Search This Blog

Saturday, June 14, 2008

marinni paatraluu vaati chappullu

ఆ రోజుల్లో మాకు వారానికి నాలుగు రోజులు ఉదయం తొమ్మిదిన్నరకి ప్రాక్టికల్సు ఉండేవి.ఫస్టియరుఒక బాచి సెకండియరు ఒక బాచి ఇద్దరికీ అప్పుడే ఉండేవి. మాతో చేసే సెకండియరుబాచిలో ముఖ్యుడు పిసుపాటి వెంకటేశ్వరరావు అనే పీవీరావు.ఈ నాటికీ ఆప్తమిత్రుడు. రిటయిరయ్యాక కలవడం కొంచెం తగ్గింది కాని కలిసినప్పుడు హృదయరంజకంగా కబుర్లు తప్పవు. రిటైరు కాకముందు రోజూ కొన్ని గంటలుకలిసినవ్వుకోకుండా ఉండే ప్రసక్తేలేదు.అతనితో పాటు ఎం వీ రావు, రామకృష్ణ విఠల్ మరొకరూ [పేరు గుర్తుకి రాటంలేదు-విచిత్రంగా] ఉండే వాళ్ళం. నా బాచిలో టి నాగేశ్వరరావు, హనుమంతశాస్త్రీ మల్లికార్జునాచారీ ఉండే వాళ్ళు. నాగేశ్వరావు సంగతి వదిలేస్తే[ అతనూ ఆప్తమితృడే] మిగిలిన వాళ్ళిద్దరూ విలక్షణ వ్యక్తులే. అందులో మల్లికార్జునాచారి ఎం ఎస్ సీ నేను డిపార్ట్మెంట్ హెడ్డుగా 87 లో చార్జి తీసుకున్నాక గాని పూర్తికాలేదు. అతనిది ఒక విచిత్రమైన కధ. ముందు మాథమాటిక్స్ ఎం ఎస్ సీ లో చేరాదు. అతనూ పిఠాపురం హాస్టల్లోనే వుండేవాడు. అక్కడే పరిచయమయ్యాడు. ఒక రోజు పొద్దున్న టిఫిన్ టయిములో నా పక్కకి వచ్చి కూర్చుని అప్లయిడ్ ఫిజిక్స్ లో ఎలెక్ట్రానిక్స్ చెపుతారుటకదా అన్నాడు. అవునన్నాను. నాకుతెలీనే తెలీదు . తెలిస్తే అందులోనే చేరే వాణ్ణి అన్నాడు. యెవరో అతనికోసం యెదురు చూస్తున్నట్టు. సరే మరి యెవరి కాళ్ళు పట్టుకున్నాడో యేంచెశాడో కాని ఒక వారం తరవాత కనపడి అప్లయిడ్ ఫిజిక్సుకి మారిపోయా అన్నాదు.మంచిదే అనుకున్నాను.అతనిది హోస్పేట . రెండో సంవత్సరంలో ఒక సారి క్లాసు పరీక్ష్లో అతనికి నూటికి పదిమార్కులొచ్చాయి. సీతారామస్వామిగారు నిండుక్లాసులో నిలబెట్టి యే వూరు నించి వచ్చావు అని అడిగేరు. చెప్పాడు. మైలుకి ఒక్క మార్కు వచ్చినా మూడు సబ్జెక్టుల్లో పాసయే వాడివి కదా అన్నారు. ఇలాటిదే కధ మా సీనియర్ భూప్ రాజ్ పాండే ది. అతను నేపాల్ నించి వచ్చేడు. తరువాత నేపాల్లో గూఢచారిశాఖలో ఉన్నత పదవిలో వున్నాడని తెలిసింది.అతని మాట వద్దులెండి .యెందుకన్నా మంచిది.చెప్పొచ్చిన సంగతేమంటే సరైన సమయంలో మల్లిఖార్జునాచారి పరీక్ష పాసవలేదని తెలుస్తూనే వుందికదా.ఫైనలియరయ్యాక కొన్నేళ్ళపాటు ప్రతి సంవత్సరమూ పరీక్షకి వచ్చాడు.ఆ రోజుల్లో పోయిన పేపరొక్కటీ రాసే సౌలభ్యం లేదు. ప్రాక్టికల్స్ తో సహా మొత్తం పరీక్షంతా రాయాల్సిందే. దానితో యేళ్ళు గడుస్తుంటే పని కష్టతరం అవడం మొదలుపెట్టి మూడు నాలుగేళ్ళ తరవాత ఇక కనపడ్డం మానేశాడు.విరక్తి చెందాడేమో అనుకున్నాము. తరవాత తెలిసిందేమంటే పాసైపోయానని చెప్పి యేదో కర్ణాటకలో మారుమూల కాలేజిలో లెక్చరరు ఉద్యోగం సంపాదించాడు. సర్టిఫికెట్ అడిగితే యెక్కడో ఉండిపోయాయి తరవాత చూపిస్తానని నెట్టుకొచ్చాడు. వాళ్ళడిగినప్పుడల్లా ఇతను తెస్తాను పదిహేను రోజుల సెలవివ్వండి అనడమూ దానికి ఇష్టపడక వాళ్ళు సరేలే తరవాత చూద్దాం అనడమూ జరిగేది.ప్రైవేటు కాలేజిలకి తక్కువ జీతంతో యెన్ని క్లాసులైనా తీసుకునే వాడు చాలుకదా! కొన్నాళ్ళకి ఇక సాగని పరిస్థితి వచ్చింది. ఆచారి దానికీ తయారుగానే వున్నాడు. ఆంధ్రా యూనివర్సిటీ ఆఫీసులో పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందనిన్నీ అక్కడ రికార్డులన్నీ కాలిపోయాయనీ నమ్మబలికాడు. తరవాత యెండాకాలంలో ఇక యేదో చెయ్యాలని తెలుసుకుని విశాఖకి వచ్చాడు. దైవ సాక్షాత్కారం అయినట్టు నేను హెడ్డు గా కనిపించేను. కధంతా చెప్పి తనమీద పోలీసు కేసు పెట్టకుండా నేనే రక్షించాలని బతిమాలేడు.నేనేదో మతలబు పెట్టి ముఫ్ఫయ్యేళ్ళ తరవాత అతనికి మళ్ళీ పరీక్ష పెట్టించి పేపర్లు నేనే సెట్ చేయించి తెలిసిన వాళ్ళ తోనే దిద్దించి గట్టున పడేశాను. యెందుకంటే యేభయ్యేళ్ళొచ్చి యింక అతను యెవర్నీ మోసం చెసే స్థితిలో లేడనిపించింది.

Monday, June 9, 2008

paatra parichayam

తెన్నేటి సత్య గౌరీపతిశాస్త్రితో నా పరిచయం అలా మొదలైంది.అలాగే ఎన్ సీ విజయా . అతని గురించి ముందో మారు చెప్పాను.అతను ఫ్లూటు ముగ్ధమనోహరంగా వాయించే వాడు. అతని విలక్ష్ణతలో అదో భాగమే అయినప్పటికీ నన్ను అతని పక్క ముందుగా ఆకర్షించినది అదే. అతనిలా ఫ్లూటు వాయించాలని చాలా ప్రయత్నించి బొమ్మలు గియ్యడం నించి లాగానే మరోసారి అస్త్ర సన్యాసం చేశాను. తరవాతి రోజుల్లో అతనితో పరిచయం అంతలా పెరుగుతుందని నేనూ వూహించలేదు. వీళ్ళు కాకుండా విజయనగరంలో నాతోపాటు చదివి ఇక్కడ తేలిన వాళ్ళలో రామం మాట ముందే చెప్పాను. యు ఎన్ బీ రావుగా ప్రసిధ్ధికెక్కిన ఐ పీ ఎస్ ఆఫీసరు నాగభూషణరావు ముఖ్యుడు. అతను ఢిల్లీలో ముఖ్యపదవులు అలంకరించి రిటైరై మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.అతనూ నేనూ ఆప్తులం శ్రేయోభిలాషులం. నన్ను సివిల్ సర్వీసులో అనురక్తుణ్ణి చెయ్యలని అతనికి చాలా కోరిక వుండేది. ఇంకా చంద్రరాజు, సూర్యనారాయణా మరో కొందరూ వుండేవాళ్ళు. మా అప్లయిడ్ ఫిజిక్స్ క్లాసులో పదహారుమందిమి వుండేవాళ్ళం. అందరందాదాపుగా ఇంకా సంబంధాలు కొనసాగిస్తూనే వున్నాం. ప్రత్యక్షంగా వీలు పడనప్పుడు పరోక్షంగానైనా యోగక్షేమాలు తెలుసుకుంటూనే వుంటాం. నేను కాకుండా ఆరాథ్థి నరసిం హమూర్తి, జివివి సుబ్బారావు , షడాననరావు.చతుర్వేదుల హనుమంతశాస్త్రి, మల్లికార్జునాచారి, వ్యాకరణం వెంకటరావు, తాతినాగేశ్వరరావు, మంథా శ్రీనివాసరావు, ఎస్ వీ రమణమూర్తి, జె ఎస్ ప్రకాశరావు, సి ఉపేంద్రనాథ్, వి నరసిం హమూర్తి, ఎన్ వేణుగోపాలరావు కే మారుతిరామారావు,వి సీతారామారావు అనే పదహారుమందిమీ ఒకే కుటుంబంలాగ వుండే వాళ్ళం. ఒకళ్ళిద్దరు డే స్కాలర్లున్నా వాళ్ళూ హాస్టలుకి వచ్చాక అందరం కలిసి గుంపుగా క్లాసుకి వెళ్ళే వాళ్ళం.ఇది ఆ రోజుల్లో కూడా కొంచెం ప్రత్యేకంగానే వుండేది.