Search This Blog

Friday, February 13, 2009

convocation

ఆంధ్రా యూనివర్సిటీ జీవితంలో ముఖ్య స్థానంలో హాస్టల్ జీవితం, మెస్సులు , కాంటీన్ ఆక్రమిస్తాయి. ఇక్కడేకాదు --ఐ ఐ టీ విద్యార్ధులని అడిగినప్పుడూ ఇదే చెప్పారు. వీటికి సంబంధించిన జ్ఞాపకాలూ మధురమే. మెస్సుల్లో ఫీస్టులని వివిధ సమయాల్లో నిర్వహించే వాళ్ళు. వాటికి మిత్రులని గెస్టులుగా పిలిచే యేర్పాటు వుండేది. దాదాపు పెళ్ళి భోజనాల్లాగ మంచి సందడి వుండేది. సంవత్సరాంతంలో వోపెన్ ఎయిర్ ఫీస్టు వుండేది. దానికి మాస్టర్లని పిలిచే రివాజు వుండేది. ఒక చీఫ్ గెస్టు ప్రముఖుల్నెవర్నైనా పిలిచే వాళ్ళం. కాన్వొకేషన్ ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదటి శనివారం నిర్వివాదంగా నిర్వహించే వారు. దీనికి ఒక ప్రాముఖ్యత యేమంటే అప్పట్లో డిగ్రీ [బి ఏ, బి ఎస్ సీ వంటివి] పాసైనవాళ్ళకి కూడా కాన్వొకేషన్ లోనే డిగ్రీ ఇచ్చే వారు. ఎం ఏ ఎం ఎస్ సీ మొదటి సంవత్సరం విద్యార్ధులందరూ ఆ మార్చిలో డిగ్రీ పాసయిన వాళ్ళే వుండేవాళ్ళు--స్వాభావికంగా. అందుకని వాళ్ళందరూ కూడా కాన్వొకేషన్లో డిగ్రీ తీసుకునే వాళ్ళు యూనివర్సిటీలో చేరకపోయినా మిత్రులిక్కడవుండడంతో పాసైన మిగిలిన వాళ్ళు కూడా కాన్వొకేషన్ కి హాజరయ్యే వాళ్ళు. దానితో ఒక పండగ వాతావరణం వుండేది.పైగా డిగ్రీ తీసుక్లునే వాళ్ళు గౌన్ ధరించాలనే నిబంధన వుండడంతో గౌన్లు అద్దెకిచ్చే వాళ్ళతో హాస్టల్ అరుగులన్నీ నిండి వుండేవి. మరి ఫొటోలు తీసే వారు సరేసరి. ఈ సమయంలోనే యువజనోత్సవాలు జరిగేవి. అంతర్ కళాశాలల నాటక పోటీలు జరిగేవి. మూడేళ్ళకోసారి ఈ సమయంలోనే వైజ్ఞానిక ప్రదర్శన కూడా వుండేది. పైగా ఈ సమయంలోనే ఒక ఫీస్టు కూడా వుండేది.స్వస్థలాలనించి డిగ్రీ తీసుకోడానికి వచ్చిన మిత్రులకి ఆతిధ్యమియ్యడానికి మంచి అవకాశంగా వుండేది. ఈ పండగలో పాలు పంచుకోడానికి నాకు చాలానే అవకాశాలు వచ్చాయి. యెందుకంటే విజయనగరంలో బి ఎస్ సీ చదువుతున్నప్పుడుకూడా నాటకాల పోటీలకి మూడేళ్ళు వచ్చాను.సరే తరవాత ఆ గూటి పక్షినే కాబట్టి అలవాటైపోయింది.సంఖ్య యెక్కువ కావడంతో క్రమేణా డిగ్రీ పాసయిన వాళ్ళకి ఇక్కడ పట్టాలివ్వడం మానేశారు. ఆ అందమూ పోయింది--అన్నిటిలాగానే. ఇంతకీ ఇదెందుకు మొదలెట్టానంటే నేను డిగ్రీ తిసుకున్న సంవత్సరం ఒక విచిత్ర సంఘటన జరిగింది.దానిగురించి వచ్చే సారి.

No comments: