Search This Blog
Saturday, November 24, 2007
still on dipavali
సిసింద్రీ అంటే తారాజువ్వకి చిన్నతమ్ముడు.అన్నిటి కన్న చిన్నది. మతాబాల్లాగే గట్టి కాగితం తో చేసిన గొట్టాల్లో మందు కూరి చెయ్యాలి. గొట్టాలు కిళ్ళీ ఆకారంలో వుండాలి.తారాజువ్వ ఫామిలీలో చాలామంది వుంటారు. సిసింద్రి యెక్కువగా చిన్న పిల్లలాడేది. కొండొకచో కాలేజ్ విద్యార్ధులు అమ్మాయిలని అల్లరి చెయ్యడానికి వాడడం కూడా మామూలే. దీని కన్నా పెద్దది పావు గొట్టం. వుండడానికి సిసింద్రి సైజులోనే వుంటుంది గాని సిలిండ్రికల్ గొట్టం లో వుండి ఒక చీపురుపుల్లకి కట్టి వుంటుంది. ఆ పుల్ల ధర్మమా అని ఇది కొంత దూరం గాల్లోకి వెళ్ళగలదు. దీనికన్నా పెద్దది అరగొట్టం.అన్నిటికన్నా పెద్దది మరి తారాజువ్వ. అది వెలిగించి గాలిలోకి వదలడమే పెద్ద ఆర్టు.అది వేగం అందుకున్న దాకా పట్టుకునే వుండి అందుకోగానే వదలాలి. లేకపోతే నేల మీదే తిరిగి యెవరికో ఒకరికి ఒళ్ళు కాలుస్తుంది.యెక్కువసేపు పట్టుకుంతే మరి చేతిలోనే చీదేస్తుంది.చేతికిచేటు. ఇప్పుడు వచ్చే రాకెట్లలో ఇంత విద్య యెక్కడ. ఇంత వయ్యారం యెక్కడ. సీసాలో పడేసి వెలిగించడమే.తారాజువ్వకి వేలు విడిచిన బాబాయి వెలంకాయ. పచ్చి వెలగ కాయలో గుజ్జంతా తీసేసి అందులో తారాజువ్వ మందు కూరతారు. అత్యంత నిష్ణాతులకు గానీ పట్టుబడనిది ఇది వెలిగించే కళ.అదివెలిగించి గాల్లోకి వదిలితే స్పైరల్ లాగ తిరుగుతూ ఆకాశం లో కను విందు చేస్తుంది.
విచారమంతా ఈ రోజుల్లో ప్రతీదీ డబ్బు పారేస్తే వస్తుందనే భావన. అనుభూతి రాదనే అవగాహన లేకపోవడం. దీనికి తోడు అడుగడుగునా మేమున్నామనే కిల్ జాయ్ లు.
ఒక యిద్దరు ప్రత్యేకవ్యక్తులగురించి ముచ్చటించినా జ్ఞాపకాల్లో తరువాతి ముఖ్య ఘట్టానికి వస్తాను.
ఆంధ్ర విశ్వవిద్యాలయం నా జీవితం.
Thursday, November 15, 2007
deepaavali2
అవును రేపే అన్నాను కానీ యేదో పని పడింది. సురేకారం ఇత్యాదులన్నీ యెండబెట్టాక వాటిని సరైన పాళ్ళలో కలపాలి. మతాబాలు లేదా వెన్నముద్దలకీ చిచ్చుబుడ్లకీ దాదాపు ఒకే పాళ్ళు. చిచ్చుబుడ్లు మందారకుంపీలు కావాలంటే ఇనుప రజను వేస్తాం.మతాబులైతే తయారు చేసి వుంచిన కాగితం గొట్టాలలో మందు కూరాలి.దానికి ముందు గొట్టం అడుగున ముగ్గు కొంచెం వేయాలి.చెయ్యి కాలకుండా అన్నమాట.ఆముదం తక్కువైతే నిలిచికాలదు.యెక్కువైతే పొగకమ్మేస్తుంది.అదే చేతి చలవ. చిచ్చుబుడ్డి అయితే కుమ్మరి దగ్గర కొనుక్కొచ్చిన ఖాళీ కుంపీలలో కూరాలి.దీనికి మాత్రం ముందు కొంచెం సిసింద్రీ మందు వెయ్యలి. లేకపోతే అందుకోదు.అంతా అయ్యాక కింద కొంచెం బంకమన్ను వేసి సీల్ చెయ్యాలి.చిచ్చుబుడ్డీకూరదం లూజయితే పూలు పైకి రావు. టైటయితే పేలుతాయి. ఇదీ చేతి చలవే.ఇవన్నీ వొకెత్తూ సిసింద్రీలు వాటి ఆటలూ వొకెత్తూ.అది మరోసారి.
Tuesday, November 13, 2007
deepavali
దీపావళి వచ్చింది , నాగులచవితికూడా వెళ్ళిపోయింది.జ్ఞాపకాలుమాత్రం కళ్ళముందే తిరుగుతున్నాయి. మా చిన్నతనంలో దీపావళి అంటే నెలరోజుల ముందు నించే సందడి మొదలు. సాధారణంగా మందంగా వుండే కాగితాలకోసం వేట. పోస్టాఫీసు దగ్గర మొదలయ్యేది. మనియార్డరు ఫారాలు వూరికే ఇచ్చేవాళ్ళు. మా అమ్మగారు డాక్టరు కాబట్టి మందుల కంపెనీ కాగితాలు కొల్లలు. మాది కమూనిస్టు కుటుంబం కనుక సొవియట్ భూమి ఇతర కాగితాలూ కూడా సమృధ్ధి గా వుండేవి. మా మిత్రులందరిలోనూ అత్యంత అదృష్టవంతుడిగా వాళ్ళకి కూడా సప్లై చేసేవాడిని. తరవాత మైదా తెచ్చి కుంపటి మీద వుడకపెట్టి పేస్టు తయారు చెయ్యడం.మేం తెచ్చిన కాగితాలని మతాబుల కోసం గొట్టాలు గానూ సిసింద్రీల కోసం శంఖం ఆకారం లోనూ తయారు చెయ్యడం యెండబెట్టడం. అప్పుడు కన్యకా పరమేస్వరి ఆలయం దగ్గర వుండే మందు సామానుల కొట్లకి వెళ్ళడం.సురేకారం, గంధకం,బీడూ బొగ్గు పొడి, ఆముదం లాంటి సామానులు కొని తేవడం. తెల్లని పూలు రావాలంటే అల్యుమినం బీడు యెర్రని పూల కోఅసం ఇనుము బీడు. దేనికి యెంతెంత పాళ్ళు కలపాలో షాపు లోనే గోడ మీద రాసి వుండేది . యింటికి వచ్చాక వీటిని యెండబెట్టడం.
తరవాతేం చేస్తామో రేపు, అవును నిజంగా రేపే రాస్తాను.
Sunday, October 28, 2007
paiditalli
టెలివిజన్లో వార్తావాహికలు తామరతంపరగా పెరిగిపోవడంతో చూపించడానికి వస్తువులు వెతుక్కుంటున్నారు. యేతావాతా విజయనగరం పైడితల్లమ్మ జాతరని చూడడం జరిగింది. నేను చెపుతూ వచ్చిన మా ఇల్లూ ఆ పక్కన ద్వారం వారుండిన ఇల్లూ అవీ అలానే వున్నట్టు అనిపించింది. కాస్మెటిక్ మార్పులూ కొంచెం కమ్మర్షియల్ మెరుగులూ తప్పితే వూరు పెద్దగా మారినట్టనిపించలేదు--తెలుగు సినిమాలా--
మా ఇంటి యెదురుగా కో ఆపరేటివ్ బాంకు ఉందని చెప్పాను కదా ఆ భవనంలో ఒక పక్క మేడమీద గెస్టు రూములు ఉండేవి. అందులో ఒక దానిలో ఒక ఆఫీసర్ చాలాకాలం ఉండేవారు. చాలా యెర్రగా సన్నగా కొంచెం పొడుగ్గా ఉండేవారు. ఆయన్ని బల్లి గాడని ముద్దుగా పిలుచుకునే వాళ్ళం. మాకెవరికీ పెద్ద పరిచయం లేకపోయినా.ఒకసారి యెందుకో ఆయన రూముకి వెళ్ళడం తటస్థించింది. ఆయన టేబుల్ పైనా అలమారలోనూ ఉన్న పుస్తకాలూ చూసి ముగ్ధుణ్ణయాను. ఆంధ్ర సాహిత్యంలో చెప్పుకోదగ్గ పుస్తకాలన్నీ ఆయన వద్ద వున్నాయి.ఆయన మీద గౌరవం పెరిగింది. బల్లిగాడని పిలవడం మానేశాం.
చదువుకున్న బల్లి అనడం మొదలుపెట్టాం.
Friday, October 19, 2007
happy dasara
మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు. విజయనగరంలో మేమొకప్పుడుండిన ఇంటి సంగతి చెప్పుకుంటున్నాం కదా. మొదట్లో ఆ ఇంటిలో మేడపైనే వుండేవాళ్ళం. నాకు బహుశా అయిదేళ్ళుంటాయేమో. ఆ మేడమెట్లపైనించి మొగ్గలేసుకుంటూ కింద పడ్డాను.తలమీద కూడా లాండయ్యాను. అందుకే కొంచెం వెర్రి యెక్కువేమోననిపిస్తుంది అప్పుడప్పుదు. నిజానికి అప్పటికి నేను చూసిన కొన్ని సినిమాల బట్టి చచ్చిపోవడమో పిచ్చెక్కడమో లేక అన్నీ మరిచిపోవడమో అవాలి. యేదీ కాకపోవడం నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమాలని నమ్మడం అప్పట్నించే మానేశాననుకుంటాను. ఆ రోడ్డు మీద మా ఇంటి తరవాత రాజు కిరాణా కొట్టుండేది.దానికెదురుగా లాయరు మొసలికంటి రామారావు గారి యిల్లు ,దాని పక్కన ఒక మిఠాయి షాపు. రాజు కొట్టు తరవాతే చిదంబరం కొట్టు.చిదంబరం కొట్టు తరవాత ఒక ఫాన్సీ షాపు ఉండేది. ఆ షాపు మాత్రం చాలారోజులుంది. మా పిల్లలకి కూడా అవీ ఇవీ కొనిపెట్టే వాళ్ళం. మరి ఇప్పుడుందోలేదో తెలియదు. అదే ఆ రోడ్డు కార్నర్.రోడ్డెదురుగా కోఆపరేటివ్ సెంట్రల్ బాంక్ ఉంటుంది. ఆ జంక్షన్లో ఒకసారి లారీ కింద పడబోతుంటే ఒక రిక్షా వాడు తృటిలో వెనక్కి లాగేడు.ఆ జంక్షన్లో యెడమ వైపు తిరిగితే కోట ముఖద్వారానికి వెళతాం. కుడిసైడు కార్నర్లో
ఒక కర్రల అడితీ ఒక కిళ్ళీ కొట్టూ ఉండేవి.వెనక కందకం, కోటగోడా. ఇప్పుడా కందకం అంతా కప్పేసి షాపింగ్ కాంప్లెక్సులు కట్టేరని నాగరాజుగారు మైల్లో చెప్పారు.యెడమపక్క తిరిగితేఫాన్సీ షాపు పక్కన ఒక సైకిల్ షాపు తరవాత నేను కాలేజ్ కి వచ్చాక మేం ఉన్న ఇల్లు దాని పక్కన మా చిన్న తనంలో ద్వారంవెంకతస్వామినాయుడు గారుండిన ఇల్లు వస్తాయి.ఆ జ్ఞాపకాలు మరోసారి
Tuesday, October 16, 2007
saahityam
నిన్న యేదో సందర్భంలో ఉండమ్మాబొట్టుపెడతా లోని యెందుకీసందెగాలి అన్న పాట వినడం తటస్థించింది. ఆ తరవాతే సన్నగవీచే చల్ల గాలికి అన్న పాట--అప్పుడనిపించింది. ఈనాటి సినిమాల్లో కూడా ఇలాంటి సంగీతమూ కవిత్వమూ ఉంటే మనుషుల్లో ఈ నాడున్న కంగారూ అభద్రతా ఉండవేమోనని.నిజంగా ఆ రోజుల్లో డిగ్రీ క్లాసులో ఇంగ్లీషు తెలుగు సాహిత్యం విభిన్న పాత్రల స్వభావాలూ చిత్రీకరణా అన్నీ చెప్పడం జరిగేది. నిజంగా వాటిని జీవితంలో అనుసరించకపోయినా ఇది మంచిది వీడు మంచివాదు లేకపోతే ఇలా ప్రవర్తిస్తే మంచివాడంటారు అనే విచక్షణ కొంచెమైనా మనసులో నాటుకునేది. చెడ్డపని చేసినప్పుడు అంతరాంతరాలలోనైన కొంత జంకుగా వుండడం అలాంటివి చాటుగా చెయ్యడం ఉండేవి.సాహిత్యం మన జీవితంలో పోషించే పాత్ర అంచనాలకి అందనిది.మరీ భాషాజ్ఞానం అదీ మాట్లాడడానికి సరిపోయేంత అని నిర్దేశించి ఒక తరం ప్రవర్తనా సరళిని ప్రభావితం చేశారనిపిస్తొంది.
Saturday, October 13, 2007
vijayanagaram
నిన్నటి పోస్టు మిత్రుల్లో కూడా జ్ఞాపకాలని కదిపింది. టాన్ తీటా అన్న పేరు ఇంకా సన్నని సన్నజాజులకి వాడుతూనే వున్నామని ఒక మిత్రులన్నారు. అలాగే ఇంకో అమ్మాయి ఉండేది. కొంచెం మిరపకాయ తత్వం ఉండేది. వాళ్ళ నాన్న గారు అగ్గిపెట్టెల కంపెనీ డీలరు. ఆ పిల్లకి అగ్గిపెట్టె అని పేరుండేది. ఈ పేరు ఇప్పుడుండే అవకాశం లేదు..
ఉదయగిరివారింటిదగ్గిర ఆగాం కదా. కొంచెం ముందుకి వెళితే లలితావిలాస్ స్కూలు వస్తుంది. రోడ్దు మీంచి కొంచెం లోపలికి వెళ్ళాలి లెండి. ఆలోపలికి వెళ్ళేటప్పుడు జీవీరమణమూర్తీ వాళ్ళ ఇల్లు వస్తుంది. వాణ్ణి మరణమూర్తి అంటే గింజుకునేవాడు. ఇది దాటి రోడ్డు మీద ఇంకా ముందుకి వెళితే గురజాడ అప్పారావు గారి ఇల్లు వస్తుంది. మా చిన్నప్పుడు ఆ యింట్లో అప్పారావు గారి పుత్రులు రామదాసు గారూ కుటుంబమూ వుండేవారు.ఒక భాగం స్థానిక గ్రంధాలయానికి అద్దెకి ఇచ్చారు.ఆ యింటి యెదురుగా ఒక సందు వుంది. ఆ సందులో లోపలకి వెళితే నా చిన్న తనం చాలా భాగం గడిచిన ఇల్లు వస్తుంది. ఆ ఇంటి పక్కింట్లోనే ద్వివేదుల నరసింగరావు గారూ, తరువాత కొత్తపల్లి వీరభద్రరావు గారూ వుండే వారు.రోజూ స్కూలుకి అప్పారావు గారి ఇల్లు చూసుకుంటూనే వెళ్ళే వాళ్ళం. అందుకేనేమో సాహిత్యాభిరుచి ఇంతో కొంతో జీర్ణమయింది.సందులోకి వెళ్ళకుండా ముందుకి వెళితే యెడమవైపు నేను మరీ చిన్నవాడిగా ఉన్నప్పుడు వున్న ఇల్లు వస్తుంది. మేము ఆ ఇంటిలో ఉన్నప్పుడు అరుణా అసఫ్ అలీ, సొహన్ సింఘ్ భాక్నా ,భూపెష్ గుప్తా , జ్యొతీ బసూ మొదలయిన అనేకులు మా యింటిలోనే ఆతిధ్యం పొందారు. ఆ ఇంటి లో ఒక రెందు వందల మంది దాకా కూర్చొ గలిగే ఆరుబయలు వసారా వుండేది. ఆ వసారాలో కూర్చుని మా నాన్నా, అమ్మా , బావామరుదులైన తరిమెలనాగిరెడ్డి గారూ నీలం సంజీవరెడ్డి గారూ ఇల్యా యెహ్రెంబెర్గ్ 'థా' నవల గురించి చర్చించుకోడం లీలగా గుర్తుంది.నాగిరెడ్డిగారి ని చూసి అంత గొప్ప వ్యక్తి చార్మినార్ సిగరెట్లు కాల్చడం నాకు వింతగా అనిపించేది.
ఇంకా స్మృతులు రేపు .
Subscribe to:
Posts (Atom)