Search This Blog

Wednesday, August 29, 2007

sistlaa ramakrishna

నిన్ననే డాక్టరు మళ్ళీ మామూలు జీవితానికి పొమ్మని సెలవిచ్చాడు. ఈ బ్లాగులో తొందరగా మళ్ళీరాయమనీ ఆదెశించాడు. కాలేజి స్థలపురాణం అయ్యాక ఇక జ్ఞాపకాలకి వద్దాం.వీటికి కాలానుసరణ యేమీ కనపడకపోతే పట్టించుకోకండి.ఆ క్షణానికి గుర్తొచ్చినట్టు రాస్తున్నాను. నిజం చెప్పాలంటే చదువులో ఒక్కొక్క దశా దాటుతుంటే మనం క్లాసురూములో నేర్చుకునేది తాగిపోతూ జీవితంగురించి నేర్చుకునేది పెరుగుతూ వస్తుంది. స్కూలు రోజుల్లో పుస్తకాలనించి నేర్చుకునేది యెక్కువగా వుంటే యూనివర్సిటీకి వచ్చేసరికి జీవితం గురించి నేర్చుకునేదే యెక్కువవుతుంది. ఆ దశలో కొత్తవి క్లాసులో నేర్చుకున్నా అవి అతి త్వరగా మరుగున పడ్డం కద్దు. నాకయితే కాలేజికి వచ్చేప్పటికి వయసు తక్కువ అవడం చాత జీవితంగురించి యెక్కువగా యూనివర్సిటీలోనే నేర్చుకున్నాను. అయితే జీవితం కాలేజిలో నేర్పిన పాఠాలు తరువాతతరువాత అర్ధమయి అబ్బురపరచిన సందర్భాలూ లేకపోలేదు. ముందుగా నా జ్ఞాపకాల్లో శిష్ట్లా రామకృష్ణ ని గుర్తుచేసుకోవాలనిపిస్తోంది. అతను నాకు ఒకటిరెండు సంవత్సరాలు సీనియర్.అతను ఆజానుబాహువూ స్ఫురద్రూపీ.కంచుకంఠం అతనికి దేవుడిచ్చిన వరం. ఆచార్య ఎస్వీ జొగారావు గారి తమ్ముడు. అతను స్టేజి మీద విలన్ వేషం వేసి కౄరంగా నవ్వితే గుండెలు జలదరించేవి. అది నిజంగా నవ్వు కాదనీ బొహహహా అంటే అలానే ధ్వనిస్తుందనీ అతనే నాకు నేర్పించాడు. అతనూ నేనూ కలిసి చాలా నాటకాల్లో వేశాం. అంధ్రవిశ్వవిద్యాలయం స్టేజిమీద ఆచార్య ఎస్వీ జోగారావు గారిని చూసినవాళ్ళెవరయినా వుంటే ఈ నవ్వు తెలిసే వుంటుంది. అతనే ముందు గుర్తుకిరావడం యెందుకంటే అతను కొనగోటితో అధ్భుత కళాఖండాలు సృష్టించేవాడు. గోటితో చిత్రాలువేయడం చాల అశ్చర్యంగా వుండేది. మేమందరం కోరికోరి మా బొమ్మలు మాకు కావలసిన బొమ్మలూ వేయించుకునేవాళ్ళం. ఈ విద్య తరవాత రోజుల్లో నఖచిత్రకళగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలేజి వదిలాక అతను నెమ్మదిగా అధ్యాత్మికలోకంలోకి వెళ్ళి చాలా ఆనందాన్ని సొంతం చేసుకున్నాడు. సుందరాకాండని అంతటినీ నఖచిత్రాల్లో లిఖించి దాదాపు ఎమ్మెస్ రామారావుగారంతపేరూ గడించేడు. ఇతనే మా లైబ్రరీ గట్టుమీదకూర్చుని అమ్మాయిలని ఆటలాడించేవాడన్న మాట యెక్కడయినా చెపితే యిప్పుడు కొట్టినా కొడతారు.

Monday, August 20, 2007

kuu chuk chuk

నిన్న మధ్యాహ్నం ఎన్ డీ టీ వీ లో వే టు ఇండియా అన్న కార్యక్రమంలో మన పాత రైళ్ళని చూసినప్పటి నించీ ఆ జ్ఞాపకాలే మనసులో తిరుగుతున్నాయి. కూ అని మహా గంభీరంగా గర్జిస్తూ చుక్ చుక్ చుక్ అంటూ ప్లాటుఫారం పైకి వచ్చి ఆగే రైలూ బొగ్గింజనూ ఆగగానే కలకలం సందడీ చోటు కోసం పరిగెత్తడం పిల్లలం విండో సీటు కోసం పోటీపడడం. రైలు కదిలింతరవాత అదంతా ఒక సూక్ష్మప్రపంచంగా రూపాంతరం చెంది యెక్కడలేని సంగతులూ అందరూ ఒకేసారి మాటాడుకుంటుంటారు. టవర్ అఫ్ బేబెల్ ఇంకెక్కడుంటుంది.ఆ సందడి లోనే పాటలు పాడే వాళ్ళూ, టీ కాఫీ అమ్మేవాళ్ళూ, వేలం పాటపాడేవాళ్ళూ . జీవితంలో ఒకసారయినా నయాగరా జలపాతం దాని శబ్దం వినాలన్న నానుడి మనకి తెలుసు. కాని జీవితంలో భారతదేశంలో బొగ్గురైలు ఒకసారైనా యెక్కని వాళ్ళని చూసి యేమని జాలి పడగలం.యీ నాటి యే సీ బొగీలూ బయటి చప్పుడు వినబడకుండా గాజు కిటికీలూ లోపల పలకరిస్తే యేమైనా ముల్లె పోతుందన్నట్టు మూతి బిగించుకు కూర్చునే "పెద్ద" మనుషులూ భేషజాలూ యెంత సానిటైజ్ అయిపోయాం. ఇక ఫ్లైటయితే చెప్పనే అక్కరలేదు. నేను చేసిన రైలుప్రయాణాల గురించి కూడా అప్పుడప్పుడు రాయాలనే వూహ రూపు దిద్దుకుంతోంది. వీలు చూసుకుని మధ్యమధ్యలో ఇరికిస్తాను. మనమందరం యెన్నో ప్రయాణాలు చేసిన వాళ్ళమే. అనుభవాల్ని పంచుకుంటే బాగుంటుంది.

Thursday, August 16, 2007

sthalapuraaNam chivaripejii

స్థలపురాణం సాస్ బహూ సీరియల్ లాగ స్..ఆ ఆ గుతున్న ఫీలింగ్ వస్తోంది. ఇక యీ రోజు తో ముగించి జ్ఞాపకాలలోకి వెళితే మళ్ళీ ఉత్సాహభరితంగా వుంటుందేమో. రెండు మెట్లూ దిగి వెనక్కి వచ్చాం కదా.యెదురుగానే ఫిజిక్స్ లాబ్ వెనక తలుపు వుంటుంది. యెప్పుడైనా ప్రాక్టికల్సు నించి మధ్యలో కాస్త షికార్లు కొట్టాలంటే వాడేవాళ్ళం.సాధారణంగా ఆ తలుపు మూసే వుండేది-- అటెండర్ తో ప్రత్యేక పలుకుబడి వున్నవాళ్ళకి తప్ప. ఆ వరండాలో ముందుకివెళితే బోటనీ డిపార్ట్మెంట్. జయంతి వెంకన్నపంతులు గారి ప్రభావం ఆవరించుకుని వుండేది, ఆయన లేకపోయినా, లేకపోయినా యెందుకంటే ఆయన యూనివర్సిటీలో పీ ఎచ్ డీ చెయ్యడానికి వెళ్ళేరు. నా నాలుగేళ్ళలో మూడున్నరేళ్ళు ఆయనలేరు. అయినా ఆయన పేరు చెపితేనే భయంభయంగా వుండేవాళ్ళు. మరిచాను. జయంతి వున్నా మాకూ ఆయనకీ యేమీ చుట్టరికం లేదు. కొసమెరుపేమిటంటే నేను వాల్తేరు వెళ్ళిన కొంతకాలానికే ఆయన కూడా యూనివర్సిటీ బోటనీ డిపార్ట్మెంట్లో అధ్యాపకులుగా చేరారు. ఆయనతో నాకిక్కడే పరిచయం యెక్కువ. బోటనీ దాటగానే ప్రిన్సిపాలు ఆఫీసు. అక్కడ కుడి పక్కకి తిరిగి మళ్ళీఈ కుడిపక్కకి తిరిగితే జువాలజీ డిపార్ట్మెంట్. అక్కడ సురేష్ కుమార్ గారు వుండేవారు.నాకా సబ్జెక్టుతో సంబంధం లేకున్నా ఆయన కలుపుగొలు స్వభావం అందరికీ దగ్గర చేసింది. ఆయన హాస్టల్ వార్డెన్ గా కూడా వుండే వారు. నేను హాస్టల్లో వుండే పరిస్థితే లేకపోయినా అబ్దుల్లాదీవానా అన్నట్టు అన్నిట్లోనూ వేలుండేది. అది దాటి ముందుకివస్తే మరి మా స్వగృహం లాంటి ఫిజిక్స్ లాబ్ ముందు గుమ్మం, లెక్చరర్లు కూర్చునే గది , వస్తాయి. జ్ఞాపకాలన్నీ అందులో వున్నాయికదా. అందుకని ప్రస్తుతానికి వదిలేద్దాం. అది దాటి పక్కకి తిరిగితే మళ్ళీ బయల్దేరిన ఫిజిక్స్ గాలరీ కి వస్తాం. కాలేజంటే రూములు కాదోయ్ కాలేజంటే అనుభవాలోయ్ అని ఇక వాటిలోకి దూకుదాం.

Saturday, August 11, 2007

m.r.college contd again

గత కొన్ని రోజులుగా నన్ను చూడడానికి వచ్చేవారితో సమయం గడిచిపోయింది.అందరూ నేను బాగున్నాననే సంతృప్తితో వెళుతున్నారు. మా కాలేజ్ లో ఆరెండు గదుల సంగతీ చెప్పాను కదా. ఇప్పుడు ఆ దారిలోనే ముందుకి వెళితే ఒక రెండు మెట్లు వస్తాయి. అవి దాటితే కెమిస్ట్ర్య్య్ లాబ్. ప్రియూనివర్సిటీ లోనూ బి ఎస్ సీ మొదటి సంవత్సరంలోనూ ఇక్కడే ప్రాక్టికల్సు చేసే వాళ్లం. కింద పైన ఒక వింగంతా లాబే. నిన్ననే నేనూ నా భార్యా అనుకుంటున్నాం. తను నాగ్ పూర్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సు లో చదివింది. ఆ కాలేజిల లాబరేటరీలున్నంత స్థలంలో ఇప్పుడు రెందు కాలేజిలే వుంటున్నాయి.ఇక విద్యార్ధి వ్యక్తిత్వం పెరగాలంటే యెలా పెరుగుతుంది? సరే , ఆ లాబ్ పక్కనే ఒక చిన్న క్లాస్రూము- చిన్నదంటే ఎనభై మందిమి విశాలంగా కూర్చునే వాళ్ళం.దాని పక్కన కెమిస్ట్రీ గాలరీ.ఇది ఫిజిక్సు గాలరీ కన్నా కూడా పెద్దది.మూడు నాలుగు వందలమంది సునాయాసం గా పడతారు. మా క్లాసు ముందు రెండు మూడు వరసలలోనే నిండేది. అకౌస్టిక్స్ దిజైన్ చేశారో లేదో తెలీదు కాని, యెవరు మాట్లాడినా మూడు వందలమందికీ స్పష్టంగా వినిపించేది-ఆఖరికి మాధవరావు గారి పాఠమైనా. ఆయన సంగతి వేరే చెపుతాను. ఇంకా స్థలపురాణం లోనే వున్నాం కదా. మొదటి బెంచిలో నేనూ కవిరాయని రామచంద్రమూర్తీ రామారావూ కే వెంకటరావూ కూర్చుని యెక్కువగా రమణమూర్తి గారి పాఠాలే వినే వాళ్ళం. మాకు దాదాపు కెమిస్ట్రీ అంతా ఆయనే చెప్పారు.వెంకటరావు మొదటి సంవత్సరం తరవాత వాళ్ళ నాన్న గారికి బదిలీ అవడం తో మరో వూరికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన వాడు తిరిగి నేను రిసెర్చి లో చేరిన సమయానికి యూనివర్సిటీకికి వచ్చి తిరిగి కలిశాదు.మధ్యలో ఇంజనీరయ్యాడు. తరవాత ఈ సీ ఈ హెడ్డూ చైర్మనూ అన్నీ చేసి నాకన్నా ఒకేడు ముందు రిటైరై ఇప్పుడు జీ ఎం ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాలుగా ఆ కాలేజ్ ని ఉన్నత స్థానానింకి తీసుకు వెళ్ళాడు. .ఇక్కడితో ఆ భాగం అయిపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ రెండు క్లాసురూములూ దాటి వరండాలోకి వచ్చి ముందుకు సాగుదాం.

Thursday, August 2, 2007

mr college contd

వరసగా రెండు గదులుంటాయని చెప్పానుకదా. అందులో రెండో గది లోనే మాకు క్లాసులు యెక్కువగా అయ్యేవి. ఇంకో దాంట్లో మరో సెక్షను వాళ్ళకి అయ్యేవి. ఎంపీసీ రెందు సెక్షన్లుండేవి.ఈ గదిలో బి ఎస్ సీ మొదటి సంవత్సరంలో జగన్నాధరావు గారు సింబలిన్ నాటకం చెప్పేవారు. అలాగే మదనమోహనరావు గారు ప్రోజూ పారడైస్ లాస్టు రెండో పుస్తకం చెప్పేవారు. గుమ్మం పక్కనే అడ్దం గా వున్న బెంచిలో నేనూ రామారావూ ముద్దుక్రిష్ణా మరో ఇద్దరూ కూర్చునే వాళ్ళం. మా యెదురుగా వున్న బెంచిలో అమ్మాయిలు కూర్చునేవాళ్ళు. ఇద్దరు నరసమ్మలు బాగా గుర్తున్నారు. మిగిలినవాళ్ళు లీలగానే గుర్తున్నారు. దానికీ కారణం వుంది. జగన్నాధరావు గారు మదన మోహనరావు గార్ల క్లాసులు చల్లారిన నీళ్ళ టీ తాగుతున్నట్టే వుండేవి. దానితో ఆ క్లాసుల్లో చుక్కలాటలు, కబుర్లూ ఇత్యాదుల్లోనూ లేదా నాటకాలూ యెలక్షన్లూ. సాయంత్రం గ్రౌండులో చెయ్యబొయే పనుల గురించీ కాలం గడిచేది. సింబలిన్ నాటకంలో సోలెమ్న్ మ్యూజిక్ అని వచ్చినప్పుడల్లా టట్ట డడ్డఢాం అంటూ వాయించడం మామూలయిపోయింది. యీ గోలలోంచి యెప్పుడు తలెత్తి చూసినా సత్యవతి అనబడే బి ఎస్ యే నరసమ్మ నన్నే చూస్తూ వుండేది. నేనటు చూడగానే జి నరసమ్మ వైపు తిరిగి యేదో మాట్లాడుతుండేది. నేను అంతగా పట్టించుకునే వాణ్ణి కాదు కాని ఒక్ సాయంత్రం ఫిజిక్సు స్పెషల్ క్లాసు అయ్యాక జీ నరసమ్మ చీకట్లో పక్కకి వచ్చినట్టే వచ్చి అకస్మాత్తుగా ఒక ముద్దుపెట్టి పారిపోవడంతో గుర్తున్నారు. ఆ తరవాత మళ్ళీ ఆ అమ్మాయి నన్ను తప్పించుకునే తిరిగింది.