Search This Blog
Saturday, November 24, 2007
still on dipavali
సిసింద్రీ అంటే తారాజువ్వకి చిన్నతమ్ముడు.అన్నిటి కన్న చిన్నది. మతాబాల్లాగే గట్టి కాగితం తో చేసిన గొట్టాల్లో మందు కూరి చెయ్యాలి. గొట్టాలు కిళ్ళీ ఆకారంలో వుండాలి.తారాజువ్వ ఫామిలీలో చాలామంది వుంటారు. సిసింద్రి యెక్కువగా చిన్న పిల్లలాడేది. కొండొకచో కాలేజ్ విద్యార్ధులు అమ్మాయిలని అల్లరి చెయ్యడానికి వాడడం కూడా మామూలే. దీని కన్నా పెద్దది పావు గొట్టం. వుండడానికి సిసింద్రి సైజులోనే వుంటుంది గాని సిలిండ్రికల్ గొట్టం లో వుండి ఒక చీపురుపుల్లకి కట్టి వుంటుంది. ఆ పుల్ల ధర్మమా అని ఇది కొంత దూరం గాల్లోకి వెళ్ళగలదు. దీనికన్నా పెద్దది అరగొట్టం.అన్నిటికన్నా పెద్దది మరి తారాజువ్వ. అది వెలిగించి గాలిలోకి వదలడమే పెద్ద ఆర్టు.అది వేగం అందుకున్న దాకా పట్టుకునే వుండి అందుకోగానే వదలాలి. లేకపోతే నేల మీదే తిరిగి యెవరికో ఒకరికి ఒళ్ళు కాలుస్తుంది.యెక్కువసేపు పట్టుకుంతే మరి చేతిలోనే చీదేస్తుంది.చేతికిచేటు. ఇప్పుడు వచ్చే రాకెట్లలో ఇంత విద్య యెక్కడ. ఇంత వయ్యారం యెక్కడ. సీసాలో పడేసి వెలిగించడమే.తారాజువ్వకి వేలు విడిచిన బాబాయి వెలంకాయ. పచ్చి వెలగ కాయలో గుజ్జంతా తీసేసి అందులో తారాజువ్వ మందు కూరతారు. అత్యంత నిష్ణాతులకు గానీ పట్టుబడనిది ఇది వెలిగించే కళ.అదివెలిగించి గాల్లోకి వదిలితే స్పైరల్ లాగ తిరుగుతూ ఆకాశం లో కను విందు చేస్తుంది.
విచారమంతా ఈ రోజుల్లో ప్రతీదీ డబ్బు పారేస్తే వస్తుందనే భావన. అనుభూతి రాదనే అవగాహన లేకపోవడం. దీనికి తోడు అడుగడుగునా మేమున్నామనే కిల్ జాయ్ లు.
ఒక యిద్దరు ప్రత్యేకవ్యక్తులగురించి ముచ్చటించినా జ్ఞాపకాల్లో తరువాతి ముఖ్య ఘట్టానికి వస్తాను.
ఆంధ్ర విశ్వవిద్యాలయం నా జీవితం.
Thursday, November 15, 2007
deepaavali2
అవును రేపే అన్నాను కానీ యేదో పని పడింది. సురేకారం ఇత్యాదులన్నీ యెండబెట్టాక వాటిని సరైన పాళ్ళలో కలపాలి. మతాబాలు లేదా వెన్నముద్దలకీ చిచ్చుబుడ్లకీ దాదాపు ఒకే పాళ్ళు. చిచ్చుబుడ్లు మందారకుంపీలు కావాలంటే ఇనుప రజను వేస్తాం.మతాబులైతే తయారు చేసి వుంచిన కాగితం గొట్టాలలో మందు కూరాలి.దానికి ముందు గొట్టం అడుగున ముగ్గు కొంచెం వేయాలి.చెయ్యి కాలకుండా అన్నమాట.ఆముదం తక్కువైతే నిలిచికాలదు.యెక్కువైతే పొగకమ్మేస్తుంది.అదే చేతి చలవ. చిచ్చుబుడ్డి అయితే కుమ్మరి దగ్గర కొనుక్కొచ్చిన ఖాళీ కుంపీలలో కూరాలి.దీనికి మాత్రం ముందు కొంచెం సిసింద్రీ మందు వెయ్యలి. లేకపోతే అందుకోదు.అంతా అయ్యాక కింద కొంచెం బంకమన్ను వేసి సీల్ చెయ్యాలి.చిచ్చుబుడ్డీకూరదం లూజయితే పూలు పైకి రావు. టైటయితే పేలుతాయి. ఇదీ చేతి చలవే.ఇవన్నీ వొకెత్తూ సిసింద్రీలు వాటి ఆటలూ వొకెత్తూ.అది మరోసారి.
Tuesday, November 13, 2007
deepavali
దీపావళి వచ్చింది , నాగులచవితికూడా వెళ్ళిపోయింది.జ్ఞాపకాలుమాత్రం కళ్ళముందే తిరుగుతున్నాయి. మా చిన్నతనంలో దీపావళి అంటే నెలరోజుల ముందు నించే సందడి మొదలు. సాధారణంగా మందంగా వుండే కాగితాలకోసం వేట. పోస్టాఫీసు దగ్గర మొదలయ్యేది. మనియార్డరు ఫారాలు వూరికే ఇచ్చేవాళ్ళు. మా అమ్మగారు డాక్టరు కాబట్టి మందుల కంపెనీ కాగితాలు కొల్లలు. మాది కమూనిస్టు కుటుంబం కనుక సొవియట్ భూమి ఇతర కాగితాలూ కూడా సమృధ్ధి గా వుండేవి. మా మిత్రులందరిలోనూ అత్యంత అదృష్టవంతుడిగా వాళ్ళకి కూడా సప్లై చేసేవాడిని. తరవాత మైదా తెచ్చి కుంపటి మీద వుడకపెట్టి పేస్టు తయారు చెయ్యడం.మేం తెచ్చిన కాగితాలని మతాబుల కోసం గొట్టాలు గానూ సిసింద్రీల కోసం శంఖం ఆకారం లోనూ తయారు చెయ్యడం యెండబెట్టడం. అప్పుడు కన్యకా పరమేస్వరి ఆలయం దగ్గర వుండే మందు సామానుల కొట్లకి వెళ్ళడం.సురేకారం, గంధకం,బీడూ బొగ్గు పొడి, ఆముదం లాంటి సామానులు కొని తేవడం. తెల్లని పూలు రావాలంటే అల్యుమినం బీడు యెర్రని పూల కోఅసం ఇనుము బీడు. దేనికి యెంతెంత పాళ్ళు కలపాలో షాపు లోనే గోడ మీద రాసి వుండేది . యింటికి వచ్చాక వీటిని యెండబెట్టడం.
తరవాతేం చేస్తామో రేపు, అవును నిజంగా రేపే రాస్తాను.
Subscribe to:
Posts (Atom)