Search This Blog
Monday, April 30, 2007
ఈ జ్ఞాపకాలు రాస్తుంటే నిజం గానే నా జీవితం ఇంత వర్ణభరితం గా గడిచిందా అనిపిస్తోంది. ఇంకా జీవితం మొదట్లోనే వున్నాను. మా అమ్మానాన్నా విజయనగరం సామాజిక జీవితం లో ప్రముఖులు గా వుండే వారు. అంచేత నాకూ పలువురు ప్రముఖుల పరిచయ భాగ్యం కలిగింది. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఫిడేలు సాధన చేస్తున్న్నప్పుడు దాదాపు ప్రతి రోజూ అదే గది లో కూర్చుని వుండే అదృష్టం నాకు కలిగింది. అయితే కోహినూరు వజ్రం తో బాదం కాయలు కొట్టుకున్న గొల్లపిల్లవాడిలా నా భాగ్యాన్ని నేను గుర్తించలేదు. అలాగే అంట్యాకుల పైడిరాజు గారికీ వారి శ్రీమతి కీ నా మీద అవ్యాజమైన అభిమానం వుండేది. పైడిరాజు గారు నాకు చిత్రకళ గానీ శిల్పకళ గానీ నేర్పుదామని చాలా ప్రయత్నించారు. వారు ఒకసారి నా తల ఆకారాన్ని మృత్తికా శిల్పం లాగ చేసి ఇచ్చారు. నేను కూడా ఆయన బొమ్మ గీశాను. కానీ ఇవ్వడానికి మనసొప్పలేదు. దాన్ని చూసి ఆయనేమైపోతారో అని భయమేసింది. ఏమయితే అయిందని దాన్ని మా తెలుగు మాస్టారికి ఆయన బొమ్మే అని ఇచ్చేశాను.ఆయన నన్ను బెంచీ ఎక్కించారు. ఆ రకం గా నా చిత్రకళాభ్యాసం ముగిసింది
Sunday, April 15, 2007
wanted feeling
1959 మార్చ్ తో నా స్కూలు జీవితం ముగిసింది. నేను ఎస్ ఎస్ ఎల్ సీ పాసయ్యాను. ఎనిమిది పరీక్షలు నాలుగు రోజుల్లో పూర్తయ్యాయి. పదినించీ పన్నెండున్నరా రెందు నించీ నాలుగున్నరా.ఇంటి నించీ స్కూలు దగ్గరే. అయినా మధ్యాహ్నం మా నాన్న వచ్చి తల తడి గుడ్డ తో తుడిచి ఇంటికి తీసుకు వెళ్ళి మళ్ళీ విడిచి పెట్టే వాడు. ఆయన ప్రముఖ రాజకీయవెత్తా పార్లమెంటు మెంబరూను. మా అమ్మ డాక్టరూ సంఘసేవకురాలూ రాజకీయ వేత్తా. అయినా నన్ను వాళ్ళెప్పుడూ వంటరి వాణ్ణనే భావం కలగనీయలేదు. చెప్పడం మరిచాను. నేను ఒక్కణ్ణె సంతానాన్ని. కావలసిన వాళ్ళమనే భావన పిల్లల్లొ కొండంతబలాన్నీ ఆత్మవిశ్వాసాన్నీ యిస్తుంది.నేనూ నా భార్యా కూడా అదే సూత్రాన్ని పాటించాం.మా పిల్లల ఆత్మ విశ్వాసం ముచ్చట గొలుపుతుంది
Friday, April 6, 2007
head master
ఇతరత్రా వ్యస్తుడనై ఉండడం వల్ల కొంతకాలం ఇక్కడకి రాలేకపోయాను. మా బడి జ్ఞాపకాలను ప్రధానోపాధ్యాయులు రామదాసు గారి గురించి చెప్పి తరువాత ముందుకు సాగుతాను, వారిని చూస్తే అందరికీ దడ. వారు యెప్పుడూ యెవరినీ పల్లెత్తు మాట అన్నట్టు యెవరూ చూడలేదు.వారి గంభీర వ్యక్తిత్వం తోనే అది సాధ్యమనుకుంటాను. నా ఉపాధ్యాయ జీవితం లో ఈ అనుభవాలు చాలా సాయపడ్డాయి. మాకొక తెలుగు మాస్టారు ఉండేవారు. ఆయన ఆకారవికారాల వలన తొండబుర్ర అనే ముద్దుపేరుని సంపాదించారు. ఆ పేరు ఎవరు పెట్టారో యెప్పుదు పెట్టారో ఎవరికీ తెలియదు . ఆయన అసలు పేరు నాకు ఇప్పటికీ తెలియదు. ఒకసారి అర్ధసంవత్సరపరీక్షలు జరుగుతున్నాయి. నేను రాసేదంతా అయిపోయీ నా మిత్రుడొకదు రాయడానికింకేమీ మిగలకా కొంచెం ముందుగానే బయటపడ్డాం. పిల్లచేష్ఠలతో అక్కడేదో ఇసక కుప్ప వుంటే గంతులేస్తున్నాం. ఇంతలో ఏం చేస్తున్నారు అని గంభీర స్వరం వినిపించింది. రామదాసు గారు. బిక్కచచ్చిపోయాం. నెమ్మదిగా నోరు పెగుల్చుకుని పరీక్ష రాయడం అయిపోయింది అన్నాను. మరో ప్రశ్న, యే రూము లో రాశారు. చెప్పాం. యిప్పుడు కష్టం ఒచ్చి పడింది. వాచరు యెవరు ? అని అడిగేరు. తొండబుర్ర గారు అని చెప్పాలి. యెలా?. హెడ్మాస్టరుతో?. చిన్న బుర్రలోని తెలివితేటలన్నీ ఉపయోగించి యేమయితే అదయిందని టీ బీ గారండి అనేశా. తల తాటించి వెళ్ళిపోయరు. అమ్మయ్య అనుకుని స్కూలు బయటకి పరుగో పరుగు. పెద్ద క్లాసు లకి వచ్చి రామదాసు గారు మాకు లెక్కలూ జామెట్రీ చెప్పినప్పుడు తెలిసింది. ఆయన అంత భయంకరుడేమీ కాదని.
Subscribe to:
Posts (Atom)