Search This Blog

Saturday, October 13, 2007

vijayanagaram

నిన్నటి పోస్టు మిత్రుల్లో కూడా జ్ఞాపకాలని కదిపింది. టాన్ తీటా అన్న పేరు ఇంకా సన్నని సన్నజాజులకి వాడుతూనే వున్నామని ఒక మిత్రులన్నారు. అలాగే ఇంకో అమ్మాయి ఉండేది. కొంచెం మిరపకాయ తత్వం ఉండేది. వాళ్ళ నాన్న గారు అగ్గిపెట్టెల కంపెనీ డీలరు. ఆ పిల్లకి అగ్గిపెట్టె అని పేరుండేది. ఈ పేరు ఇప్పుడుండే అవకాశం లేదు.. ఉదయగిరివారింటిదగ్గిర ఆగాం కదా. కొంచెం ముందుకి వెళితే లలితావిలాస్ స్కూలు వస్తుంది. రోడ్దు మీంచి కొంచెం లోపలికి వెళ్ళాలి లెండి. ఆలోపలికి వెళ్ళేటప్పుడు జీవీరమణమూర్తీ వాళ్ళ ఇల్లు వస్తుంది. వాణ్ణి మరణమూర్తి అంటే గింజుకునేవాడు. ఇది దాటి రోడ్డు మీద ఇంకా ముందుకి వెళితే గురజాడ అప్పారావు గారి ఇల్లు వస్తుంది. మా చిన్నప్పుడు ఆ యింట్లో అప్పారావు గారి పుత్రులు రామదాసు గారూ కుటుంబమూ వుండేవారు.ఒక భాగం స్థానిక గ్రంధాలయానికి అద్దెకి ఇచ్చారు.ఆ యింటి యెదురుగా ఒక సందు వుంది. ఆ సందులో లోపలకి వెళితే నా చిన్న తనం చాలా భాగం గడిచిన ఇల్లు వస్తుంది. ఆ ఇంటి పక్కింట్లోనే ద్వివేదుల నరసింగరావు గారూ, తరువాత కొత్తపల్లి వీరభద్రరావు గారూ వుండే వారు.రోజూ స్కూలుకి అప్పారావు గారి ఇల్లు చూసుకుంటూనే వెళ్ళే వాళ్ళం. అందుకేనేమో సాహిత్యాభిరుచి ఇంతో కొంతో జీర్ణమయింది.సందులోకి వెళ్ళకుండా ముందుకి వెళితే యెడమవైపు నేను మరీ చిన్నవాడిగా ఉన్నప్పుడు వున్న ఇల్లు వస్తుంది. మేము ఆ ఇంటిలో ఉన్నప్పుడు అరుణా అసఫ్ అలీ, సొహన్ సింఘ్ భాక్నా ,భూపెష్ గుప్తా , జ్యొతీ బసూ మొదలయిన అనేకులు మా యింటిలోనే ఆతిధ్యం పొందారు. ఆ ఇంటి లో ఒక రెందు వందల మంది దాకా కూర్చొ గలిగే ఆరుబయలు వసారా వుండేది. ఆ వసారాలో కూర్చుని మా నాన్నా, అమ్మా , బావామరుదులైన తరిమెలనాగిరెడ్డి గారూ నీలం సంజీవరెడ్డి గారూ ఇల్యా యెహ్రెంబెర్గ్ 'థా' నవల గురించి చర్చించుకోడం లీలగా గుర్తుంది.నాగిరెడ్డిగారి ని చూసి అంత గొప్ప వ్యక్తి చార్మినార్ సిగరెట్లు కాల్చడం నాకు వింతగా అనిపించేది. ఇంకా స్మృతులు రేపు .

No comments: