Search This Blog
Saturday, July 11, 2009
ముల్లు
ఒక యుగం అయినట్టుగా వుంది. రిప్ వాన్ వింకిల్ లాగ నిద్ర పోయానా!నిద్రలో పీడకలలాంటి నిజం ఒకటి జరిగి మనసు కలిచివేసింది.ఇన్నాళ్ళకి మామూలవుతున్నా[నా?] మా ఎదురింటిలో సన్నగా పొడుగ్గా ఒక అమ్మాయి వుండేది. ఆ అమ్మాయి గీతం లో ఇంజనీరింగ్ చదివేది.రోజూ ఉదయం నేను వాకింగ్ చేసి తిరిగి వచ్చే సమయానికి ఆ అమ్మాయి కాలేజికి వెళుతూ కనిపించేది.కాగడామల్లెలా తయారై చిరునవ్వుతో పలకరించేది. నేనూ పలకరించి బాగున్నావా అనో బాగా చదువుతున్నావా అనో అడుగుతూ వుండే వాడిని.తరవాత రోజంతా మరి ఆ అమ్మాయిని కలిసే సందర్భమే వుండేది కాదు.కొన్ని రోజులు నేను ముందుగాలేచి వాకింగ్ కి వెళ్ళడమో లేదా బధ్ధకించడమో జరిగి ఆ అమ్మాయిని కలవలేదు. బధ్ధకానికి బరువెక్కువై డాక్టరు చేత చీవాట్లు తిని మళ్ళీ మామూలు సమయానికి వాకింగ్ మొదలు పెట్టి రోజూ ఆ అమ్మాయిని కలవడం మొదలైంది.ఒకరోజు వాకింగ్ కి వెళ్ళే ముందే పెందరాళే లేచిపోయాను.తోచక నెట్ తెరిచి మ్యూజిక్ సైట్లు బ్రౌజ్ చేస్తూ ఫ్యూషన్ రామదాసు అనే ఆల్బం విన్నాను.బాగా నచ్చింది.సరే వెంటనే నా మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసి జేబులో పెట్టుకుని వాకింగ్ బయలుదేరాను. తిరిగివస్తున్నప్పుడుకూడా ఆ పాటలు వింటూ వస్తుంటే ఆ అమ్మాయి కనబడింది. అన్య మనస్కంగా పాటలు వింటున్న వాడిని తిరిగి పలకరించలేదు. రియలైజ్ చేసి వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఆ అమ్మాయి చాలా దూరం వెళిపోయింది. నిజంగానే చాలా దూరం వెళిపోయిందని మర్నాదు సాయంకాలంగాని తెలియలేదు.ముందు రోజు చేసిన తప్పు దిద్దుకోవాలని మర్నాడు ఆ అమ్మాయిని కలిసే సమయానికి వాకింగ్ వెళ్ళాను.కాని ఆ అమ్మాయి కలవలేదు .ఇంటికొచ్చి ఈనాడు తెరిచి చూస్తే లోకల్ పేపర్లో ఇంజనీరింగ్ విద్యార్ధిని రుషికొండ బీచ్ లో ఆత్మహత్య అని వుంది.అయ్యో అని పెట్టేశాను. సాయంత్రం మా పనిమనిషి మా ఆవిడతో చెప్పింది. మా యెదురింట్లో వుండే అమ్మాయి చచ్చిపోయిందని బాడీని తీసుకు వెళ్ళడానికి అదేదో వూరినించి వాళ్ళ తలిదండ్రులు వచ్చారనీ. యెక్కడో కలుక్కుమంది.ఆ పిల్ల తో వ్యక్తిగతంగా నాకెలాంటి పరిచయమూ లేదు.తన బాధలేమిటో నాకు తెలీదు.కాని ఆ రోజు ఉదయం పట్టించుకోకుండానేను తిరిగి పలకరించకపోవడం తన నెవరూ పట్టించుకోటంలేదు ఆఖరికి ఈయన కూడా అనే నిరాశకి సాయమయిందా.నాకు తెలీకుండానే నేను అంతిమతృణాన్నయ్యానా అనే ముల్లు ఇన్నిరోజులుగా నానూ గుచ్చుతూ యే పనీ సంతోషంగా చెయ్యనివ్వలేదు. ముఖ్యంగా నా విద్యార్ధులు ఒకరిద్దరిని ఇదే పరిస్థితుల్లో నేను ఆపగలిగాను.ఈ అమ్మాయిని కూడా ఆపగలిగి వుండేవాడినా! యేమో.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
అవును, ఇలాంటి ఆలోచనలు ఎప్పటికీ వదలకుండా కలత పెడతాయి. పరిచయస్తురాలు ఒక పెద్దావిడ నన్ను చూడాలనుకుంటున్నదని నాకు తెలిసింది. రేపు, మాపు అని వెళ్లడం కుదరలేదు. ఒకటీ రెండూ కాదు, ఐదారు నెలలు. హఠాత్తుగా ఒకరోజు ఆవిడ మరణ వార్త తెలిసింది. అయ్యో ఒక్కసారి వెళ్లలేకపోయానే అని బాధగా ఉంటుంది. ఆ సంఘటన తర్వాత ఎవరు ఇంటికి పిలిచినా ఆలస్యం చేయకుండా వెళ్లడం అలవాటు చేసుకున్నాను. మీ ఆవేదన అర్థం చేసుకోదగ్గదే.
Post a Comment