Search This Blog

Sunday, August 17, 2008

షడాననరావు

ఈసారి షడాననరావు గురించి చెప్పాలి. మంచి మిత్రుడు.కలుసుకుని ఇన్నాళ్ళయినా యెప్పటికీ ఆప్తుదే.గవర్నమెంటు కాలేజిల్లో ప్రిన్సిపాలుగా చాలాచోట్ల చేసి రిటైరై గుడివాడలో ఇల్లు కట్టుకుని సెటిలయ్యాడు. వాళ్ళమ్మాయి పెళ్ళి చేశాడీమధ్యనే.మేమందరం ఒక రూములో కూర్చుని కబుర్లూ పిచ్చాపాటీ చెప్పుకుంటూ వుండే వాళ్ళం.ఒకరోజు ఆంధ్రప్రభ వారపత్రిక ఒకరు గట్టిగా చదువుతుంటే యెవరకితోచిన కామెంట్లు వాళ్ళు చేస్తూ పోయే వాళ్ళం . ఆ పత్రికలో మాలతీ చందూర్ జవాబులూ ఆంధ్రపత్రికలో ఒకవారం విపరీతం ఇలాటివన్నీ మాకు విందు భోజనంలా వుండేవి. జవాబుల్లో ఒకరోజు యెవరో ఐ యె ఎస్ పరీక్షలగురించి అడిగితే మాలతి గారు తన పేటెంటి శైలిలో ఆ పరీక్షల గురించీ అందులో ఒచ్చే ప్రశ్న ల తరహా గురించీ ప్రవచించేరు. బంతి నేలకి కొడితే మళ్ళీ పైకెందుకొస్తుందనే ప్రశ్న గురించి ప్రస్తావించారు. షడాననరావు వంక చూసి యేం భాయ్ యెందుకొస్తుందంటావ్ అని అడిగాడు ఉప్పిగాడనబడే ఉపేంద్రనాథ్[అతనిగురించీ చెప్తాను. షడాననరావ్ అందర్నీ భాయ్ అని పిలిచే వాడు. మేమూ అతన్నంతే. టౌనుకెళ్ళి టెరికాట్ షర్టు చింపించుకొద్దాం రా భాయ్ అన్నాడంటే అతనికి మనియార్డరు వచ్చినట్టే.] కొంచెం సేపు ఆలోచించి, "యెందుకంటే యేం చెప్తాం భాయ్ , దానికి పుట్టుక తో వచ్చిన బుధ్ధది. " అని తేల్చేశాడు షడాననుడు.ఇంకో సారి మరెవరో చదువుతున్నారు ఒక వుత్తరం." నేను ఈ వుత్తరం తెనాలి నించి రాస్తున్నాను, నా పేరు -----. వయస్సు పధ్ధెనిమిది సంవత్సరాలు. ఇంకా పెళ్ళికాలేదు.--" తరవాత మాట చదివే ముందే ఉపేంద్రనాథ్ స్వగతాన్ని గట్టిగా అన్నాడు."యేమిటో యీవిడకంత తొందర!". ఇలా వుండేవి మా కాలక్షేపాలు.టీవీలూ, డిస్క్ మాన్లూ ,పబ్ లూ లేని రోజులు కదా!

No comments: