Search This Blog
Wednesday, July 25, 2007
m.r college contd
ఇంకా రెండు రోజులుందిగా స్టెంటు వేసుకోడానికి. ఈ లోగా మాకాలేజి మేడ యెక్కుదాం.
ఫిజిక్సు లాబ్ వైపు మెట్లెక్కగానే యెడమ వైపు ఫిజిక్సు గాలరీ వస్తుంది.అక్కడ మళ్ళీ రెండు మెట్లెక్కి వెళ్ళాలి. ముందు పెద్ద వరండా వుంటుంది.వరండాకి యెడమ వైపు కూడా ఒక లాబరేటరీ ఉంది.మేము బీ ఎస్ సీ చదివేటప్పు
డు అక్కడ యేమీ చెయ్యలేదు కాని యూనివర్సిటీ లో పాఠాలు చెప్పడం మొదలెట్టాక ఒక ప్రాజెక్టు కోసం ఆంపియర్ బాలన్స్ అవసరమై అక్కడికి వెళ్ళాను.ఇదే చెపుతుంది ఆ ప్రయోగశాల స్థాయిని. ఫిజిక్సు గేలరీ లో మొదటిసారి అడుగుపెట్టడమే సంభ్రమం కలగచెసింది. అంత పెద్దది. ఆ బ్లాక్ బోర్డు . ఫిజిక్సు పాఠాలే కాకుండా అక్కద చిన్నా పెద్దా సాంస్కృ తిక కార్యక్రమాలూ డిబేట్లూ ఇంకా యేవైనా సమావేశాలూ జరిగేవి. ప్రీ యూనివర్సిటీ లో మా అదృష్టమో దురదృష్టమో కాని తెలుగు పాఠ్యపుస్తకంలో మా ప్రిన్సిపాలు వసంతరావు వెంకటరావు గారు రాసిన జగత్తు జీవము అనే పాఠం వుండేది. ఆయన బహుశా చాలామందికి తెలిసే వుంటుంది ఫిజిక్సు మాస్టారు.కాని ఆయన రాసినది కావడం చాత ఆయనే చెప్పడానికి వచ్చేవారు.వినిజీర్ణించుకోవడం యెంత కష్టంగా వుండేదో ఆ తరవాత చాలా యేళ్ళకి బ్రహ్మానందం సినిమాల్లో ముఖభంగిమలు చూశాక మళ్ళీ గుర్తుకొచ్చింది. వెంకటరావు గారు కాలేజికి యెప్పుడూ పంచా ఖద్దరు జుబ్బా లోనే వచ్చే వారు.ఆయనకి పూర్తిగా వ్యతిరేకంగా కే ఎస్ రామకృష్ణరావు గారు యెప్పుడూ ఫుల్ సూటులోనే కాలేజికి వచ్చే వారు. ఆయన అంత సీరియస్ గా యెందుకు వుండేవారో పెద్దయ్యాక ఈ వాతావరణంలో సూటు వేసుకోవలసిన సందర్భాలు వచ్చినప్పుడు బాగా అర్ధమయ్యింది.ఇంతకీ వెంకటరావు గారి గురించి కదా చెప్పుతున్నాను. ఆయన యెప్పుడేమంటారో యెవరికీ తెలిసేదికాదు. మాటవరసకి ఒకసారి మా మిత్రుడొకడు ఉదయాన్నే కాలేజిలో ఆయనకి యెదురు పడి అలవాటు ప్రకారం చెయ్యెత్తి గుడ్ మార్నింగ్ చెప్పి వెళిపోతుంటే చొక్కా పట్టుకుని ఆపి రెండవ చెయ్యి లేవదా పక్షవాతమా అని గద్దించారు.ఇలాటివి ప్రత్యక్షంగా ఇబ్బందిగానూ పరోక్షంగా వినోదం గానూ వుండేఅవి. తరవాత చాలాయేళ్ళకి వారి అమ్మాయి నా దగ్గర రిసెర్చికి చేరడమూ వివాహానంతరం భర్తతో కలిసి వ్యాపారవేత్తగా యెదగడమూ జరిగాయి. మెట్లకి కుడి పక్కన ఫిజిక్సు లాబ్ వుంటుంది. దానిలోకి మరో సారి వెళదాం ఇప్పుడు ముందుకి వెళ్ళి కుడివైపు తిరిగి మళ్ళీ యెడమవైపు తిరిగితే రెండు క్లాసు రూములు వస్తాయి. అక్కడ తెలుగు ఇంగ్లీషు క్లాసులు అయ్యేవి. ఇది 1960 తరవాత మాట. 59-60 లో నేను మొదట చేరి నప్పుడు భాషా ఆర్ట్సు క్లాసులు రాజు గారి కోట లోపల రౌండు మహల్ అనబడే అంతః పురం లో జరిగేవి. రౌండు మహల్ జ్ఞాపకాలు చాలా రసవత్తరమైనవి. మరోసారి రాస్తాను
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
మీరు స్టెన్ట్ వేయించుకొని సంపుర్ణ ఆరోగ్యవంతులై మరిన్ని ఙ్ఞాపకాలను మాతో పంచుకోగలరు. మీకు చిరాయువునిమ్మని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నా.
Post a Comment