Search This Blog

Thursday, May 31, 2007

friends

స్కూలు రోజుల్లో యెన్నెన్నో జ్ఞాపకాలు, యెందరెందరో మిత్రులు. కొంతమంది మళ్ళీ కనిపించలేదు. కొంతమంది ఈ నాటికీ రోజూ కలుస్తూనే వున్నారు. కొంతమంది మధ్యలో కనిపించి మళ్ళీ మాయమవుతుంటారు.యెవరికయినా వీళ్ళెవరన్నా తెలిస్తే అలా అలా మళ్ళీకలుస్తారేమో. వద్దిపర్తి వీరరాఘవస్వామి వాళ్ళిల్లు స్కూలు యెదురుగానే వుండేది. మళ్ళీ కనిపించలేదు. జి. గురునాధరావు చాలా దగ్గరగా వుందేవాళ్ళం. విజయనగరంలో వున్నన్నాళ్ళూ కనిపిస్తుందేవాడు. తరవాత మరి కలవలేదు. ఎం. సూరిబాబు. అతనంత మంచి దస్తూరీ నేనిప్పటిదాకా మళ్ళీ చూడలేదు. నాకు తెలుగులోనూ ఇంగ్లీషు లోనూ కాలిగ్రఫీ లాంటి డిజైను అక్షరాలు రాయడం అతనే నేర్పించాడు.చిత్రకళ సంగతి అందరికీ తెలిసిందే అయినా ఇలాంటివి బాగానే వచ్చాయి.ఎం ఎల్. నరసిం హమూర్తి .ఒకళ్ళనొకరం చూసుకోకుండారోజు గడిచేది కాదు. యెలా దూరమయి పొయామో . ఎస్ ఎస్ ఎల్ సీ లో స్కూలు ఫస్టు నాకు కాకుండా ప్రేమస్వరూప్ అనే అమ్మాయికి ఒక్క మార్కు లో వెళ్ళినందుకు నా కన్నా వీళ్ళందరూ చాలా విచారించారు. యింకా చాలామంది వున్నారు. రేపు మరికొందరు .

Tuesday, May 22, 2007

Tuesday, May 15, 2007

a memory, a feeling called pain

ఈ జ్ఞాపకాలు రాస్తుంటే ఒక విషాదకర సంఘటన గుర్తుకి వచ్చి గొంతు లో అడ్డం పడింది. ఆ జ్ఞాపకం పేరు పాండురంగారావు.పాండు ఆ సంవత్సరమే మా క్లాసులో చేరాడు.1958. మా స్కూల్ ఫైనల్ క్లాసులో. వాళ్ళ నాన్న గారికి బదిలీ అయి వాళ్ళు విజయనగరం వచ్చారు. ఆ రోజుల్లో స్కూలులో చేరడం అంటే వెళ్ళి ఫీజు కట్టెయ్యదమే. సీటు కోసం బాధ లేదు. పాండు క్లాసులో అందరికన్నా పెద్దవాడు. 16,17 యేళ్ళు వుంటాయేమో .నేను అందరిలోకీ చిన్నవాణ్ణి. పదమూడేళ్ళు.నేను పరీక్ష రాయడానికి మా నాన్న చీఫ్ సెక్రటరీ దగ్గర అనుమతి తీసుకుని వచ్చాడు. సరే. పాందు కీ నాకూ మధ్య స్నేహమూ అప్యాయతా అవ్యాజం గానే పెరిగాయి.రోజూ సైకిలు మీద యెక్కించుకుని నన్ను షికారు తీసుకెళ్ళే వాడు. నాకు సైకిలు తొక్కడం వచ్చినా కూడా. నేను అతని హోంవర్కూ నోట్సులూ అన్నీ చూసుకునే వాడిని. ఒక రోజు అతను స్కూలుకి రాలేదు. నాకు చాలా ఆతృతగా వున్నా క్లాసులో పాఠాలు గట్టిగా జరుగుతుండదంతో పట్టించుకోలేదు.పైగా బడి ఎగ్గొట్టడం పాండు కి కొత్త కాదు. చిన్న వూరుకదా. సాయంకాలం తెలిసింది. పాండు రైలు పట్టాలపై శవం గా ముక్కముక్కలై వున్నాడని. అంతకు ముందు కూదా నాకు మృత్యువు తో పరిచయం వున్నా [నా మొదటి పోస్టుల్లో చూడవచ్చు] వూహ పూర్తిగా తెలిసిందిప్పుడే. ఆ అనుభూతినే బాధ అంటారని తరవాత తెలిసింది. మరిచిపోవడం మనిషికి దేవుడిచ్చిన వరం అంటారు. మరిచిపోతుంటే మనిషి యెదగడం యెలా?

Friday, May 4, 2007

Wednesday, May 2, 2007

two other arts

చిత్రకళా సంగీతమూ నా మీద దున్నపోతు మీద వాన పడ్డట్టే అయినా సాహిత్యమూ నటనా నాకు బాగానే అంటుకున్నాయి. ఉపాధ్యాయుడి గానూ, పరిశోధకుడి గానూ లబ్ధ ప్రతిష్టుణ్ణే అయి అనేకమంది ఆప్యాయతా అభిమానమూ సంపాదించినా ఆమధ్య యెప్పుడో పాడుతా తీయగా లో యెప్పుదు రాశానో నేనే మరచి పోయిన నా పాట ని ఒక అమ్మాయి పాడి రచన అశొక్ అని పడ్డప్పుడు చాలా ఆనందం కలిగింది.విజయనగరం లో నాకు చిన్నప్పుదు పరిచయమయిన పెద్దల్లొ శ్రీరంగం నారాయణబాబు గారు , పూసపాటి కృష్ణం రాజు గారు ,చాగంటీ సొమయాజులు గారూ, పఠాభి గారూ ఉన్నారు. వీరందరూ కూడా రోణంకి అప్పలస్వామి గారి అభిమానులూ శిష్యులూ అవడం కాకతాళీయం కాదు.వారి శిష్యకోటిలో చివరి తరాల్లోని వాడినయిన నాకు అది గర్వకారణం కూడా. మానేపల్లి సత్యనారాయణ నా సహాధ్యాయి. ఆ రోజుల్లో విజయనగరం లో రాఘవ స్మారక నాటాకోత్సవాలు చాలా ఘనం గా జరిగేవి. చాలా ఉత్సాహం గా చూసే వాళ్ళం. మహా నటులు. గరికపాటి రాజారావు ఆర్. వీ చలం, కర్నాటి లక్ష్మీ నరసయ్య వంతి వారి నటన చూసి ముగ్ధుల మయ్యే వాళ్ళం. ర స న సమాఖ్య అనబదే రసికుల, సరసుల నటకుల సమాఖ్య తో విజయవాడ నించి నాటకాలు వేసిన కుప్పిలి వెంకతేశ్వరరావు అంటే చాలా గ్లామరు వుండేది. ఆకాశరామన్న, విశ్వశాంతి వంటి ఆయన నాటకాలు బలేగా వుండేవి.పెద్దయి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరాక ఆయన దర్శకత్వం లోనూ ఆయన తో కలిసీ నాటకాలు వేస్తాననీ ఆయన నా పెళ్ళి రిసెప్షను కి వచ్చి అర్ధరాత్రి దాకా పిట్టకధలతో అందరినీ అలరిస్తారనీ ఆ రోజుల్లో వూహించలేదు