Search This Blog
Wednesday, March 19, 2008
kaamaakshi
విజయనగరం ముగిద్దామనుకుంటే అలలు అలలుగా ఇంకా ఉన్నాం మా సంగతేమిటంటున్నాయి. మరి విశాఖ వెనక పడుతోందంటే నీ తోనే ఉందిగా అని ఇకిలిస్తున్నాయి. మధ్యలో కంచి యాత్రొకటి. చెన్నై నించి కంచికి వెళ్ళడం ఒక పెద్ద ప్రణాళిక అయిపోయింది. అంత చిక్కులతో ఉందని నేననుకోలేదు. అంత మరీ ప్రాచుర్యం లేదా అంటే మరి హోటళ్ళన్నీ నిండుగానే ఉన్నాయి.రైలేదీ లేదు లోకల్ తప్ప. బస్సెక్కాలంటే మరో వూరెళిపోవాలన్నారు. సరే అని టాక్సీ లో వెళ్ళాము. ఆటో యెక్కి కామాక్షి సన్నిధికెళ్ళాము.అంతా మరిచిపోయాను. ఆమె వదనం చూసి.ఆమె యెవరు? తల్లా , సోదరా , మిత్రురాలా, ప్రేమికా. యేమి ఆ ఆత్మీయత!యేమి ప్రశాంతత. జీవితం ధన్యమయిందనిపించింది. యీ విషయాలు మరో చోట.
విజయనగరం గురించి రాస్తూ పంచాయతనేశ్వర్ సంగతే యెత్త లేదని గుర్తొచ్చింది. ఎన్ సి సి అండర్ ఆఫీసర్ గా అతను రూట్ మార్చ్ లీడ్ చేసుకుంటూ వెళుతుంటే అందరం ముగ్ధులమై చూసే వాళ్ళం . అప్పట్లో ఎన్ సీ సీ యూనిట్లతో పాటు మిలిటరీ ఆఫీసర్లు ఉండేవారు. ట్రైనింగ్ ఇవ్వడానికి. వాళ్ళ స్నేహం ప్రభావమో,సొంత తెలివో గాని పంచాయతనేశ్వర్ కూడా గెడ్డం పెంచి సర్దార్జీ లాగానే వుండేవాడు. బి కాం చదివే వాడు.యెర్రని మనిషి నిలువెత్తు విగ్రహం . ఇప్పుడేం చేస్తున్నాడో తెలీదు మరి . యెవరికైనా తెలుసా? ఇంకా సారధి గురించి రేపు రాస్తాను.
Sunday, February 17, 2008
vijayanagaram marosaari
విజయనగరం పేర్లు చదివేసరికి చాలామంది మిత్రులు మెయిల్ చేశారు. శాయినాధరావు చాలామంచి మిత్రుడు. అవడానికి నాకొక యేడాది సీనియరే అయినా నాతో కలిసి బి ఎస్ సీ మూడో సంవత్సరం పరీక్ష రాశాడు. మేమిద్దరమూ కంబైండ్ స్టడీ చెసే వాళ్ళం.అతని బాబాయి తెన్నేటి వరహాలు ఇంకా ఆప్తమిత్రుడు. అతని మరణం వల్ల నేను చాలా షాకై ఒక కధ కూడా రాసేను. వీళ్ళిద్దరూ పారనంది రామ్మూర్తీ నేనూ మేమంతా రోజుల తరబడి అడ్డాట ఆడుతుండే వాళ్ళం. అనుక్షణం జోకులతో ఆనందం వెల్లివిరుస్తుండేది.వివిబి రామారావు గారిగురించి మీరన్నది కొంచెం నిజమే అయి వుంటుంది. ఆయన కొత్తగా ట్యూటరుగా చేరడమే నాకు తెలుసు. తరువాత తరువాత ఈ మధ్యలో నాకు పరిచయమైన ఒక డాక్టరు గారు ఆయన తోడల్లుడవడం చేతా, కొన్ని సంవత్సరాలక్రితం వారమ్మాయిని మా పెద్దవాడికిద్దామనుకోడం చాతా ఆయన జ్ఞాపకాలు ఇంకా మిగిలి వున్నాయి. ఆయన కొన్ని నవలలు కూడా రాసి బహుమతులు గెల్చుకున్నారు. నారాయణస్వామి తెలుగు మాస్టారే. ఆయనకి సారాకొట్టుండడం నాకు న్యూసే.అన్ని విద్యలున్నాయనుకోలేదు. ఆయనా మేం చదువుతున్నప్పుడు కొత్తగా చేరాడు.ముద్దుకృష్ణ నా క్లాస్ మేటు. చాలా నాటకాలు కలిసి వేశాం.అతన్ని డ్రమటిక్ అసోసియేషన్ సెక్రటరీ గానిలబెట్టి గెలిపించినప్పుడు కరపత్రాల మీద శ్రీశ్రీ గేయాలు ముద్రించి ఒక కొత్త వరవడిని సృష్టించాను.
రేపు బయలుదేరి నా భార్యతో కంచి యాత్రకి వెళుతున్నాను.దైవభక్తి నాకు నామమాత్రమే అయినా సంస్కృతిమీద అపారమైన గౌరవం వుంది. మధురమీనాక్షి కంచి కామాక్షి కాశీ విశాలాక్షి అంటే యెందుకో తెలియని ఆప్యాయత. మళ్ళీ కలుస్తాను.
Saturday, February 2, 2008
vijayanagaram
విజయనగరం జ్ఞాపకాలు ముగిద్దామనుకుంటే ముగిసేవికాదు. ఆ వూరి సుగంధమే అంత.ముద్దుక్రిష్ణ, పెద్దిరాజు, జగ్గప్ప, మల్లపరాజుగారు, ఇనపదేముడనబడే నారాయణస్వామి గారు, రామశరమ, ఎం ఎస్ ఆర్ కేఅ, రామా, చంద్రశేఖరశర్మగారి దుర్యోధన యేకపాత్రాభినయం, వీ వీ బీ రామారావుగారు, భాస్కరరామమూర్తిగారు,స్యాంసుందర్ గారు, ఢిల్లీ నీలాచలరావు గారు, ఏ యూ ఎస్ యూనియన్ భవనంలో మేం చేసిన అల్లర్లు, మచ్చ గాడనబడే వెంకటరావు,టీ Yఏఆ నాయుడనబడేఅ అప్పలనాయుడు, సాయినాధరావు, అహ్మద్ ,వరహాలు, చైనా డాక్టరు కొడుకు, శాస్త్రి, రామదాసు, పార్ధసారధి, సత్యమూర్తి, బులుసు వారి పుస్తకాలషాపు, డీఫీ శాస్త్రి గారి పుస్తకాల షాపు, దేవీ విలాస్, నియొ మలబార్ హోటల్ లొ స్పిన్నర్ చంద్రశేఖర్ తో కలిసి మసాలాదోశ తినడం, యెన్ని స్మృతులు. వీళ్ళలో యెవరన్నా మీకూ తెలిస్తే రాస్తారా
Thursday, January 24, 2008
tan theta one more time
ఆర్ ఎస్ జీ గారికి. మీ సందేహానికి సమాధానం పోస్టు ద్వారా ఇస్తున్నందుకు మీరేమీ అనుకోరనే భావిస్తున్నాను. అరటిపండు ఒలిచినట్టే చెప్పానని అనుకున్నాను.కదళీఫలం అనుకున్నది నారికేళం కూడా అవవచ్చని వూహించలేదు.పప్పు నాగరాజు గారు వెంటనే పట్టుకున్నారు. వారూ విజయనగరం వారు కావడం వల్లనేనా.[ జై విజయనగరం] తీటా గ్రీకు అక్షరంతెలుసుకదా సాగదీసిన కోడిగుడ్డు నిలుచున్నట్టుంటుంది అంతకన్నా మరేం లేదు. పైగా టాంజెంటు కూడాకలిస్తే గీత అని కూడానేమో. నిజానికి ఇది నా టిప్పణి మాత్రమే. ముద్దుపేర్లకి లాజిక్కేమీ ఉండక్కరలేదు--అందరి నోళ్ళలోనూ నాని రుచిగా తయారవడం తప్ప.
విజయనగరం జ్ఞాపకాలు బాగా సాగుతున్నాయని ముగిద్దామనుకున్నాను.విశాఖ పూర్తిచెసేటప్పటికి చెయ్యలేనంత వృధ్ధాప్యం వస్తుందేమోనని.అయితే మిత్రులు చాలామంది వద్దువద్దని ప్రోద్బలిస్తున్నారు. మరి కాదనలేక కొనసాగిస్తున్నాను.
సిటీ క్లబ్ టెన్నిస్ పోటీల గురించి ఇంతకు ముందొకసారి ప్రస్తావించాను. అక్కడ టెన్నిస్ చూడ్డానికి టిక్కెట్టు కొనడం కుర్రాళ్ళకీ కొనిపించడం క్లబ్ వాళ్ళకీ సమస్యగానే వుండేది. యెందుకంటే ఆట చూడకుండా యెంట్రీ గేటు దగ్గర ఉండే టెన్నిస్ ఫాన్లు యెవరుంటారు? సిటీక్లబ్ పేకాట క్లబ్ కూడా కావడం పనికొచ్చింది. కరడు గట్టిన వృధ్ధ పేకాట రాయుళ్ళనిద్దరిని యెంచారు. వాళ్ళిద్దరికీ ఒక టేబుల్ గుమ్మని కడ్డంగా వేసి హాండ్ తు హాండ్ మీక్కావలసినంత సేపు ఆడుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హరి మీద గిరిపడ్డా వరింక అక్కడినించి కదిలే వారు కాదు. లోపల నస్టసే లాల్ మాచ్ అవుతోంది చుడరా అని బుట్టలో పడేద్దామంటే వాళ్ళెవరు? నా కౌంట్ ఆడు కడతాడా అని కసిరే వారు.
అయ్యా అదీ సంగతి.
Sunday, January 6, 2008
kraantikumar
మర్నాడు ఒక కర్రపుల్ల క్రాంతిని తీసుకుని మా ఇంటికి వచ్చాడు.వాడిని బయటే నిలబెట్టి క్రాంతి ఇంటిలోకి వచ్చాడు.అసలు సంగతేమని అడిగాను.వాళ్ళ పల్లెటూరిలో ఒక వీధిబడి మాస్టారి కూతురు . ఆమెని చూడగానే యేదోలా అయిపోయేడట.కొన్ని జన్మలనించీ కలిసివున్న అనుబంధమని అనిపించిందట. ఆ అమ్మాయికికూడా అలానే అనిపించిందా, యెప్పుడయినా చెప్పిందా అని అడిగేను. చెప్పుతో కొడతానందట. ఇంకా గోల చేస్తే వాళ్ళ వాళ్ళతో చెప్పి చావగొట్టిస్తానందట.అయితే మరెందుకీ గోల అనడిగేను. మనసనేదొకటుందికదా అన్నాడు.బియ్యే సంగతేమయింది.మళ్ళీపరీక్ష రాశావా అని అడిగాను.వాడి ముఖమే చెప్పింది. చూడు క్రాంతీ మనం వేసిన నాటకాలు వేరు. జీవితం వేరు.మనతోనే తిరిగిన తేజేశ్వరరావు ని చూడు. అతను పేదప్రజల పక్షాన నిలబడి యెంతో పోరాటం చేశాడు. వాళ్ళకి దేవుడై నిలిచాడు. ప్రాణాలకి లెక్క చెయ్యలేదు. ప్రాణం ఇస్తే ఆశయాలకోసం ఇవ్వాలికాని ఇలా వూహల కోసం కాదు అని చెప్పాను. నన్ను చూడు. నేనూ జీవితంలో యేదో కొంత సాధించాను.అనీ చెప్పాను.[ఇలా ఇంటర్నెట్ లో వున్నప్పుడల్లా వీటన్నిటికీ మూలస్తంభమైన ఐ సీ ఆవిర్భావంలో నాకూ సూదిమొనంత భాగస్వామ్యం వుందనిపించినప్పుడు అప్పుడప్పుడు ఛాతీ ఉప్పొంగుతుంది]ప్రేమ చాలా చిన్న విషయం అని నేనంటే నా పక్క నమ్మలేనట్టుగా చూశాడు.అంతేనంటావా అన్నాడు. యేమనడానికీ నేను సర్వాంతర్యామినికాదు. నా ఉద్దేశం చెప్పాను. ఒక మిత్రుడిగా సలహా ఇచ్చాను అని చెప్పాను. తరవాత అందరం కలిసి లంచ్ చేశాం.చాలా రిలాక్స్డ్ గా మారాడు.మధ్యాహ్నం టీ కూడా అయ్యాక వెళ్ళొస్తాను, థాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పటి దాకా కనపడలేదు. బాగుపడ్డాడో లేక నన్ను కూడా కౄరకఠోర లోకంలో ఒక భాగంలా భావించి కాలంలో కలిసిపోయాడో పెరిమాళ్ళకెరుక
Monday, December 31, 2007
krantikumaar
ఆ సుడిగాలి వెంకే కర్రపుల్లలూ ఆకులూ కొట్టుకొచ్చినట్టు కొంతమంది యువకులు కూడా పరిగెత్తుకొచ్చారు . మా అబ్బాయి ఎన్ టీ ఆర్ , కృష్ణ సినిమాలు వంటపట్టించుకుని ఇప్పుడు ఫైటింగవుతుందా అని అడిగేడు.క్రాంతి నా వెనకాలకి వెళ్ళి నిలబడ్డాడు.యెవరు మీరు అని అడిగేడు పెద్ద కర్రపుల్ల. చెప్పాను. యూనివర్సిటీ ఉపాధ్యాయుడిననీ కొంతకాలం ముందు క్రాంతి మిత్రుణ్ణనీ.విజయనగరం కాలేజిలో కలిసి చదివామనీ చెప్పాను. మీరు క్రాంతిని కలిసి యెన్నాళ్ళయింది అని అడిగేడు. అప్పటికి పదిపన్నెండేళ్ళయింది. ఆ మాటే చెప్పాను. మధ్యలో కలవనేలేదా అని సందేహంగానే అడిగేడు. లేదన్నాను. అప్పటికి కొంచెం సమాధానపడ్డాడు.నేనెక్కడుండేదీ చెప్పి క్రాంతిని మర్నాడు మా యింటికి పంపించమన్నాను. నేను యెవరినో తెలిసేక కొంచెంలొంగి వచ్చారు. సరే నన్నారు. క్రాంతికి ఏమీ భయం లేదనీ మర్నాదు నా దగ్గరకి రమ్మనీ చెప్పి ఇంటికి వెళ్ళ మన్నాను. కొంచెం బిక్కుబిక్కుగా చూసేడు. ఉండేదెక్కడని కర్రపుల్లలని అడిగేను . యెదురుగా వున్న ప్రెస్సే ఇల్లన్నారు. నేను కూడా లోపలకి వెళ్ళి క్రాంతిని గదిలోకి వెళ్ళమని వాడు వెళ్ళాక కర్రపుల్లలని అడిగేను. అసలీ డ్రామా అంతా యేమిటని.సార్ మీతో చెప్పడానికేమిటి. క్రాంతిబాబు మా వూళ్ళో ఒక అమ్మాయిని ప్రేమించానంటున్నాడు.ఆ అమ్మాయి కనపడకపోతే చచ్చిపోతానని గోల మొదలు పెట్టి పిచ్చి చేష్టలు చెయ్యడం కూడా మొదలు పెట్టాడు. అందుకని వాళ్ళ బాబాయి గారు ఇక్కడైతే జాగర్తగా వుంటాడని మమ్మల్ని కాపలా పెట్టారు. యీ ప్రెస్సు వాళ్ళదే అని చెప్పారు.గాలితీసిన బుడగలాగా అయ్యేను. నేనేదో డ్రమాటిక్ గా నక్సలిజమూ అండర్ గ్రౌండూ అన్నీ వూహించుకుంటే ఇలా చింతకాయపచ్చడి బయటకొచ్చింది. సరే రేపు నా దగ్గరకి పంపండి నేను చెప్పి బాగుచేస్తాను అని తిరుగు ముఖం పట్టేను. ఇంటికి వెళ్ళాక మా రెండో వాడు మంచి సీనులో తను లేకపోయినందుకు చాలా చింతించేడు.
Thursday, December 20, 2007
krantikumaar
నేను గుర్తుంచుకునే వారిలో ఒక ప్రతేక వ్యక్తి క్రాంతికుమార్. క్రాంతి అని పిల్చే వాళ్ళం. నేను బీ ఎస్ సీ చదువుతున్నప్పుడు బీ ఏ పాలిటిక్సో ఎకనామిక్సో చదివే వాడు. నాటకాలలో స్త్రీ పాత్రలు ధరించడంలో నిష్ణాతుడు[!]. ఈ కాలం వాళ్ళకి వాల్వు రేడియో చూపిస్తే యెంత వింతగా వుంటుందో మగవాళ్ళు స్త్రీ పాత్రలు వెయ్యడం కూడా అంత వింత గానే వుంటుంది.మరి 1960 -63 రోజుల్లో అంతే. ఈ కష్టాలు లేకుండా స్త్రీపాత్రలు లేని నాటకాలు కూడా రాసే వాళ్ళు రచయితలు. విముక్తుడు, విలువలు, ఆడది లాంటి అనేక పేరుగన్న నాటికలుండేవి.క్రాంతి మాటకొస్తే అతను ఆడవేషం కడితే నిజంగా అమ్మాయి లానే వుండే వాడు.ఒక రకంగా నాకు మొదటి ప్రియురాలు అతనే.అతను సర్దార్ గౌతు లచ్చన్న గారికి సోదరుని కొడుకు.ఆయనకే పెంపుడు కొడుకు లాటివాడు.అ కాలంలో అందరు యువకుల్లాగే అతనూ విప్లవ భావాలు మెండుగా వున్నవాడు. మా అందరితోనూ కలిసి విప్లవ సంభాషణలు కబుర్లు బాగానే చెప్పేవాడు.ఆ రోజుల్లో శ్రికాకుళం జిల్లా నించి చాలామంది విజయనగరం మహారాజా కాలేజ్ లో చదవడానికి వచ్చే వాళ్ళు. క్రాంతి తో పాటు బి యే చదివినవారిలో చౌదరి తేజేశ్వరరావు ఒకడు. కొంత కాలం ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్ ఎఫ్ ఐ కి నేను అద్యక్షుణిగానూ తేజెశ్వరరావు కార్యదర్సి గానూ వుండేవాళ్ళం అప్పటికింకా కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలలేదు[ ఇప్పుడు అసంఖ్యాకంగా చీలిందనుకోండి. అది అప్రస్తుతం] చీలిన తరువాత నేను నెమ్మదిగా ఆ కార్యకలాపాలకి దూరం కావడం తేజేశ్వరరావు మరో రకంగా ప్రఖ్యాతుడవడం జరిగింది.క్రాంతి గురించి చెప్పుకుంటున్నాంకదా! అతని మాట అచ్చు అమ్మాయి మాట లాగే వుండేది. ఈ బ్లాగులో చెప్పడం యెందుకంటే క్రాంతి బియే పాసవలేదు. నేను విశాఖ వచ్చాను. తరవాత చాలా జీవితం గడిచాక నా పెళ్ళి అయి పిల్లలు పుట్టి యూనివర్సిటీలో మంచిగానూ చెడుగానూ పీరుపొందాకా 1975లో అను కుంటాను విశాఖలో మెయిన్ రోడ్డుమీంచి లక్ష్మీ టాకీసు బస్ స్టాపుకి మా పెద్ద వాణ్ణి[అయిదేళ్ళు వాడికి] తీసుకుని కబుర్లు చెప్పుకుంటూ నడిచి వస్తుంటే ఒక ఇంటిలోంచి [గోదావరి టింబర్ డిపో కి ముందు ఇల్లు] సుడిగాలిలా పరిగెట్టుకుని వచ్చి అచ్చం కాళరాత్రి నాటకంలో దెయ్యాన్ని చూసి పరిగెత్తుకుని వచ్చి నన్నెలా అల్లుకుపోయాడో అలాగే వచ్చి వాటేసుకున్నాడు. యేమయింది ?
బ్లాగులోనైనా కొంచెం ఉద్విగత వుండాలికదా. రేపు చెప్తాను.
Subscribe to:
Posts (Atom)