Search This Blog
Sunday, September 23, 2007
varsham
వర్షం వచ్చి వెలిసింది. ఒక వారం రోజులుగా రోజూ వర్షమే. కుండపోత కాకపోయినా జల్లుజల్లుగా.కడుపునిండినవాడికి మనసు చల్లగా. మా వూళ్ళో బీచ్ రోడ్డులో వర్షం పడుతుంటే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం యెంత బాగుంటుందో. సముద్రం మనతో యేదో చెప్పాలని కుతూహలపడుతున్నట్టు యెగిరెగిరిపడుతూ ఉంటుంది.లాలపాడిపడుకోబెట్టిన పిల్లలా ఇసుకంతా తడిసి యెగరకుండా కదలకుండా వుంటుంది. బీచ్ రోడ్డులో ఒక ఓపెన్ ఎయిర్ రెస్టరెంట్ ఉంది. యెండ తగలకుండా వేసిన గొడుగుల కింద కూర్చుని వాన చూస్తూ బజ్జీలు తింటుంటే హాయిగా వుంటుంది.జంక్ ఫుడ్ తిన కూడడని విజ్ఞులు చెప్పినా ఇలాటి ఆనందాలు లేని జీవితాలు కలకాలం యెందుకనిపించదా. కారు ఇప్పుడొచ్చింది కాని కాళ్ళు పుట్టినప్పట్నించీ వున్నాయికదా. చదువుకునేటప్పుడూ పెళ్ళయిన కొత్తలోనూ మా పిల్లలకి ముఫ్ఫయ్యేళ్ళు వొచ్చిందాకా బీచ్ లో ఆనందించిన క్షణాలు యెన్నో యెన్నెన్నో. ఆర్ కే బీచ్ అంటేనే విశాఖపట్నం అప్పుడూ యిప్పుడూ కూడా. ఆకారం పూర్తిగామారిపోయినా కూడా. యిప్పుడు కమ్మర్షియల్ అని నేననను. యే రోజుల అవసరాలు అప్పటివి. మేం చదువుకునే రోజుల్లో ఆ బీచ్ లో క్వాలిటీ రెస్టరెంట్ వుండేది. అక్కడో లావుపాటి ముసలాయన [మాకలా అనిపించేది. కాని యేభయ్ యేళ్ళుండేవేమో] వుండేవాడు. మేమెప్పుడయినా వెళితే చాలా అనుమానంగా చూసేవాడు. వీళ్ళసలు డబ్బులిచ్చే రకాలేనా అల్లరి చేసి పోతారా అనుకునే వాడేమో. అతని తప్పు లేదు. అయిస్ క్రీములూ ఫింగర్ చిప్సూ నాన్ లూ ఆ రోజుల్లో డబ్బున్న వాళ్ళ సరదాలే. మామూలు వాళ్ళంతా వేరుశనక్కాయలూ, ముంతకిందపప్పూ తినే వాళ్ళు. పిచ్చి ముండాకొడుకు తనిచ్చే ఫింగర్ చిప్సు ముంతకిందపప్పు కాలి గోటిక్కూడా సరిపోదని వాడికి తెలీదు-- అని అనుకునే వాళ్ళం. కాని ఇంత వయసు అనుభవం ఒచ్చాక ఒక అనుమానం ఒస్తోంది. తన రూములో కూర్చుని ముంతకింద పప్పు తింటూ మమ్మల్ని చూసి వెర్రివెధవల్లారా అని నవ్వుకునే వాడేమో.
Monday, September 17, 2007
early worm
నాకు చాలా కాలంగా ఒక సందేహం మనసులో అలా వుండిపోయింది.early bird catches the worm అనే నానుడి విని పొద్దున్నే లేచిన worm గురించి యెవరూ మాట్లాడరేమా అని. మరి ఆ worm పక్షికి దొరికి ప్రాణం సమర్పించుకుందికదా. ఆ రకంగా పొద్దున్నే లేవడం ప్రాణాంతకమని చెప్పుకోకూడదా?
సరిగ్గా ఇదే ప్రశ్న నేను ఈ మధ్యనే విపులలో చదివిన ఒక కధలో కూడా వచ్చింది. జవాబు కూడా కొడవటిగంటి కుటుంబరావు గారి లెవెల్లో రాశాడు రచయిత.నాజ్ఞాపకాల గురించి ఒక సారి మరిచిపోయి ఆ కధని యధాతధంగా అందిస్తున్నా చూడండి.
నమ్మి చెడ్డ కుందేలు.
యే పనీ చెయ్యకుండా పొద్దుట్నించీ చెట్టు చిటారు కొమ్మనే కూర్చున్న ఆకతాయి కాకిని చూసి ఆశ్చర్యపడింది ఓ కుందేలు పిల్ల. తనేమో క్షణం తీరిక లేకుండా ఆహారం వెదుక్కుంటూనే ఎప్పుడు ఏం ముంచుకొస్తుందోననిభయపడుతోంది. మరి ఇది ఇంత తీరికగా యే పనీ లేకుండాఎలా కూర్చుంది అనుకుంది.అందుకే 'మిత్రమా చాలా సేపటినించి అక్కడే అలాగే కూర్చున్నావ్. ఏం చేస్తున్నావ్?' అని అడిగింది కుందేలుపిల్ల. ' అడవి అందాలని చూస్తున్నానూ అంది గర్వంగా ఆకతాయి కాకి. ' సరే , నేనూ నీలాగే చూడచ్చా ?' కుందేలుపిల్ల అమాయకంగా ప్రశ్నించింది. 'చూడు. ఎవరొద్దన్నారు?' తిరస్కారంగా అంది కాకి. సరేనని ఆచెట్టు కిందే ఓ బండరాయిని ఆనుకుని అడవి అందాలను ఆస్వాదించడం మొదలెట్టింది కుందేలుపిల్ల. చివరకు అటు ఎవరొస్తున్నారో గమనించనంతగా ప్రకృతి ఆరాధనలో పడిపోయిందది. అంతలోనే అటుగా వచ్చిన ఓ తోడేలు కలల్లో తేలియాడుతున్న కుందేలుపిల్లను గుటుక్కున మింగేసింది.
నీతి: ఎత్తున వున్న వారికి మాత్రమే ఊరికే కూర్చున్నా చెల్లుబాటు అవుతుంది.
ఈ కధని సీ వీ అనే వారు రశారు. సెప్టెంబరు విపులలో ప్రచురితమైంది.
Monday, September 10, 2007
pakir doki
నేను మరిచిపోలేని ఇంకో వ్యక్తి పకీర్ డోకి. అతను ప్రియూనివర్సిటీలో నా క్లాస్ మేటు. శ్రీకాకుళం జిల్లాలో ఒక పల్లె నించి వచ్చి చేరాడు. అప్పట్లో శ్రీకాకుళం నించి చాలామంది మా వూరే వొచ్చి చదువుకునేవారు . శ్రికాకుళంలో గవర్న్మెంటు కాలేజి ఉన్నా కూడా దానికంత సీనుండేది కాదు. ఇప్పట్లా యెక్కడపడితే అక్కడ చదువు కొనడానికి దొరికేదికాదు.వైశ్యుల కుటుంబం నించి వచ్చాడు. కాలేజి హాస్టల్లో వుండేవాడు.ఇంతకు ముందోసారి మా ప్రిన్సిపాలు వసంతరావు వెంకటరావు గారు మాకు తెలుగుపాఠం చెప్పడం గురించి ప్రస్తావించాను.ఆయన పకీర్ డోకీ అని అటెండెన్సు రిజిస్టరులో చూసి ఇతను ముస్లిం అని భ్రమ పడ్డారు. పేరు పిలిచినప్పుడు డోకీ అని స్టైల్ గా పిలిచే వారు. వీడేమో లోపల్లొపలే కుళ్ళిపోయే వాడు. ఆయనతో వున్న మాట చెప్పడానికి ధైర్యం చాలేది కాదు.ఒకసారి నేనే ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఆయన తప్పుని చెప్పకుండా వీడు కోమటి అని ఆయనకి హింట్ ఇచ్చాను.మరయితే ఆ వెధవ పోజెందుకూ సుభ్భరంగా డోకి పకీరని రాసుకోకా అని నిరసన తెలిపి ఆ మర్నాటినించి డోకి పకీరూ అని మిగిలిన పేర్లకంటే గట్టిగా నొక్కి పిలవడం మొదలు పెట్టారు. వాడికి నా మీద చాలాకాలం గుర్రుగా వుండేది. రోజూ సాయంత్రం అయోధ్యా మైదానానికి [ మా కాలేజి ప్లే గ్రౌండు, గతంలో ఒకసారి ప్రస్తావించినట్టే గుర్తు] వెళ్ళి కాలక్షేపం చేసి తరవాత పక్కనే వున్న హాస్టల్లొ వాడి రూముకి వెళ్ళి మరో గంట గడపడం మామూలు. హాస్టల్లో యేవయినా పార్టీలూ అవీ అయినప్పుడు నన్ను తప్పకుండా పిలిచే వాడు. హాస్టల్లో నేలమీదే చాప వేసుకుని పడుకునే వాళ్ళు అందరూ అప్పట్లో. రిమోట్లూ అవీ లేని ఆ రోజుల్లొ నేలమీదనించి లేవకుండా లైటు ఆర్పడానికి వాడో పధ్ధతి కనిపెట్టాడు. స్విచ్ బోర్డు పైనో మేకు కొట్టి దానిపైనించి స్విచ్ ద్వారా ఒక దారం లూపులా కట్టాదు. కర్టెన్ కి కట్టినట్టన్నమాట. దానిని ఒకపక్క లాగితే లైటువెలిగేది.రెండోపక్క లాగితే ఆరేది. పీ యూ సీ తరవాత వాడు బీ కాం లో చేరాడు.నేను తెలుసు కదా. పరిచయం నెమ్మదిగా దూరం అయింది.మళ్ళీ 1998 2000 దగ్గిరలో విశాఖ స్టీలు ప్లాంటు జీ ఎం ఫైనాన్సు గా ఆ పేరు చూసి ఒహొ అనుకున్నాను. ఒకటి రెండు సార్లు పలకరించినా అంతటితోనే ఆగిపోయింది. మా పెద్దబ్బాయి యింటికి ఉక్కునగరం యెన్నిసార్లు వెళ్ళినా కలవడం కుదరలేదు. అతని పిల్లల పెళ్ళిళ్ళూ అవీ వివాదాస్పదం కావడం పత్రికాప్రకటనలూ అవీ చూడడం చివరకి యేవో ఆరోపణల్లో చిక్కుకుని రిటైర్మెంటుకి కొంచెం ముందుగా సస్పెండవడం అవీ విషాదాలు. యే పుట్టలో యేముందో మరి నాకు తెలీదు.
Subscribe to:
Posts (Atom)