Search This Blog

Monday, July 7, 2008

police

తెలుగు సినిమాల్లో పుంఖానుపుంఖంగా వస్తున్న టీనేజి ప్రేమకథలు మా దైనందిన జీవితంపై ఈ మధ్య కొంచెం ప్రభావం చూపించాయి. లేదు లేదు మా వాళ్ళెవరూ యేమీ చెయ్యలేదు.మా డ్రైవరు ఒక అమ్మాయిని ప్రేమించి వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే [వాడికి అమ్మ లేదు] ఇంకో వూరికి పారిపోయి పెళ్ళి చేసుకుని అక్కడే పని చూసుకున్నాడు. అదే సమయంలో మా పనిమనిషి కొడుకు కూడా ఒకమ్మాయిని ప్రేమించి పార్కులూ సినిమాలూ తిరిగితేవాళ్ళింటివాళ్ళు వీళ్ళింటిమీద దండెత్తి పోలీసు కంప్లైంటివ్వాలా పెళ్ళి చేస్తారా అని కూర్చున్నారు[ట].వెరసి నాకూ మా ఆవిడకీ ఆపసోపాలు తప్పలేదు.నాకు పనివాళ్ళు ఫ్రెంచి లీవు తీసుకున్నప్పుడల్లా వాళ్ళమీద కోపం కన్నా వాళ్ళకేమయిందోఅన్న భావనే యెక్కువగా కలుగుతుంది. దీనికి ఒక బాక్ గ్రౌండు వుంది.[ పృష్ఠ ప్రదేశం అని రాద్దామనుకుని సిగ్గుపడి మానేశా].విజయనగరంలో మేం బి ఎస్ సీ చదువుతున్న రోజుల్లో ,అంతకి చాలా ముందునించీ కూడా, మాఇంటి ముందు గాంధీ కేఫ్ అనబడే హోటలు వుండేది[రెస్టరెంటు అనడం ఫేషను కాదు ఆ రోజుల్లో]. బాబీ గారని దాని యజమాని. అందులో నూకరాజనే ఒక పన్నెండు పదమూడేళ్ళకుర్రాడు పని చేస్తుండే వాడు.వాడు అమ్మ వారి పండగకి ఒకసారి పోలీసు వేషం వేశాడు. అప్పణ్ణించీ వాణ్ణి అందరూ పోలీసనే పిలిచేవాళ్ళు. అందరికీ తలలో నాలుక లాగ చిన్నా చితకా పనులు చేసిపెడుతుండే వాదు. మాకందరికీ వాడితో సరదాగా మాట్లాడ్డం చిన్న చిన్న పనులు చేయించుకోడం యెంతగా అలవాటయ్యిందంటే వాడు రాకపోతే రోజు గడిచేది కాదు.నిజానికి పనేమీ లేకపోయినా కూడా. ఒక రోజు వాణ్ణి షాపుకి వెళ్ళి యేదో తెమ్మని పదిరూపాయలిచ్చి [పెద్ద సొమ్మే ఆ రోజుల్లో] పంపించింది మా అమ్మ పొద్దున్న పది గంటలకి.ఒక పది నిమిషాల్లో రావలసిన వాడు మధ్యాహ్నం మూడు గంటలయినా రాలేదు. మా ఇంట్లో మేం పెద్దగా పట్టించుకోకపోయినా నలుగురూ నాలుగు మాటలనడం మొదలెట్టారు. అంత సొమ్మెవరయినా పనివాళ్ళకిస్తారా అంటూ.మూడున్నరకి విషయం తెలిసింది. కిరాణా షాపు కోమటాయనతో యెకసెక్కాలాడుతూ వీడన్న యేదో మాటకి కోమటాయనకి కోపం వచ్చి చేతికందిన వీశె గుండు [కిలోలు లేవప్పుడు] విసిరేశాడు. అది తగలరాని చోట తగిలి పోలీసు అక్కడికక్కడే మరణించాడు. అందుకే, పనివాళ్ళెవరైనా రాకపోతే నాకు వాళ్ళకేమయ్యిందోనన్న కలత బాధిస్తుంటుంది.

1 comment:

రానారె said...

పృష్ఠ మైదానం :-)