ్యేప్పటికి అందరమూ మా రూము ముందున్న ఎంక్లోజర్ లో కూచున్నాము. సినిమా ఆరింటికవుతుంది. సహదేవుడు బస్సెక్కడానికి మరో అరగంట తీసుకున్నా యేడింటికల్లా రావాలి. వాడికి మెస్సు తెరవగానే తిండికి తయారవడం[ క్రీం బాచి] అలవాటు కనుక వీలయినంత తొందరగా వచ్చేయాలి. ఈ లో గా అవుట్ గేటు నించి మిరపకాయ బజ్జీలు తెచుకుని తింటూ వాడి అనుభవం వినడం కోసం వేచిచూస్తున్నాం. యేడయినా వాడి జాడ లేదు.మెస్సుకి వెళిపోయుంటాదని మేం కూడా వెళ్ళాం. మా భోజనాలు పూర్తిచేసినా వాడు రాలేదు. వాడి కోసం చూద్దామన్నా సీట్లు ఖాళీ చెయ్యాలి. మెస్సు ముందే కుర్చీలు తెప్పించి వేసుకుని కూర్చున్నాం తొమ్మిదిన్నరయినా వాడు కనబడలేదు.[శనివారం పదిన్నర దాకా మెస్సుంటుంది.] తప్పిపోయాడేమో అని అనుమానం వచ్చింది. అయితే రావలసింది యూనివర్సిటీ కి కనుక యెలాగైనా వచ్చేస్తాడు పరవాలేదని యెవరి రూముకి వాళ్ళు వెళిపోయాం . రాత్రి యెప్పుడొచ్చాడో యేమోకాని పొద్దున్న లేచి చూసేప్పటికి గదిలో ముసుగు కప్పుకుని నిద్రపోతున్నాడు. లేపి యేమయిందని అడిగితే యేమీ మాట్లాడలేదు. సైలెంట్ గా మెస్సుకి వెళ్ళి టిఫిన్ తిని వచ్చేశాడు. తరవాత కొంచెంసేపటికి ఇంతకీ ఆ సరస్వతీ టాకీసు యెక్కడుందిరా అని సగం యేడుస్తున్న గొంతుతో అరిచాడు.అయితే నువ్వు సినిమా చూడనే లేదా అని హాచ్చెర్య పోయాం[నవ్వు దాచుకుంటూ] హాలు కనిపిస్తేకద సినిమా చూడ్డానికి. మీరు తిన్నగ దారి చెప్పకుండా నన్నేడిపిస్తారా అని కోపించాడు. అదేమిట్రా చౌల్ట్రీ దగ్గిర దిగి యెవర్నైనా అడగమన్నాం కదా అంటే ఆ వాడేమో చౌల్ట్రీ యెదురుగా వున్న రోడ్డు మీద వెళ్ళమన్నాడు అలా వెళితే వెళితే రైలు పట్టాలూ బ్రిడ్గీ వచ్చాయి ఇంకా ముందుకెళితే రైలుగేటొచ్చింది అక్కడడిగితేనేమో నన్ను అదోలా చూసి వెళిపోయారు .ఆ చుట్టూ తిరిగి తిరిగి యెంతకీ కనపడక పోతే ఇంతలో రెండో నంబరు బస్సు కనిపించింది. ఇంక అది యెక్కి రూముకి వచ్చాను. అన్నాడు. మాకేమీ అర్ధం కాలేదు.కొంచెం సేపటికి వెలిగింది. వాడు అమాయకుడనుకున్నామే కాని మరీ ఇంత అనుకోలేదు. యేమయిందంటే వాడు వెళ్ళిన రోడ్డు మీద ఒక అయిదు నిమిషాలు నడిచాక కుడిపక్క తిరగాలి. ఇప్పుడయితే అక్కడ డాల్ఫిన్ హోటలూ జ్యోతీ థియేటరూ వున్నాయి. అప్పుడవేమీ లేవు. అక్కడ వాడెవర్నైనా మరోసారి అడిగివుంటే బాగుండేది. అలా కాకుండా తిన్నగా ముక్కుకి సూటిగా వెళ్ళాడు.అయినా అప్పటికి రాజేశ్వరీ మనోరమా వంటి సినిమాహాళ్ళు లేవు-ఇప్పుడూ లేవనుకోండి!. చావుల మదుం బ్రిడ్జి దాటి కూడా వెళ్ళి రామ్మూర్తిపంతులు గేటు దగ్గిరకి వెళిపోయాడు. అక్కడికి వెళ్ళి సరస్వతీ టాకీసని అడిగితే అదోలా చూడరామరి!ఇంతకీ అసలు సందేహం తీరలేదు. మరి అంత సేపేం చేస్తున్నావురా అని అడిగితే మీరంతా ఆట పట్టిస్తారని అయిదింటి నించీ లైబ్రరీ లో కూర్చున్నాను. అని సెలవిచ్చాడు. అందరం తలో దెబ్బా వేసి ప్రాయశ్చిత్తంగా వాణ్ణి వూటీ హోటలుకి తీసుకెళ్ళి స్పెషల్ మీల్సు పెట్టించి బందిపోటు సినిమా చూపించి పాప నాశనం చేసుకున్నాం. తరవాతి రోజుల్లో ఆ అమాయకత్వాన్నంతా వదిలించుకుని టాప్ రాంకరై వో ఎన్ జీ సీ లో ఉన్నతోద్యోగి అయ్యాడు వాడికి నా శుభాకాంక్షలు. చదువుతాడు నాకు తెలుసు.

Friday, January 23, 2009

సహదేవోపాఖ్యానం

నిన్న యెందుకనో సహదేవుడు గుర్తుకొచ్చి మళ్ళీ రాయడానికి పురికొల్పాడు. సహదేవుడు నేను చేరినప్పుడ యూనివర్సిటీలో చేరాడు-జియోఫిజిక్సులో చేరాడు. గ్రామీణ ప్రాంతం నించి వచ్చినవాడవడంచేత కొంచెం అమాయకంగా వుండేవాడు మొదట్లో- తరవాత షరామామూలే కదా.1963 ఆగస్టు నాటి సంగతి.అప్పటి విశాఖకీ నేటి విశాఖకీ రాజసులోచనకీ ముమైత్ ఖాన్ కీ ఉన్నంత తేడా.యూనివర్సిటీకీ టౌన్ కీ మధ్య అగాధమే అనవచ్చు. మరో వూరెళ్ళినట్టే వుండేది.రాత్రి తొమ్మిదయ్యాక తిరిగి రావడమంటే నడకే. ఆటోలు లేవు. రిక్షావాడు లాగలేడు.[రిక్షా వాడితో సి ఆర్ చంద్రన్ కధ కూడా వుంది. సమయానుసారం అదీ వస్తుంది] మొదటాట సినిమాకి వెళితే తిండీ దొరకదు. అందుకని అయితే మేట్నీ కీ లేకపోతే యెలాగా నడవాలి కాబట్టి సెకండ్ షోకీ వెళ్ళేవాళ్ళం.మరి సెకండ్ షో అంటే నిర్మానుష్యంగా వున్న దార్లో కొంచెం ధైర్యం కాని బోలెడు మొండితనం కాని వుండాలి.అలాంటి రోజుల్లో బందిపోటు సినిమా రిలీజయింది. సరస్వతీ టాకీసులో. అన్న గారి సినిమా పైగా అప్పట్లో విశేషాకర్షణగా బోలెడు నేలబారు నృత్యాలున్న సినిమా.మేం హెడ్ వాకింగ్ చేసి మొదటి రోజునే చూసివచ్చి తెగ కబుర్లు చెప్పుకున్నాం. వినివినీ సహదేవుడికి నోరూరింది.చూడాలి చూడాలి. వాడప్పటికా వూరొచ్చి వారమే అయింది. విశాఖలో దారులు అంతబాగా తెలిసిన వాడు కాదు. సినిమాకి తనే టిక్కెట్టుకొని తీసుకెళతానని ఎవర్నైనా కలిసి రమ్మనీ చాలా అడిగాడు. యే బుధ్ధితో ఉన్నారో ఎవరూ పలకలేదు. మర్నాడు శనివారం. మధ్యాహ్నం పన్నెండింటికల్లా బయలు దేరి తనే వెళ్ళాడు. టిక్కెట్టు దొరక్కపోతే యెలా సంపాదించాలో తలో సలహా ఇచ్చారుకాని ఎవరూ కదల్లేదు.కొంచెం విశాఖ గురించి గుర్తు చెయ్యాలి. అప్పట్లో సిటీ కి వెళ్ళాలంటే టర్నర్స్ చౌల్ట్రీ నే ముఖ్య బస్ స్టాపు. ఇప్పట్లా దాన్ని సూపర్ బజార్ అనే వారు కాదు. నిజానికి అప్పుడు సూపర్ బజారింకా లేనేలేదు.ఆ స్థలంలో ఒక టీచర్ ట్రైనింగ్ స్కూలుండేది. సరే జగదంబ సంగతి చెప్పక్కరలేదు.అప్పట్లో యెల్లమ్మ తోట అనబడే ఆ స్టాపు దగ్గర దిగినా అక్కడేమీ ఉండేవి కావు. అందుకని చౌల్ట్రీ దగ్గర దిగమని మరీ మరీ చెప్పి కాగితం మీద రాసి ఇచ్చి మరీ సాగనంపాం. బస్సుకి పన్నెండు పైసలు సినిమాకి రూపాయి పది పైసలు. ఇంటర్వెల్లో సోడా మూడు పైసలు,తిరిగి బస్సు పన్నెండు పైసలు పైసలు, వెరసి రూపాయి ముఫ్ఫయ్యేడు పైసలు యెందుకన్నా మంచిది రూపాయిన్నర తీసుకెళ్ళమని కూడా చెప్పాం . నవ్వకండి సినిమా కెళ్తే మాఖర్చు ఆ రోజుల్లో అంతే-- మేటనీ కైతే! అదే మొదటాట కైతే తిరుగు బస్సుండదు కాబట్టి ఇంకా తక్కువ.టిఫిను కూడా తింటే మరో ఇరవై ఎనిమిది పైసలు. ఆ మాట పక్కన పెడదాం. వాడు వెళ్ళిన తరవాత ఆ మధ్యాహ్నమంతా వాడు యెలా గడుపుతాడో తలుచుకుని తలుచుకుని ఒకటే ఆనందించాం-- బారిష్టరు పార్వతీశం గారిని కూడా తలుచుకున్నాం.మొత్తానికి మంచి మధ్యాహ్నం.ఇంతకీ యేమయింది?

Sunday, December 21, 2008

drying up

నాలుగు దశాబ్దాలకిందటి మాట.అప్పట్లో జె బాపురెడ్డి గారు విశాఖలో ఉండేవారు. మా అక్క తురగా జానకీరాణి ఏదో పని మీద ఇక్కడికి వచ్చి పాత మిత్రుణ్ణి చూడాలని నన్నుకూడా తీసుకుని వెళ్ళింది.వాళ్ళ పిచ్చాపాటీలో ఆయన్ని అడిగింది .మీకెప్పుడైనా ఒకసారి యేమీ రాయలేకుండా అయిపోతుందా అని. తనకి ఉన్నట్టుండి అలా అయిందని యేదన్నా రాద్దామంటే అసలు మనసు పుట్టడంలేదనీ అంది. ఆయనేదో సమాధానం చెప్పారనుకోండి. నేను మాత్రం కుర్రతనపు వేడిలో వాళ్ళ హిపోక్రసీ కి నవ్వుకున్నాను. ఈ మధ్యనే ఆ బాధేమిటో తెలిసింది. కొన్ని దశాబ్దాలుగా ఫిజిక్సో ఎలెక్ట్రానిక్సో కధలో బ్లాగులో అదేపనిగా రాస్తూనే పోయినా గత నెల రోజులుగా మనసటుపక్క పోవడంలేదు. ఈ రోజే కొంచెమైనా చెయ్యి కదిలింది. నన్ను రాయమన్న కంపెనీలన్నీ జుట్టు పీక్కుంటున్నాయి. ఇద్ మొదలేమో అని ఆశగా వుంది.

Friday, December 12, 2008

Friday, October 24, 2008

ఉపేంద్రనాధ్ గురించిచెప్పాలి.అతను ఇంగ్లీషులో మామూలుగా మాట్లాడే పదాలకి తెలుగు మాటలు సృష్టించడంలో నిష్ణాతుడు. మాటవరసకి వర్క్ షాప్ ప్రాక్టికల్సుని కార్మికుల కార్యక్రమం అని నామకరణం చేసింది అతనే. అలాగే ఎలెక్ట్రానిక్స్ లాబ్ లో వైర్ల మీద ప్లాస్టిక్ స్లీవింగ్ తీసే కార్యక్రమాన్ని తోలు తీయడం అని అన్నదీ అతనే.షడాననరావు రూమ్మేటుగా చాలా గమ్మత్తయిన జంటల్లో ఒకడుగా మమ్మల్ని అలరించెవాడు.అతని పెదనాన్నగారు పేరెన్నికగన్న సైంటిస్టు అంతే కాకుండా మా డిపార్ట్మెంటుకి అనేక సార్లు యెక్జామినరుగా వచ్చి కర్కోటకుడని పేరు తెచ్చుకున్నవాడు. ఆయనగురించే తొమ్మిదీ లేక తొంభయ్ అనే నానుడి వచ్చి భూప్ రాజ్ పాండే లాటివాణ్ణి గడగడలాడించింది.యెవరా పాండే యేమాకధ అంటే కొంచెం ఆగాలి మరి. ఉపేంద్రనాధ్ మాతో పాటు యెలెక్ట్రానిక్స్ స్పెషల్ తీసుకున్న అయిదుగురిలో ఒకడు. ఎం ఐ టి శాస్త్రి గారి మాటకే బిక్కచచ్చిపోయిన జే ఎస్ ప్రకాశరావు కి కొండంత అండగా నిలిచిన వాడు. ఈ కధలన్నీ వినాలంటే కొంచెం ఆగాలి మరి.`