Search This Blog
Friday, July 31, 2009
యు ఎన్ బీ రావు
ముల్లు మరిచిపోయేలా చేసిన అజ్ఞాత వ్యక్తికి కృతజ్ఞతలు.ఆయన ఒకానొక వెబ్ సైట్ లో నా బ్లాగు గురించి రాసిన రివ్యూ చదివి మళ్ళీ రాయాలని కోరిక కలిగింది. యు. నాగభూషణరావు అని ఒక మంచి మిత్రుడు. విజయనగరం లో పి యు సీ లో క్లాసుమేటు. బి ఎస్ సీ లో జియాలజీ తీసుకోడంతో క్లాసు మారింది కాని స్నేహం మారలేదు.కొంచెం సెన్సిటివ్ వ్యక్తి. మన మందం టోలుకీ దానికీ యెలా కుదిరిందో చెప్పలేను కాని కుదరడం మాత్రం నిజం. యూనివర్సిటీకి వచ్చినప్పుడు కూడా ఇద్దరం కలిసే వచ్చాం. వాడు జియాలజీ ఎం ఎస్ సీ లో చేరాడు. చేరిన కొత్తలో ఇద్దరం మార్నింగ్ షో సినిమాకి వెళ్ళాం.ఆనాటి అలంకార్ థియేటర్ లో.సహదేవుడిలాకాదులెండి. మాకు విశాఖ కొట్టిన పిండే.సినిమా అయి బయటకి వచ్చాక చాలా రష్ గా వుంది. ఆ సందడిలో వాడి పర్స్ యెవరో కొట్టేశారు.అయిటే దొంగ చెయ్యి జేబులో వుండగానే వాడు పట్టుకున్నాడు. ఆ రోజుల్లో పోలీస్ కంట్రోల్ రూం అలంకార్ సినీమా పక్కనే మైన్ రోడ్డు మీద వుండేది.ఇప్పుడు సిల్క్ ఎంపోరియం వున్న మేడమీద. ఇద్దరం దొంగని తీసుకుని అక్కడైకి వెళ్ళాం.నేను వద్దంటున్నాను. నీ పర్స్ ఒచ్చేసిందికదా ఆకలేస్తోంది పద అని. వాడేమో ఇలా వదిలేస్తే మరొకళ్ళ పర్స్ కొట్టేస్తాడు. పోలీసులకి అప్పగించాల్సిందే అని తీసుకు పోయాడు. ఆ నాటి దొంగలు కూడా అమాయకులే. ఇప్పుడైతే మేమింత మాట్లాడే లోగా యేంజరిగేదో!తీరా వెళ్ళిన తరవాత ఆ దొంగని పోలీసులు ప్రశ్నించసాగారు.కొంతసేపయాక వాళ్ళ అసలు పధ్ధతులు తీశారు.ఒక్కొక్క దెబ్బా పడుతుంటే తనకే తగిలినట్టు విలవిల లాడసాగేడు నాగభూషణరావు. కాస్సేపటికి పోలీసులకి అడ్డుపడి కొట్ట వద్దని బతిమాలాడు.యెలాగోలా ఆపించి. బయటకి వచ్చి హాస్టల్ గదికి వెళ్ళిన దాకా సైలెంట్ గా ఉండిపోయాడు. వాడు మామూలు మనిషవడానికి రెండు మూడు రోజులు పట్టింది.నాలుగో రోజు మంగళవారం--వాడి మౌనవ్రతం! ఆ నాగభూషణరావే తరువాత ఐ పీ ఎస్ పాసై ఢిలీలో ఉన్నత పోలీసు పదవులు సాధించి రిటైరయ్యాడు.మరి పదవీ కాలంలో ప్రశ్నా విధానాలు మార్చాడో లేదో తెలీదు. మార్చే వుంటాడు. విషాదమేమంటే కొడుకు చిన్న వయసు లోనే మరణించడం. అతని పేరుమీద ట్రస్ట్ పెట్టి తను పుట్టి పెరిగిన చోట్లలో పేద విద్యార్ధులకి సాయంచేస్తున్నాడు.సాయం అందిన వాళ్ళు అర్హులుగా పెరుగుతారని ఆశిద్దాం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment