Search This Blog

Sunday, September 23, 2007

varsham

వర్షం వచ్చి వెలిసింది. ఒక వారం రోజులుగా రోజూ వర్షమే. కుండపోత కాకపోయినా జల్లుజల్లుగా.కడుపునిండినవాడికి మనసు చల్లగా. మా వూళ్ళో బీచ్ రోడ్డులో వర్షం పడుతుంటే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం యెంత బాగుంటుందో. సముద్రం మనతో యేదో చెప్పాలని కుతూహలపడుతున్నట్టు యెగిరెగిరిపడుతూ ఉంటుంది.లాలపాడిపడుకోబెట్టిన పిల్లలా ఇసుకంతా తడిసి యెగరకుండా కదలకుండా వుంటుంది. బీచ్ రోడ్డులో ఒక ఓపెన్ ఎయిర్ రెస్టరెంట్ ఉంది. యెండ తగలకుండా వేసిన గొడుగుల కింద కూర్చుని వాన చూస్తూ బజ్జీలు తింటుంటే హాయిగా వుంటుంది.జంక్ ఫుడ్ తిన కూడడని విజ్ఞులు చెప్పినా ఇలాటి ఆనందాలు లేని జీవితాలు కలకాలం యెందుకనిపించదా. కారు ఇప్పుడొచ్చింది కాని కాళ్ళు పుట్టినప్పట్నించీ వున్నాయికదా. చదువుకునేటప్పుడూ పెళ్ళయిన కొత్తలోనూ మా పిల్లలకి ముఫ్ఫయ్యేళ్ళు వొచ్చిందాకా బీచ్ లో ఆనందించిన క్షణాలు యెన్నో యెన్నెన్నో. ఆర్ కే బీచ్ అంటేనే విశాఖపట్నం అప్పుడూ యిప్పుడూ కూడా. ఆకారం పూర్తిగామారిపోయినా కూడా. యిప్పుడు కమ్మర్షియల్ అని నేననను. యే రోజుల అవసరాలు అప్పటివి. మేం చదువుకునే రోజుల్లో ఆ బీచ్ లో క్వాలిటీ రెస్టరెంట్ వుండేది. అక్కడో లావుపాటి ముసలాయన [మాకలా అనిపించేది. కాని యేభయ్ యేళ్ళుండేవేమో] వుండేవాడు. మేమెప్పుడయినా వెళితే చాలా అనుమానంగా చూసేవాడు. వీళ్ళసలు డబ్బులిచ్చే రకాలేనా అల్లరి చేసి పోతారా అనుకునే వాడేమో. అతని తప్పు లేదు. అయిస్ క్రీములూ ఫింగర్ చిప్సూ నాన్ లూ ఆ రోజుల్లో డబ్బున్న వాళ్ళ సరదాలే. మామూలు వాళ్ళంతా వేరుశనక్కాయలూ, ముంతకిందపప్పూ తినే వాళ్ళు. పిచ్చి ముండాకొడుకు తనిచ్చే ఫింగర్ చిప్సు ముంతకిందపప్పు కాలి గోటిక్కూడా సరిపోదని వాడికి తెలీదు-- అని అనుకునే వాళ్ళం. కాని ఇంత వయసు అనుభవం ఒచ్చాక ఒక అనుమానం ఒస్తోంది. తన రూములో కూర్చుని ముంతకింద పప్పు తింటూ మమ్మల్ని చూసి వెర్రివెధవల్లారా అని నవ్వుకునే వాడేమో.

Monday, September 17, 2007

early worm

నాకు చాలా కాలంగా ఒక సందేహం మనసులో అలా వుండిపోయింది.early bird catches the worm అనే నానుడి విని పొద్దున్నే లేచిన worm గురించి యెవరూ మాట్లాడరేమా అని. మరి ఆ worm పక్షికి దొరికి ప్రాణం సమర్పించుకుందికదా. ఆ రకంగా పొద్దున్నే లేవడం ప్రాణాంతకమని చెప్పుకోకూడదా? సరిగ్గా ఇదే ప్రశ్న నేను ఈ మధ్యనే విపులలో చదివిన ఒక కధలో కూడా వచ్చింది. జవాబు కూడా కొడవటిగంటి కుటుంబరావు గారి లెవెల్లో రాశాడు రచయిత.నాజ్ఞాపకాల గురించి ఒక సారి మరిచిపోయి ఆ కధని యధాతధంగా అందిస్తున్నా చూడండి. నమ్మి చెడ్డ కుందేలు. యే పనీ చెయ్యకుండా పొద్దుట్నించీ చెట్టు చిటారు కొమ్మనే కూర్చున్న ఆకతాయి కాకిని చూసి ఆశ్చర్యపడింది ఓ కుందేలు పిల్ల. తనేమో క్షణం తీరిక లేకుండా ఆహారం వెదుక్కుంటూనే ఎప్పుడు ఏం ముంచుకొస్తుందోననిభయపడుతోంది. మరి ఇది ఇంత తీరికగా యే పనీ లేకుండాఎలా కూర్చుంది అనుకుంది.అందుకే 'మిత్రమా చాలా సేపటినించి అక్కడే అలాగే కూర్చున్నావ్. ఏం చేస్తున్నావ్?' అని అడిగింది కుందేలుపిల్ల. ' అడవి అందాలని చూస్తున్నానూ అంది గర్వంగా ఆకతాయి కాకి. ' సరే , నేనూ నీలాగే చూడచ్చా ?' కుందేలుపిల్ల అమాయకంగా ప్రశ్నించింది. 'చూడు. ఎవరొద్దన్నారు?' తిరస్కారంగా అంది కాకి. సరేనని ఆచెట్టు కిందే ఓ బండరాయిని ఆనుకుని అడవి అందాలను ఆస్వాదించడం మొదలెట్టింది కుందేలుపిల్ల. చివరకు అటు ఎవరొస్తున్నారో గమనించనంతగా ప్రకృతి ఆరాధనలో పడిపోయిందది. అంతలోనే అటుగా వచ్చిన ఓ తోడేలు కలల్లో తేలియాడుతున్న కుందేలుపిల్లను గుటుక్కున మింగేసింది. నీతి: ఎత్తున వున్న వారికి మాత్రమే ఊరికే కూర్చున్నా చెల్లుబాటు అవుతుంది. ఈ కధని సీ వీ అనే వారు రశారు. సెప్టెంబరు విపులలో ప్రచురితమైంది.

Monday, September 10, 2007

pakir doki

నేను మరిచిపోలేని ఇంకో వ్యక్తి పకీర్ డోకి. అతను ప్రియూనివర్సిటీలో నా క్లాస్ మేటు. శ్రీకాకుళం జిల్లాలో ఒక పల్లె నించి వచ్చి చేరాడు. అప్పట్లో శ్రీకాకుళం నించి చాలామంది మా వూరే వొచ్చి చదువుకునేవారు . శ్రికాకుళంలో గవర్న్మెంటు కాలేజి ఉన్నా కూడా దానికంత సీనుండేది కాదు. ఇప్పట్లా యెక్కడపడితే అక్కడ చదువు కొనడానికి దొరికేదికాదు.వైశ్యుల కుటుంబం నించి వచ్చాడు. కాలేజి హాస్టల్లో వుండేవాడు.ఇంతకు ముందోసారి మా ప్రిన్సిపాలు వసంతరావు వెంకటరావు గారు మాకు తెలుగుపాఠం చెప్పడం గురించి ప్రస్తావించాను.ఆయన పకీర్ డోకీ అని అటెండెన్సు రిజిస్టరులో చూసి ఇతను ముస్లిం అని భ్రమ పడ్డారు. పేరు పిలిచినప్పుడు డోకీ అని స్టైల్ గా పిలిచే వారు. వీడేమో లోపల్లొపలే కుళ్ళిపోయే వాడు. ఆయనతో వున్న మాట చెప్పడానికి ధైర్యం చాలేది కాదు.ఒకసారి నేనే ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఆయన తప్పుని చెప్పకుండా వీడు కోమటి అని ఆయనకి హింట్ ఇచ్చాను.మరయితే ఆ వెధవ పోజెందుకూ సుభ్భరంగా డోకి పకీరని రాసుకోకా అని నిరసన తెలిపి ఆ మర్నాటినించి డోకి పకీరూ అని మిగిలిన పేర్లకంటే గట్టిగా నొక్కి పిలవడం మొదలు పెట్టారు. వాడికి నా మీద చాలాకాలం గుర్రుగా వుండేది. రోజూ సాయంత్రం అయోధ్యా మైదానానికి [ మా కాలేజి ప్లే గ్రౌండు, గతంలో ఒకసారి ప్రస్తావించినట్టే గుర్తు] వెళ్ళి కాలక్షేపం చేసి తరవాత పక్కనే వున్న హాస్టల్లొ వాడి రూముకి వెళ్ళి మరో గంట గడపడం మామూలు. హాస్టల్లో యేవయినా పార్టీలూ అవీ అయినప్పుడు నన్ను తప్పకుండా పిలిచే వాడు. హాస్టల్లో నేలమీదే చాప వేసుకుని పడుకునే వాళ్ళు అందరూ అప్పట్లో. రిమోట్లూ అవీ లేని ఆ రోజుల్లొ నేలమీదనించి లేవకుండా లైటు ఆర్పడానికి వాడో పధ్ధతి కనిపెట్టాడు. స్విచ్ బోర్డు పైనో మేకు కొట్టి దానిపైనించి స్విచ్ ద్వారా ఒక దారం లూపులా కట్టాదు. కర్టెన్ కి కట్టినట్టన్నమాట. దానిని ఒకపక్క లాగితే లైటువెలిగేది.రెండోపక్క లాగితే ఆరేది. పీ యూ సీ తరవాత వాడు బీ కాం లో చేరాడు.నేను తెలుసు కదా. పరిచయం నెమ్మదిగా దూరం అయింది.మళ్ళీ 1998 2000 దగ్గిరలో విశాఖ స్టీలు ప్లాంటు జీ ఎం ఫైనాన్సు గా ఆ పేరు చూసి ఒహొ అనుకున్నాను. ఒకటి రెండు సార్లు పలకరించినా అంతటితోనే ఆగిపోయింది. మా పెద్దబ్బాయి యింటికి ఉక్కునగరం యెన్నిసార్లు వెళ్ళినా కలవడం కుదరలేదు. అతని పిల్లల పెళ్ళిళ్ళూ అవీ వివాదాస్పదం కావడం పత్రికాప్రకటనలూ అవీ చూడడం చివరకి యేవో ఆరోపణల్లో చిక్కుకుని రిటైర్మెంటుకి కొంచెం ముందుగా సస్పెండవడం అవీ విషాదాలు. యే పుట్టలో యేముందో మరి నాకు తెలీదు.

Wednesday, August 29, 2007

sistlaa ramakrishna

నిన్ననే డాక్టరు మళ్ళీ మామూలు జీవితానికి పొమ్మని సెలవిచ్చాడు. ఈ బ్లాగులో తొందరగా మళ్ళీరాయమనీ ఆదెశించాడు. కాలేజి స్థలపురాణం అయ్యాక ఇక జ్ఞాపకాలకి వద్దాం.వీటికి కాలానుసరణ యేమీ కనపడకపోతే పట్టించుకోకండి.ఆ క్షణానికి గుర్తొచ్చినట్టు రాస్తున్నాను. నిజం చెప్పాలంటే చదువులో ఒక్కొక్క దశా దాటుతుంటే మనం క్లాసురూములో నేర్చుకునేది తాగిపోతూ జీవితంగురించి నేర్చుకునేది పెరుగుతూ వస్తుంది. స్కూలు రోజుల్లో పుస్తకాలనించి నేర్చుకునేది యెక్కువగా వుంటే యూనివర్సిటీకి వచ్చేసరికి జీవితం గురించి నేర్చుకునేదే యెక్కువవుతుంది. ఆ దశలో కొత్తవి క్లాసులో నేర్చుకున్నా అవి అతి త్వరగా మరుగున పడ్డం కద్దు. నాకయితే కాలేజికి వచ్చేప్పటికి వయసు తక్కువ అవడం చాత జీవితంగురించి యెక్కువగా యూనివర్సిటీలోనే నేర్చుకున్నాను. అయితే జీవితం కాలేజిలో నేర్పిన పాఠాలు తరువాతతరువాత అర్ధమయి అబ్బురపరచిన సందర్భాలూ లేకపోలేదు. ముందుగా నా జ్ఞాపకాల్లో శిష్ట్లా రామకృష్ణ ని గుర్తుచేసుకోవాలనిపిస్తోంది. అతను నాకు ఒకటిరెండు సంవత్సరాలు సీనియర్.అతను ఆజానుబాహువూ స్ఫురద్రూపీ.కంచుకంఠం అతనికి దేవుడిచ్చిన వరం. ఆచార్య ఎస్వీ జొగారావు గారి తమ్ముడు. అతను స్టేజి మీద విలన్ వేషం వేసి కౄరంగా నవ్వితే గుండెలు జలదరించేవి. అది నిజంగా నవ్వు కాదనీ బొహహహా అంటే అలానే ధ్వనిస్తుందనీ అతనే నాకు నేర్పించాడు. అతనూ నేనూ కలిసి చాలా నాటకాల్లో వేశాం. అంధ్రవిశ్వవిద్యాలయం స్టేజిమీద ఆచార్య ఎస్వీ జోగారావు గారిని చూసినవాళ్ళెవరయినా వుంటే ఈ నవ్వు తెలిసే వుంటుంది. అతనే ముందు గుర్తుకిరావడం యెందుకంటే అతను కొనగోటితో అధ్భుత కళాఖండాలు సృష్టించేవాడు. గోటితో చిత్రాలువేయడం చాల అశ్చర్యంగా వుండేది. మేమందరం కోరికోరి మా బొమ్మలు మాకు కావలసిన బొమ్మలూ వేయించుకునేవాళ్ళం. ఈ విద్య తరవాత రోజుల్లో నఖచిత్రకళగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలేజి వదిలాక అతను నెమ్మదిగా అధ్యాత్మికలోకంలోకి వెళ్ళి చాలా ఆనందాన్ని సొంతం చేసుకున్నాడు. సుందరాకాండని అంతటినీ నఖచిత్రాల్లో లిఖించి దాదాపు ఎమ్మెస్ రామారావుగారంతపేరూ గడించేడు. ఇతనే మా లైబ్రరీ గట్టుమీదకూర్చుని అమ్మాయిలని ఆటలాడించేవాడన్న మాట యెక్కడయినా చెపితే యిప్పుడు కొట్టినా కొడతారు.

Monday, August 20, 2007

kuu chuk chuk

నిన్న మధ్యాహ్నం ఎన్ డీ టీ వీ లో వే టు ఇండియా అన్న కార్యక్రమంలో మన పాత రైళ్ళని చూసినప్పటి నించీ ఆ జ్ఞాపకాలే మనసులో తిరుగుతున్నాయి. కూ అని మహా గంభీరంగా గర్జిస్తూ చుక్ చుక్ చుక్ అంటూ ప్లాటుఫారం పైకి వచ్చి ఆగే రైలూ బొగ్గింజనూ ఆగగానే కలకలం సందడీ చోటు కోసం పరిగెత్తడం పిల్లలం విండో సీటు కోసం పోటీపడడం. రైలు కదిలింతరవాత అదంతా ఒక సూక్ష్మప్రపంచంగా రూపాంతరం చెంది యెక్కడలేని సంగతులూ అందరూ ఒకేసారి మాటాడుకుంటుంటారు. టవర్ అఫ్ బేబెల్ ఇంకెక్కడుంటుంది.ఆ సందడి లోనే పాటలు పాడే వాళ్ళూ, టీ కాఫీ అమ్మేవాళ్ళూ, వేలం పాటపాడేవాళ్ళూ . జీవితంలో ఒకసారయినా నయాగరా జలపాతం దాని శబ్దం వినాలన్న నానుడి మనకి తెలుసు. కాని జీవితంలో భారతదేశంలో బొగ్గురైలు ఒకసారైనా యెక్కని వాళ్ళని చూసి యేమని జాలి పడగలం.యీ నాటి యే సీ బొగీలూ బయటి చప్పుడు వినబడకుండా గాజు కిటికీలూ లోపల పలకరిస్తే యేమైనా ముల్లె పోతుందన్నట్టు మూతి బిగించుకు కూర్చునే "పెద్ద" మనుషులూ భేషజాలూ యెంత సానిటైజ్ అయిపోయాం. ఇక ఫ్లైటయితే చెప్పనే అక్కరలేదు. నేను చేసిన రైలుప్రయాణాల గురించి కూడా అప్పుడప్పుడు రాయాలనే వూహ రూపు దిద్దుకుంతోంది. వీలు చూసుకుని మధ్యమధ్యలో ఇరికిస్తాను. మనమందరం యెన్నో ప్రయాణాలు చేసిన వాళ్ళమే. అనుభవాల్ని పంచుకుంటే బాగుంటుంది.

Thursday, August 16, 2007

sthalapuraaNam chivaripejii

స్థలపురాణం సాస్ బహూ సీరియల్ లాగ స్..ఆ ఆ గుతున్న ఫీలింగ్ వస్తోంది. ఇక యీ రోజు తో ముగించి జ్ఞాపకాలలోకి వెళితే మళ్ళీ ఉత్సాహభరితంగా వుంటుందేమో. రెండు మెట్లూ దిగి వెనక్కి వచ్చాం కదా.యెదురుగానే ఫిజిక్స్ లాబ్ వెనక తలుపు వుంటుంది. యెప్పుడైనా ప్రాక్టికల్సు నించి మధ్యలో కాస్త షికార్లు కొట్టాలంటే వాడేవాళ్ళం.సాధారణంగా ఆ తలుపు మూసే వుండేది-- అటెండర్ తో ప్రత్యేక పలుకుబడి వున్నవాళ్ళకి తప్ప. ఆ వరండాలో ముందుకివెళితే బోటనీ డిపార్ట్మెంట్. జయంతి వెంకన్నపంతులు గారి ప్రభావం ఆవరించుకుని వుండేది, ఆయన లేకపోయినా, లేకపోయినా యెందుకంటే ఆయన యూనివర్సిటీలో పీ ఎచ్ డీ చెయ్యడానికి వెళ్ళేరు. నా నాలుగేళ్ళలో మూడున్నరేళ్ళు ఆయనలేరు. అయినా ఆయన పేరు చెపితేనే భయంభయంగా వుండేవాళ్ళు. మరిచాను. జయంతి వున్నా మాకూ ఆయనకీ యేమీ చుట్టరికం లేదు. కొసమెరుపేమిటంటే నేను వాల్తేరు వెళ్ళిన కొంతకాలానికే ఆయన కూడా యూనివర్సిటీ బోటనీ డిపార్ట్మెంట్లో అధ్యాపకులుగా చేరారు. ఆయనతో నాకిక్కడే పరిచయం యెక్కువ. బోటనీ దాటగానే ప్రిన్సిపాలు ఆఫీసు. అక్కడ కుడి పక్కకి తిరిగి మళ్ళీఈ కుడిపక్కకి తిరిగితే జువాలజీ డిపార్ట్మెంట్. అక్కడ సురేష్ కుమార్ గారు వుండేవారు.నాకా సబ్జెక్టుతో సంబంధం లేకున్నా ఆయన కలుపుగొలు స్వభావం అందరికీ దగ్గర చేసింది. ఆయన హాస్టల్ వార్డెన్ గా కూడా వుండే వారు. నేను హాస్టల్లో వుండే పరిస్థితే లేకపోయినా అబ్దుల్లాదీవానా అన్నట్టు అన్నిట్లోనూ వేలుండేది. అది దాటి ముందుకివస్తే మరి మా స్వగృహం లాంటి ఫిజిక్స్ లాబ్ ముందు గుమ్మం, లెక్చరర్లు కూర్చునే గది , వస్తాయి. జ్ఞాపకాలన్నీ అందులో వున్నాయికదా. అందుకని ప్రస్తుతానికి వదిలేద్దాం. అది దాటి పక్కకి తిరిగితే మళ్ళీ బయల్దేరిన ఫిజిక్స్ గాలరీ కి వస్తాం. కాలేజంటే రూములు కాదోయ్ కాలేజంటే అనుభవాలోయ్ అని ఇక వాటిలోకి దూకుదాం.

Saturday, August 11, 2007

m.r.college contd again

గత కొన్ని రోజులుగా నన్ను చూడడానికి వచ్చేవారితో సమయం గడిచిపోయింది.అందరూ నేను బాగున్నాననే సంతృప్తితో వెళుతున్నారు. మా కాలేజ్ లో ఆరెండు గదుల సంగతీ చెప్పాను కదా. ఇప్పుడు ఆ దారిలోనే ముందుకి వెళితే ఒక రెండు మెట్లు వస్తాయి. అవి దాటితే కెమిస్ట్ర్య్య్ లాబ్. ప్రియూనివర్సిటీ లోనూ బి ఎస్ సీ మొదటి సంవత్సరంలోనూ ఇక్కడే ప్రాక్టికల్సు చేసే వాళ్లం. కింద పైన ఒక వింగంతా లాబే. నిన్ననే నేనూ నా భార్యా అనుకుంటున్నాం. తను నాగ్ పూర్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సు లో చదివింది. ఆ కాలేజిల లాబరేటరీలున్నంత స్థలంలో ఇప్పుడు రెందు కాలేజిలే వుంటున్నాయి.ఇక విద్యార్ధి వ్యక్తిత్వం పెరగాలంటే యెలా పెరుగుతుంది? సరే , ఆ లాబ్ పక్కనే ఒక చిన్న క్లాస్రూము- చిన్నదంటే ఎనభై మందిమి విశాలంగా కూర్చునే వాళ్ళం.దాని పక్కన కెమిస్ట్రీ గాలరీ.ఇది ఫిజిక్సు గాలరీ కన్నా కూడా పెద్దది.మూడు నాలుగు వందలమంది సునాయాసం గా పడతారు. మా క్లాసు ముందు రెండు మూడు వరసలలోనే నిండేది. అకౌస్టిక్స్ దిజైన్ చేశారో లేదో తెలీదు కాని, యెవరు మాట్లాడినా మూడు వందలమందికీ స్పష్టంగా వినిపించేది-ఆఖరికి మాధవరావు గారి పాఠమైనా. ఆయన సంగతి వేరే చెపుతాను. ఇంకా స్థలపురాణం లోనే వున్నాం కదా. మొదటి బెంచిలో నేనూ కవిరాయని రామచంద్రమూర్తీ రామారావూ కే వెంకటరావూ కూర్చుని యెక్కువగా రమణమూర్తి గారి పాఠాలే వినే వాళ్ళం. మాకు దాదాపు కెమిస్ట్రీ అంతా ఆయనే చెప్పారు.వెంకటరావు మొదటి సంవత్సరం తరవాత వాళ్ళ నాన్న గారికి బదిలీ అవడం తో మరో వూరికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన వాడు తిరిగి నేను రిసెర్చి లో చేరిన సమయానికి యూనివర్సిటీకికి వచ్చి తిరిగి కలిశాదు.మధ్యలో ఇంజనీరయ్యాడు. తరవాత ఈ సీ ఈ హెడ్డూ చైర్మనూ అన్నీ చేసి నాకన్నా ఒకేడు ముందు రిటైరై ఇప్పుడు జీ ఎం ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాలుగా ఆ కాలేజ్ ని ఉన్నత స్థానానింకి తీసుకు వెళ్ళాడు. .ఇక్కడితో ఆ భాగం అయిపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ రెండు క్లాసురూములూ దాటి వరండాలోకి వచ్చి ముందుకు సాగుదాం.