Search This Blog

Monday, December 31, 2007

krantikumaar

ఆ సుడిగాలి వెంకే కర్రపుల్లలూ ఆకులూ కొట్టుకొచ్చినట్టు కొంతమంది యువకులు కూడా పరిగెత్తుకొచ్చారు . మా అబ్బాయి ఎన్ టీ ఆర్ , కృష్ణ సినిమాలు వంటపట్టించుకుని ఇప్పుడు ఫైటింగవుతుందా అని అడిగేడు.క్రాంతి నా వెనకాలకి వెళ్ళి నిలబడ్డాడు.యెవరు మీరు అని అడిగేడు పెద్ద కర్రపుల్ల. చెప్పాను. యూనివర్సిటీ ఉపాధ్యాయుడిననీ కొంతకాలం ముందు క్రాంతి మిత్రుణ్ణనీ.విజయనగరం కాలేజిలో కలిసి చదివామనీ చెప్పాను. మీరు క్రాంతిని కలిసి యెన్నాళ్ళయింది అని అడిగేడు. అప్పటికి పదిపన్నెండేళ్ళయింది. ఆ మాటే చెప్పాను. మధ్యలో కలవనేలేదా అని సందేహంగానే అడిగేడు. లేదన్నాను. అప్పటికి కొంచెం సమాధానపడ్డాడు.నేనెక్కడుండేదీ చెప్పి క్రాంతిని మర్నాడు మా యింటికి పంపించమన్నాను. నేను యెవరినో తెలిసేక కొంచెంలొంగి వచ్చారు. సరే నన్నారు. క్రాంతికి ఏమీ భయం లేదనీ మర్నాదు నా దగ్గరకి రమ్మనీ చెప్పి ఇంటికి వెళ్ళ మన్నాను. కొంచెం బిక్కుబిక్కుగా చూసేడు. ఉండేదెక్కడని కర్రపుల్లలని అడిగేను . యెదురుగా వున్న ప్రెస్సే ఇల్లన్నారు. నేను కూడా లోపలకి వెళ్ళి క్రాంతిని గదిలోకి వెళ్ళమని వాడు వెళ్ళాక కర్రపుల్లలని అడిగేను. అసలీ డ్రామా అంతా యేమిటని.సార్ మీతో చెప్పడానికేమిటి. క్రాంతిబాబు మా వూళ్ళో ఒక అమ్మాయిని ప్రేమించానంటున్నాడు.ఆ అమ్మాయి కనపడకపోతే చచ్చిపోతానని గోల మొదలు పెట్టి పిచ్చి చేష్టలు చెయ్యడం కూడా మొదలు పెట్టాడు. అందుకని వాళ్ళ బాబాయి గారు ఇక్కడైతే జాగర్తగా వుంటాడని మమ్మల్ని కాపలా పెట్టారు. యీ ప్రెస్సు వాళ్ళదే అని చెప్పారు.గాలితీసిన బుడగలాగా అయ్యేను. నేనేదో డ్రమాటిక్ గా నక్సలిజమూ అండర్ గ్రౌండూ అన్నీ వూహించుకుంటే ఇలా చింతకాయపచ్చడి బయటకొచ్చింది. సరే రేపు నా దగ్గరకి పంపండి నేను చెప్పి బాగుచేస్తాను అని తిరుగు ముఖం పట్టేను. ఇంటికి వెళ్ళాక మా రెండో వాడు మంచి సీనులో తను లేకపోయినందుకు చాలా చింతించేడు.

Thursday, December 20, 2007

krantikumaar

నేను గుర్తుంచుకునే వారిలో ఒక ప్రతేక వ్యక్తి క్రాంతికుమార్. క్రాంతి అని పిల్చే వాళ్ళం. నేను బీ ఎస్ సీ చదువుతున్నప్పుడు బీ ఏ పాలిటిక్సో ఎకనామిక్సో చదివే వాడు. నాటకాలలో స్త్రీ పాత్రలు ధరించడంలో నిష్ణాతుడు[!]. ఈ కాలం వాళ్ళకి వాల్వు రేడియో చూపిస్తే యెంత వింతగా వుంటుందో మగవాళ్ళు స్త్రీ పాత్రలు వెయ్యడం కూడా అంత వింత గానే వుంటుంది.మరి 1960 -63 రోజుల్లో అంతే. ఈ కష్టాలు లేకుండా స్త్రీపాత్రలు లేని నాటకాలు కూడా రాసే వాళ్ళు రచయితలు. విముక్తుడు, విలువలు, ఆడది లాంటి అనేక పేరుగన్న నాటికలుండేవి.క్రాంతి మాటకొస్తే అతను ఆడవేషం కడితే నిజంగా అమ్మాయి లానే వుండే వాడు.ఒక రకంగా నాకు మొదటి ప్రియురాలు అతనే.అతను సర్దార్ గౌతు లచ్చన్న గారికి సోదరుని కొడుకు.ఆయనకే పెంపుడు కొడుకు లాటివాడు.అ కాలంలో అందరు యువకుల్లాగే అతనూ విప్లవ భావాలు మెండుగా వున్నవాడు. మా అందరితోనూ కలిసి విప్లవ సంభాషణలు కబుర్లు బాగానే చెప్పేవాడు.ఆ రోజుల్లో శ్రికాకుళం జిల్లా నించి చాలామంది విజయనగరం మహారాజా కాలేజ్ లో చదవడానికి వచ్చే వాళ్ళు. క్రాంతి తో పాటు బి యే చదివినవారిలో చౌదరి తేజేశ్వరరావు ఒకడు. కొంత కాలం ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్ ఎఫ్ ఐ కి నేను అద్యక్షుణిగానూ తేజెశ్వరరావు కార్యదర్సి గానూ వుండేవాళ్ళం అప్పటికింకా కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలలేదు[ ఇప్పుడు అసంఖ్యాకంగా చీలిందనుకోండి. అది అప్రస్తుతం] చీలిన తరువాత నేను నెమ్మదిగా ఆ కార్యకలాపాలకి దూరం కావడం తేజేశ్వరరావు మరో రకంగా ప్రఖ్యాతుడవడం జరిగింది.క్రాంతి గురించి చెప్పుకుంటున్నాంకదా! అతని మాట అచ్చు అమ్మాయి మాట లాగే వుండేది. ఈ బ్లాగులో చెప్పడం యెందుకంటే క్రాంతి బియే పాసవలేదు. నేను విశాఖ వచ్చాను. తరవాత చాలా జీవితం గడిచాక నా పెళ్ళి అయి పిల్లలు పుట్టి యూనివర్సిటీలో మంచిగానూ చెడుగానూ పీరుపొందాకా 1975లో అను కుంటాను విశాఖలో మెయిన్ రోడ్డుమీంచి లక్ష్మీ టాకీసు బస్ స్టాపుకి మా పెద్ద వాణ్ణి[అయిదేళ్ళు వాడికి] తీసుకుని కబుర్లు చెప్పుకుంటూ నడిచి వస్తుంటే ఒక ఇంటిలోంచి [గోదావరి టింబర్ డిపో కి ముందు ఇల్లు] సుడిగాలిలా పరిగెట్టుకుని వచ్చి అచ్చం కాళరాత్రి నాటకంలో దెయ్యాన్ని చూసి పరిగెత్తుకుని వచ్చి నన్నెలా అల్లుకుపోయాడో అలాగే వచ్చి వాటేసుకున్నాడు. యేమయింది ? బ్లాగులోనైనా కొంచెం ఉద్విగత వుండాలికదా. రేపు చెప్తాను.

Saturday, November 24, 2007

still on dipavali

సిసింద్రీ అంటే తారాజువ్వకి చిన్నతమ్ముడు.అన్నిటి కన్న చిన్నది. మతాబాల్లాగే గట్టి కాగితం తో చేసిన గొట్టాల్లో మందు కూరి చెయ్యాలి. గొట్టాలు కిళ్ళీ ఆకారంలో వుండాలి.తారాజువ్వ ఫామిలీలో చాలామంది వుంటారు. సిసింద్రి యెక్కువగా చిన్న పిల్లలాడేది. కొండొకచో కాలేజ్ విద్యార్ధులు అమ్మాయిలని అల్లరి చెయ్యడానికి వాడడం కూడా మామూలే. దీని కన్నా పెద్దది పావు గొట్టం. వుండడానికి సిసింద్రి సైజులోనే వుంటుంది గాని సిలిండ్రికల్ గొట్టం లో వుండి ఒక చీపురుపుల్లకి కట్టి వుంటుంది. ఆ పుల్ల ధర్మమా అని ఇది కొంత దూరం గాల్లోకి వెళ్ళగలదు. దీనికన్నా పెద్దది అరగొట్టం.అన్నిటికన్నా పెద్దది మరి తారాజువ్వ. అది వెలిగించి గాలిలోకి వదలడమే పెద్ద ఆర్టు.అది వేగం అందుకున్న దాకా పట్టుకునే వుండి అందుకోగానే వదలాలి. లేకపోతే నేల మీదే తిరిగి యెవరికో ఒకరికి ఒళ్ళు కాలుస్తుంది.యెక్కువసేపు పట్టుకుంతే మరి చేతిలోనే చీదేస్తుంది.చేతికిచేటు. ఇప్పుడు వచ్చే రాకెట్లలో ఇంత విద్య యెక్కడ. ఇంత వయ్యారం యెక్కడ. సీసాలో పడేసి వెలిగించడమే.తారాజువ్వకి వేలు విడిచిన బాబాయి వెలంకాయ. పచ్చి వెలగ కాయలో గుజ్జంతా తీసేసి అందులో తారాజువ్వ మందు కూరతారు. అత్యంత నిష్ణాతులకు గానీ పట్టుబడనిది ఇది వెలిగించే కళ.అదివెలిగించి గాల్లోకి వదిలితే స్పైరల్ లాగ తిరుగుతూ ఆకాశం లో కను విందు చేస్తుంది. విచారమంతా ఈ రోజుల్లో ప్రతీదీ డబ్బు పారేస్తే వస్తుందనే భావన. అనుభూతి రాదనే అవగాహన లేకపోవడం. దీనికి తోడు అడుగడుగునా మేమున్నామనే కిల్ జాయ్ లు. ఒక యిద్దరు ప్రత్యేకవ్యక్తులగురించి ముచ్చటించినా జ్ఞాపకాల్లో తరువాతి ముఖ్య ఘట్టానికి వస్తాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం నా జీవితం.

Thursday, November 15, 2007

deepaavali2

అవును రేపే అన్నాను కానీ యేదో పని పడింది. సురేకారం ఇత్యాదులన్నీ యెండబెట్టాక వాటిని సరైన పాళ్ళలో కలపాలి. మతాబాలు లేదా వెన్నముద్దలకీ చిచ్చుబుడ్లకీ దాదాపు ఒకే పాళ్ళు. చిచ్చుబుడ్లు మందారకుంపీలు కావాలంటే ఇనుప రజను వేస్తాం.మతాబులైతే తయారు చేసి వుంచిన కాగితం గొట్టాలలో మందు కూరాలి.దానికి ముందు గొట్టం అడుగున ముగ్గు కొంచెం వేయాలి.చెయ్యి కాలకుండా అన్నమాట.ఆముదం తక్కువైతే నిలిచికాలదు.యెక్కువైతే పొగకమ్మేస్తుంది.అదే చేతి చలవ. చిచ్చుబుడ్డి అయితే కుమ్మరి దగ్గర కొనుక్కొచ్చిన ఖాళీ కుంపీలలో కూరాలి.దీనికి మాత్రం ముందు కొంచెం సిసింద్రీ మందు వెయ్యలి. లేకపోతే అందుకోదు.అంతా అయ్యాక కింద కొంచెం బంకమన్ను వేసి సీల్ చెయ్యాలి.చిచ్చుబుడ్డీకూరదం లూజయితే పూలు పైకి రావు. టైటయితే పేలుతాయి. ఇదీ చేతి చలవే.ఇవన్నీ వొకెత్తూ సిసింద్రీలు వాటి ఆటలూ వొకెత్తూ.అది మరోసారి.

Tuesday, November 13, 2007

deepavali

దీపావళి వచ్చింది , నాగులచవితికూడా వెళ్ళిపోయింది.జ్ఞాపకాలుమాత్రం కళ్ళముందే తిరుగుతున్నాయి. మా చిన్నతనంలో దీపావళి అంటే నెలరోజుల ముందు నించే సందడి మొదలు. సాధారణంగా మందంగా వుండే కాగితాలకోసం వేట. పోస్టాఫీసు దగ్గర మొదలయ్యేది. మనియార్డరు ఫారాలు వూరికే ఇచ్చేవాళ్ళు. మా అమ్మగారు డాక్టరు కాబట్టి మందుల కంపెనీ కాగితాలు కొల్లలు. మాది కమూనిస్టు కుటుంబం కనుక సొవియట్ భూమి ఇతర కాగితాలూ కూడా సమృధ్ధి గా వుండేవి. మా మిత్రులందరిలోనూ అత్యంత అదృష్టవంతుడిగా వాళ్ళకి కూడా సప్లై చేసేవాడిని. తరవాత మైదా తెచ్చి కుంపటి మీద వుడకపెట్టి పేస్టు తయారు చెయ్యడం.మేం తెచ్చిన కాగితాలని మతాబుల కోసం గొట్టాలు గానూ సిసింద్రీల కోసం శంఖం ఆకారం లోనూ తయారు చెయ్యడం యెండబెట్టడం. అప్పుడు కన్యకా పరమేస్వరి ఆలయం దగ్గర వుండే మందు సామానుల కొట్లకి వెళ్ళడం.సురేకారం, గంధకం,బీడూ బొగ్గు పొడి, ఆముదం లాంటి సామానులు కొని తేవడం. తెల్లని పూలు రావాలంటే అల్యుమినం బీడు యెర్రని పూల కోఅసం ఇనుము బీడు. దేనికి యెంతెంత పాళ్ళు కలపాలో షాపు లోనే గోడ మీద రాసి వుండేది . యింటికి వచ్చాక వీటిని యెండబెట్టడం. తరవాతేం చేస్తామో రేపు, అవును నిజంగా రేపే రాస్తాను.

Sunday, October 28, 2007

paiditalli

టెలివిజన్లో వార్తావాహికలు తామరతంపరగా పెరిగిపోవడంతో చూపించడానికి వస్తువులు వెతుక్కుంటున్నారు. యేతావాతా విజయనగరం పైడితల్లమ్మ జాతరని చూడడం జరిగింది. నేను చెపుతూ వచ్చిన మా ఇల్లూ ఆ పక్కన ద్వారం వారుండిన ఇల్లూ అవీ అలానే వున్నట్టు అనిపించింది. కాస్మెటిక్ మార్పులూ కొంచెం కమ్మర్షియల్ మెరుగులూ తప్పితే వూరు పెద్దగా మారినట్టనిపించలేదు--తెలుగు సినిమాలా-- మా ఇంటి యెదురుగా కో ఆపరేటివ్ బాంకు ఉందని చెప్పాను కదా ఆ భవనంలో ఒక పక్క మేడమీద గెస్టు రూములు ఉండేవి. అందులో ఒక దానిలో ఒక ఆఫీసర్ చాలాకాలం ఉండేవారు. చాలా యెర్రగా సన్నగా కొంచెం పొడుగ్గా ఉండేవారు. ఆయన్ని బల్లి గాడని ముద్దుగా పిలుచుకునే వాళ్ళం. మాకెవరికీ పెద్ద పరిచయం లేకపోయినా.ఒకసారి యెందుకో ఆయన రూముకి వెళ్ళడం తటస్థించింది. ఆయన టేబుల్ పైనా అలమారలోనూ ఉన్న పుస్తకాలూ చూసి ముగ్ధుణ్ణయాను. ఆంధ్ర సాహిత్యంలో చెప్పుకోదగ్గ పుస్తకాలన్నీ ఆయన వద్ద వున్నాయి.ఆయన మీద గౌరవం పెరిగింది. బల్లిగాడని పిలవడం మానేశాం. చదువుకున్న బల్లి అనడం మొదలుపెట్టాం.

Friday, October 19, 2007

happy dasara

మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు. విజయనగరంలో మేమొకప్పుడుండిన ఇంటి సంగతి చెప్పుకుంటున్నాం కదా. మొదట్లో ఆ ఇంటిలో మేడపైనే వుండేవాళ్ళం. నాకు బహుశా అయిదేళ్ళుంటాయేమో. ఆ మేడమెట్లపైనించి మొగ్గలేసుకుంటూ కింద పడ్డాను.తలమీద కూడా లాండయ్యాను. అందుకే కొంచెం వెర్రి యెక్కువేమోననిపిస్తుంది అప్పుడప్పుదు. నిజానికి అప్పటికి నేను చూసిన కొన్ని సినిమాల బట్టి చచ్చిపోవడమో పిచ్చెక్కడమో లేక అన్నీ మరిచిపోవడమో అవాలి. యేదీ కాకపోవడం నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమాలని నమ్మడం అప్పట్నించే మానేశాననుకుంటాను. ఆ రోడ్డు మీద మా ఇంటి తరవాత రాజు కిరాణా కొట్టుండేది.దానికెదురుగా లాయరు మొసలికంటి రామారావు గారి యిల్లు ,దాని పక్కన ఒక మిఠాయి షాపు. రాజు కొట్టు తరవాతే చిదంబరం కొట్టు.చిదంబరం కొట్టు తరవాత ఒక ఫాన్సీ షాపు ఉండేది. ఆ షాపు మాత్రం చాలారోజులుంది. మా పిల్లలకి కూడా అవీ ఇవీ కొనిపెట్టే వాళ్ళం. మరి ఇప్పుడుందోలేదో తెలియదు. అదే ఆ రోడ్డు కార్నర్.రోడ్డెదురుగా కోఆపరేటివ్ సెంట్రల్ బాంక్ ఉంటుంది. ఆ జంక్షన్లో ఒకసారి లారీ కింద పడబోతుంటే ఒక రిక్షా వాడు తృటిలో వెనక్కి లాగేడు.ఆ జంక్షన్లో యెడమ వైపు తిరిగితే కోట ముఖద్వారానికి వెళతాం. కుడిసైడు కార్నర్లో ఒక కర్రల అడితీ ఒక కిళ్ళీ కొట్టూ ఉండేవి.వెనక కందకం, కోటగోడా. ఇప్పుడా కందకం అంతా కప్పేసి షాపింగ్ కాంప్లెక్సులు కట్టేరని నాగరాజుగారు మైల్లో చెప్పారు.యెడమపక్క తిరిగితేఫాన్సీ షాపు పక్కన ఒక సైకిల్ షాపు తరవాత నేను కాలేజ్ కి వచ్చాక మేం ఉన్న ఇల్లు దాని పక్కన మా చిన్న తనంలో ద్వారంవెంకతస్వామినాయుడు గారుండిన ఇల్లు వస్తాయి.ఆ జ్ఞాపకాలు మరోసారి