Search This Blog
Sunday, January 25, 2009
సహదేవోపాఖ్యానం-2
సాయంత్రం ఆరయ్యేప్పటికి అందరమూ మా రూము ముందున్న ఎంక్లోజర్ లో కూచున్నాము. సినిమా ఆరింటికవుతుంది. సహదేవుడు బస్సెక్కడానికి మరో అరగంట తీసుకున్నా యేడింటికల్లా రావాలి. వాడికి మెస్సు తెరవగానే తిండికి తయారవడం[ క్రీం బాచి] అలవాటు కనుక వీలయినంత తొందరగా వచ్చేయాలి. ఈ లో గా అవుట్ గేటు నించి మిరపకాయ బజ్జీలు తెచుకుని తింటూ వాడి అనుభవం వినడం కోసం వేచిచూస్తున్నాం. యేడయినా వాడి జాడ లేదు.మెస్సుకి వెళిపోయుంటాదని మేం కూడా వెళ్ళాం. మా భోజనాలు పూర్తిచేసినా వాడు రాలేదు. వాడి కోసం చూద్దామన్నా సీట్లు ఖాళీ చెయ్యాలి. మెస్సు ముందే కుర్చీలు తెప్పించి వేసుకుని కూర్చున్నాం తొమ్మిదిన్నరయినా వాడు కనబడలేదు.[శనివారం పదిన్నర దాకా మెస్సుంటుంది.] తప్పిపోయాడేమో అని అనుమానం వచ్చింది. అయితే రావలసింది యూనివర్సిటీ కి కనుక యెలాగైనా వచ్చేస్తాడు పరవాలేదని యెవరి రూముకి వాళ్ళు వెళిపోయాం . రాత్రి యెప్పుడొచ్చాడో యేమోకాని పొద్దున్న లేచి చూసేప్పటికి గదిలో ముసుగు కప్పుకుని నిద్రపోతున్నాడు. లేపి యేమయిందని అడిగితే యేమీ మాట్లాడలేదు. సైలెంట్ గా మెస్సుకి వెళ్ళి టిఫిన్ తిని వచ్చేశాడు. తరవాత కొంచెంసేపటికి ఇంతకీ ఆ సరస్వతీ టాకీసు యెక్కడుందిరా అని సగం యేడుస్తున్న గొంతుతో అరిచాడు.అయితే నువ్వు సినిమా చూడనే లేదా అని హాచ్చెర్య పోయాం[నవ్వు దాచుకుంటూ] హాలు కనిపిస్తేకద సినిమా చూడ్డానికి. మీరు తిన్నగ దారి చెప్పకుండా నన్నేడిపిస్తారా అని కోపించాడు. అదేమిట్రా చౌల్ట్రీ దగ్గిర దిగి యెవర్నైనా అడగమన్నాం కదా అంటే ఆ వాడేమో చౌల్ట్రీ యెదురుగా వున్న రోడ్డు మీద వెళ్ళమన్నాడు అలా వెళితే వెళితే రైలు పట్టాలూ బ్రిడ్గీ వచ్చాయి ఇంకా ముందుకెళితే రైలుగేటొచ్చింది అక్కడడిగితేనేమో నన్ను అదోలా చూసి వెళిపోయారు .ఆ చుట్టూ తిరిగి తిరిగి యెంతకీ కనపడక పోతే ఇంతలో రెండో నంబరు బస్సు కనిపించింది. ఇంక అది యెక్కి రూముకి వచ్చాను. అన్నాడు. మాకేమీ అర్ధం కాలేదు.కొంచెం సేపటికి వెలిగింది. వాడు అమాయకుడనుకున్నామే కాని మరీ ఇంత అనుకోలేదు. యేమయిందంటే వాడు వెళ్ళిన రోడ్డు మీద ఒక అయిదు నిమిషాలు నడిచాక కుడిపక్క తిరగాలి. ఇప్పుడయితే అక్కడ డాల్ఫిన్ హోటలూ జ్యోతీ థియేటరూ వున్నాయి. అప్పుడవేమీ లేవు. అక్కడ వాడెవర్నైనా మరోసారి అడిగివుంటే బాగుండేది. అలా కాకుండా తిన్నగా ముక్కుకి సూటిగా వెళ్ళాడు.అయినా అప్పటికి రాజేశ్వరీ మనోరమా వంటి సినిమాహాళ్ళు లేవు-ఇప్పుడూ లేవనుకోండి!. చావుల మదుం బ్రిడ్జి దాటి కూడా వెళ్ళి రామ్మూర్తిపంతులు గేటు దగ్గిరకి వెళిపోయాడు. అక్కడికి వెళ్ళి సరస్వతీ టాకీసని అడిగితే అదోలా చూడరామరి!ఇంతకీ అసలు సందేహం తీరలేదు. మరి అంత సేపేం చేస్తున్నావురా అని అడిగితే మీరంతా ఆట పట్టిస్తారని అయిదింటి నించీ లైబ్రరీ లో కూర్చున్నాను. అని సెలవిచ్చాడు. అందరం తలో దెబ్బా వేసి ప్రాయశ్చిత్తంగా వాణ్ణి వూటీ హోటలుకి తీసుకెళ్ళి స్పెషల్ మీల్సు పెట్టించి బందిపోటు సినిమా చూపించి పాప నాశనం చేసుకున్నాం. తరవాతి రోజుల్లో ఆ అమాయకత్వాన్నంతా వదిలించుకుని టాప్ రాంకరై వో ఎన్ జీ సీ లో ఉన్నతోద్యోగి అయ్యాడు వాడికి నా శుభాకాంక్షలు. చదువుతాడు నాకు తెలుసు.
Friday, January 23, 2009
సహదేవోపాఖ్యానం
నిన్న యెందుకనో సహదేవుడు గుర్తుకొచ్చి మళ్ళీ రాయడానికి పురికొల్పాడు. సహదేవుడు నేను చేరినప్పుడ యూనివర్సిటీలో చేరాడు-జియోఫిజిక్సులో చేరాడు. గ్రామీణ ప్రాంతం నించి వచ్చినవాడవడంచేత కొంచెం అమాయకంగా వుండేవాడు మొదట్లో- తరవాత షరామామూలే కదా.1963 ఆగస్టు నాటి సంగతి.అప్పటి విశాఖకీ నేటి విశాఖకీ రాజసులోచనకీ ముమైత్ ఖాన్ కీ ఉన్నంత తేడా.యూనివర్సిటీకీ టౌన్ కీ మధ్య అగాధమే అనవచ్చు. మరో వూరెళ్ళినట్టే వుండేది.రాత్రి తొమ్మిదయ్యాక తిరిగి రావడమంటే నడకే. ఆటోలు లేవు. రిక్షావాడు లాగలేడు.[రిక్షా వాడితో సి ఆర్ చంద్రన్ కధ కూడా వుంది. సమయానుసారం అదీ వస్తుంది] మొదటాట సినిమాకి వెళితే తిండీ దొరకదు. అందుకని అయితే మేట్నీ కీ లేకపోతే యెలాగా నడవాలి కాబట్టి సెకండ్ షోకీ వెళ్ళేవాళ్ళం.మరి సెకండ్ షో అంటే నిర్మానుష్యంగా వున్న దార్లో కొంచెం ధైర్యం కాని బోలెడు మొండితనం కాని వుండాలి.అలాంటి రోజుల్లో బందిపోటు సినిమా రిలీజయింది. సరస్వతీ టాకీసులో. అన్న గారి సినిమా పైగా అప్పట్లో విశేషాకర్షణగా బోలెడు నేలబారు నృత్యాలున్న సినిమా.మేం హెడ్ వాకింగ్ చేసి మొదటి రోజునే చూసివచ్చి తెగ కబుర్లు చెప్పుకున్నాం. వినివినీ సహదేవుడికి నోరూరింది.చూడాలి చూడాలి. వాడప్పటికా వూరొచ్చి వారమే అయింది. విశాఖలో దారులు అంతబాగా తెలిసిన వాడు కాదు. సినిమాకి తనే టిక్కెట్టుకొని తీసుకెళతానని ఎవర్నైనా కలిసి రమ్మనీ చాలా అడిగాడు. యే బుధ్ధితో ఉన్నారో ఎవరూ పలకలేదు. మర్నాడు శనివారం. మధ్యాహ్నం పన్నెండింటికల్లా బయలు దేరి తనే వెళ్ళాడు. టిక్కెట్టు దొరక్కపోతే యెలా సంపాదించాలో తలో సలహా ఇచ్చారుకాని ఎవరూ కదల్లేదు.కొంచెం విశాఖ గురించి గుర్తు చెయ్యాలి. అప్పట్లో సిటీ కి వెళ్ళాలంటే టర్నర్స్ చౌల్ట్రీ నే ముఖ్య బస్ స్టాపు. ఇప్పట్లా దాన్ని సూపర్ బజార్ అనే వారు కాదు. నిజానికి అప్పుడు సూపర్ బజారింకా లేనేలేదు.ఆ స్థలంలో ఒక టీచర్ ట్రైనింగ్ స్కూలుండేది. సరే జగదంబ సంగతి చెప్పక్కరలేదు.అప్పట్లో యెల్లమ్మ తోట అనబడే ఆ స్టాపు దగ్గర దిగినా అక్కడేమీ ఉండేవి కావు. అందుకని చౌల్ట్రీ దగ్గర దిగమని మరీ మరీ చెప్పి కాగితం మీద రాసి ఇచ్చి మరీ సాగనంపాం. బస్సుకి పన్నెండు పైసలు సినిమాకి రూపాయి పది పైసలు. ఇంటర్వెల్లో సోడా మూడు పైసలు,తిరిగి బస్సు పన్నెండు పైసలు పైసలు, వెరసి రూపాయి ముఫ్ఫయ్యేడు పైసలు యెందుకన్నా మంచిది రూపాయిన్నర తీసుకెళ్ళమని కూడా చెప్పాం . నవ్వకండి సినిమా కెళ్తే మాఖర్చు ఆ రోజుల్లో అంతే-- మేటనీ కైతే! అదే మొదటాట కైతే తిరుగు బస్సుండదు కాబట్టి ఇంకా తక్కువ.టిఫిను కూడా తింటే మరో ఇరవై ఎనిమిది పైసలు. ఆ మాట పక్కన పెడదాం. వాడు వెళ్ళిన తరవాత ఆ మధ్యాహ్నమంతా వాడు యెలా గడుపుతాడో తలుచుకుని తలుచుకుని ఒకటే ఆనందించాం-- బారిష్టరు పార్వతీశం గారిని కూడా తలుచుకున్నాం.మొత్తానికి మంచి మధ్యాహ్నం.ఇంతకీ యేమయింది?
Subscribe to:
Posts (Atom)