Search This Blog

Sunday, August 15, 2010

మళ్ళీ విశాఖ కబుర్లు

కాన్వొకేషన్ గురించి రాస్తున్నానుకదా. కాన్వొకేషన్ అంటే ఆరోజుల్లో ఒక జాతరలాగే వుండేది.వారం రోజుల ముందునించే షెడ్స్ అనబడే హాస్టళ్ళ వరండాలలో గౌన్లు అద్దెకిచ్చే వాళ్లు మకాం వేశేవాళ్ళు. కాన్వొకేషన్ కి గౌన్ తప్పనిసరి.సాధారణంగా వాళ్ళందరూ తమిళులూ మళయాళీలూ వుండేవారు. కారణం తెలీదుకాని దక్షిణభారతంలోని యూనివర్సిటీలన్నిట్లోనూ వీళ్ళే వుంటారని అనుకుంటాను.మూడు రూపాయలిస్తే గౌను ఇచ్చేవారు.మంచిగా మాట్లాడితేనూ బతిమాలితేనూ తగ్గించేవారు.నవ్వొస్తుందేమోకాని ఆ రోజుల్లో 2 ప్లేట్ల టిఫినూ కాఫీకి అర్ధరూపాయే అయేది. లీలామహల్లో సినిమా టిక్కెట్టు రూపాయి పది పైసలు బస్సు టిక్కెట్టు పన్నెండు పైసలూ. రూపాయిన్నర తీసుకెళితే సినిమాప్రోగ్రామంతా అయేది-ఇంటర్వెల్లో ఐస్ క్రీం సోడాతోసహా.మరో విశేషం ఆ వారంలోనే యువజనోత్సవాలూ నాటక పోటీలూ జరిగేవి. రాష్ట్రంలో వివిధ కాలేజిలనించి వచ్చిన జట్లు నాటకాలాడేవి.జె వి డి ఎస్ శాస్త్రిగా వచ్చి తస్మాత్ జాగ్రత నాటకంలో ఉత్తమనటుడూ ఉత్తమ నాటకం ప్రైజు పొందిన వ్యక్తి జంధ్యాల గా సినిమారంగంలో ప్రసిధ్ధుడయారు. అది చాలాకాలం తరవాత జరిగింది. సమయం ఒచ్చినప్పుడు ఆ సంగతి. 63 లో నేను బి ఎస్ సి డిగ్రీ తీసుకున్నప్పుడు మావూరి మిత్రులతోనూ ఇక్కడి మిత్రులతోనూకలిసి స్టీవ్ మెక్వీన్ డర్టీడజన్ లీలామహల్లో సెకండ్ షో చూడ్డం ఒక మంచి జ్ఞాపకం.ఆ మోటార్ సైకిల్ రైడ్ మనసులో చాలాకాలం వుంది. ఇప్పటికీ సి డీ వేసుకుని చూస్తుంటానప్పుడప్పుడు.

No comments: