Search This Blog
Sunday, August 17, 2008
షడాననరావు
ఈసారి షడాననరావు గురించి చెప్పాలి. మంచి మిత్రుడు.కలుసుకుని ఇన్నాళ్ళయినా యెప్పటికీ ఆప్తుదే.గవర్నమెంటు కాలేజిల్లో ప్రిన్సిపాలుగా చాలాచోట్ల చేసి రిటైరై గుడివాడలో ఇల్లు కట్టుకుని సెటిలయ్యాడు. వాళ్ళమ్మాయి పెళ్ళి చేశాడీమధ్యనే.మేమందరం ఒక రూములో కూర్చుని కబుర్లూ పిచ్చాపాటీ చెప్పుకుంటూ వుండే వాళ్ళం.ఒకరోజు ఆంధ్రప్రభ వారపత్రిక ఒకరు గట్టిగా చదువుతుంటే యెవరకితోచిన కామెంట్లు వాళ్ళు చేస్తూ పోయే వాళ్ళం . ఆ పత్రికలో మాలతీ చందూర్ జవాబులూ ఆంధ్రపత్రికలో ఒకవారం విపరీతం ఇలాటివన్నీ మాకు విందు భోజనంలా వుండేవి. జవాబుల్లో ఒకరోజు యెవరో ఐ యె ఎస్ పరీక్షలగురించి అడిగితే మాలతి గారు తన పేటెంటి శైలిలో ఆ పరీక్షల గురించీ అందులో ఒచ్చే ప్రశ్న ల తరహా గురించీ ప్రవచించేరు. బంతి నేలకి కొడితే మళ్ళీ పైకెందుకొస్తుందనే ప్రశ్న గురించి ప్రస్తావించారు. షడాననరావు వంక చూసి యేం భాయ్ యెందుకొస్తుందంటావ్ అని అడిగాడు ఉప్పిగాడనబడే ఉపేంద్రనాథ్[అతనిగురించీ చెప్తాను. షడాననరావ్ అందర్నీ భాయ్ అని పిలిచే వాడు. మేమూ అతన్నంతే. టౌనుకెళ్ళి టెరికాట్ షర్టు చింపించుకొద్దాం రా భాయ్ అన్నాడంటే అతనికి మనియార్డరు వచ్చినట్టే.] కొంచెం సేపు ఆలోచించి, "యెందుకంటే యేం చెప్తాం భాయ్ , దానికి పుట్టుక తో వచ్చిన బుధ్ధది. " అని తేల్చేశాడు షడాననుడు.ఇంకో సారి మరెవరో చదువుతున్నారు ఒక వుత్తరం." నేను ఈ వుత్తరం తెనాలి నించి రాస్తున్నాను, నా పేరు -----. వయస్సు పధ్ధెనిమిది సంవత్సరాలు. ఇంకా పెళ్ళికాలేదు.--" తరవాత మాట చదివే ముందే ఉపేంద్రనాథ్ స్వగతాన్ని గట్టిగా అన్నాడు."యేమిటో యీవిడకంత తొందర!". ఇలా వుండేవి మా కాలక్షేపాలు.టీవీలూ, డిస్క్ మాన్లూ ,పబ్ లూ లేని రోజులు కదా!
Saturday, August 9, 2008
hanumamtuDu
హనుమంతుడు పరీక్షల్లొ పెట్టిన ఇబ్బంది చెప్పాను కదా. మొదటిసారి పార్ట్ వన్ పరీక్షకి వెళ్ళినప్పుడు వాడేమాత్రం చదివాడో మీకీ పాటికి తెలుసు.ఎలెక్ట్రికల్ మెషిన్స్ ప్రాక్టికల్ కి వాడితో కలిసి భయం గానే వెళ్ళాను. సీతాపతిరావుగారు ఎక్స్టర్నల్ ఎక్జామినర్. వీడికి యేదో ప్రాక్టికల్ వస్తే నాకు రాదన్నాడు .నీకేదొచ్చు అని అడిగారాయన. వీడికి ఇండక్షన్ మోటార్ అయితే పెద్దగా యేమీ చెయ్యక్కరలేదని మాత్రం తెలుసు అందుకని అది చేస్తానన్నాడు. కాల్‌క్యులేషన్స్ యెక్కువ వున్నా ఆ సంగతి తరవాతనుకున్నాడు. కాని ముందుగానే వాణ్ణే వైవా కి పిలిచాడాయన. మరి వీడికేం రాదుగా. తెల్లమొహం కాస్సేపు చూసాక నీకేం తెలుసో చెప్పమన్నారాయన.జనరల్ ఫిజిక్స్ యేదైనా అడగమన్నాడు. ఆయన సరదాగా ఎలె క్ట్రాన్ స్పీడెంత అన్నారు. నేను నా ప్రాక్టికల్ మానేసి ఇది జాగ్రత్తగా వింటున్నాను.కరక్ట్ జవాబు చెప్పేశాడు . వూరుకోవచ్చుగా-- యెలా కొలుస్తావని అడిగాడాయన.కుర్చీలో ఇబ్బందిగా అటూఇటూ కదిలేక చెప్పేశాడు.186000 మైళ్ళ పొడుగున్న దారం ఒకటి తీసుకోండి. దానికి ఒక చివర ఎలెక్ట్రాన్ని వదిలి రెండో చివరికి యెంతసేపట్లో వెళుతుందో చూసుకోడమే.!!!! అవాక్కవడం అందరి వంతూ.
Thursday, August 7, 2008
hanumamtasastri
హనుమంతశాస్త్రి గురించి చెప్పాలంటే యెంతైనా ఉంది. మచ్చుకి ఇంకోటి చూడండి.మాకు ఎం ఎస్ సీ టెక్ రెండో స్మంవత్సరం చివరికి పార్ట్ వన్ పరీక్షలుండేవి. నిజానికి అవే ఆయువు పట్టు.పొద్దున్నే యెలక్ట్రానిక్స్ పరీక్ష వుందనగా అందరం బిగుసుకు పోయి చదివేస్తున్నాం.సడెంగా హనుమంతుడొచ్చాడు. నీ దగ్గర టెర్మన్ వుందా అంటూ.పొద్దున్న పరీక్షయితే యిప్పుడు టెర్మన్ చదువుతావా అనుకుంటూ మేం యెలానూ ముట్టుకునేది లేదు కదా అని యిచ్చాను.మళ్ళీ రాత్రి ఒకటిన్నరకి వచ్చాడు. ఇది చూసావా అంటూ. వీడేదో కనిపెట్టడని తెలిసిపోయింది. యేదిరా అన్నం. యీ మొదట్లో చూశావా-- అన్నాడు. చూశాం. మాకు కొత్తగా యేం కనిపించలేదు. యేం మనుషుల్రా. అసలైనది ఒదిలేసి ఊరికే బట్టీ వేస్తారు. అసలు యెలెక్ట్రాన్ గురించి యిక్కడ పూర్తిగా ఉంది చూశావా. ఇది చదివితే మొత్తం అంతా అర్ధమైపోతుంది. అన్నాదు.సరే అని సంతోషించి బాగా చదివేసై అని చెప్పాం . అంతకన్నా చేసేదేముంది.
Tuesday, August 5, 2008
malli hello
నెల రోజుల పైనే అయింది ఇక్కడికి వచ్చి. ఇంత విరామం ఇవ్వడం ఇదే మొదటిసారి అనుకుంటా.ఈ నెలలో మొదటి విశేషం యేమంటే నేను ఇప్పుడు అమెరికాలో వున్నాను. రెండో తారీకున వచ్చాను. యెందుకూ అంటే జూన్ పదమూడున నాకు రెండో మనమరాలు పుట్టింది.దాన్ని చూడ్డానికి నేనూ మా ఆవిడా రెడ్ మాండ్ వచ్చాము.పెద్ద మనమరాలి పుట్టినరోజు నవంబరు పదకొండు. అప్పటిదాకా వుండి వెళదామనుకుంటున్నాము. ఈ సందడిలో కొంచెం రోజులు పాతమితృలనీ మంచి జ్ఞాపకాలనీ కొంచెం వెనక్కి పంపడం జరిగింది.మల్లికార్జునాచారి గురించి చెప్పాను కదా. ఇంకా మా లాబ్ బాచిలో తాతి నాగేశ్వరరావూ చతుర్వేదుల హనుమంతశాస్త్రీ వుండే వాళ్ళు.తాతి నాగేశ్వరరావు మంచివాడు తెలివైనవాడే కాని అంత విలక్షణత వున్న వాడు కాదు. ప్రాక్టికల్ పరీక్షలకి వచ్చేప్పటికి వచ్చే సరికి బాచికి ముగ్గురే కావడంతో ఎ హెచ్ ఎం అని నేనూ ఆచారీ హనుమంతశాస్త్రీ మిగిలి నాగేశ్వరరావు పక్క బాచికి వెళ్ళాడు. అది నాకు వరమో శాపమో తెలీని స్థితి వచ్చింది. వర్క్‌షాప్ ప్రాక్టికల్ కి వెళ్ళడానికి గంట ముందు నా రికార్డు యేదిరా అని వెతుక్కోడమ్మొదలు పెట్టాదు. అందరం కలిసి కిందామీదా పడి వెతకడం మొదలెట్టం. చివరకి పీవీ రావనబడే మా సీనియర్[మరో విలక్షణ వ్యక్తి] రూములో టేబిల్ కాళ్ళకింద యెట్టుకి మడత పెట్టి పెట్టబడి వున్నాయి వీడి రికార్డ్ కాగితాలు. వాటి ఆకారం చూసి పాత కాగితాలేమో అనుకుని మడిచిపెట్టడాయన!కంగారుగా అందరం కలిసి వాటినివీలయినంత సాఔ చేసి బిక్కుబిక్కుమంటూ పరీక్షకి వెళ్ళాము. యెక్జామినర్ మూడ్ బాగోకపోతే మిగిలిన వాళ్ళందరినీ కూడాయేంచేస్తాడో అని భయపడే రోజులు అవి!ఇదే విచిత్రం కాదు. ముందింకా వుంది.
Monday, July 7, 2008
police
తెలుగు సినిమాల్లో పుంఖానుపుంఖంగా వస్తున్న టీనేజి ప్రేమకథలు మా దైనందిన జీవితంపై ఈ మధ్య కొంచెం ప్రభావం చూపించాయి. లేదు లేదు మా వాళ్ళెవరూ యేమీ చెయ్యలేదు.మా డ్రైవరు ఒక అమ్మాయిని ప్రేమించి వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే [వాడికి అమ్మ లేదు] ఇంకో వూరికి పారిపోయి పెళ్ళి చేసుకుని అక్కడే పని చూసుకున్నాడు. అదే సమయంలో మా పనిమనిషి కొడుకు కూడా ఒకమ్మాయిని ప్రేమించి పార్కులూ సినిమాలూ తిరిగితేవాళ్ళింటివాళ్ళు వీళ్ళింటిమీద దండెత్తి పోలీసు కంప్లైంటివ్వాలా పెళ్ళి చేస్తారా అని కూర్చున్నారు[ట].వెరసి నాకూ మా ఆవిడకీ ఆపసోపాలు తప్పలేదు.నాకు పనివాళ్ళు ఫ్రెంచి లీవు తీసుకున్నప్పుడల్లా వాళ్ళమీద కోపం కన్నా వాళ్ళకేమయిందోఅన్న భావనే యెక్కువగా కలుగుతుంది. దీనికి ఒక బాక్ గ్రౌండు వుంది.[ పృష్ఠ ప్రదేశం అని రాద్దామనుకుని సిగ్గుపడి మానేశా].విజయనగరంలో మేం బి ఎస్ సీ చదువుతున్న రోజుల్లో ,అంతకి చాలా ముందునించీ కూడా, మాఇంటి ముందు గాంధీ కేఫ్ అనబడే హోటలు వుండేది[రెస్టరెంటు అనడం ఫేషను కాదు ఆ రోజుల్లో]. బాబీ గారని దాని యజమాని. అందులో నూకరాజనే ఒక పన్నెండు పదమూడేళ్ళకుర్రాడు పని చేస్తుండే వాడు.వాడు అమ్మ వారి పండగకి ఒకసారి పోలీసు వేషం వేశాడు. అప్పణ్ణించీ వాణ్ణి అందరూ పోలీసనే పిలిచేవాళ్ళు. అందరికీ తలలో నాలుక లాగ చిన్నా చితకా పనులు చేసిపెడుతుండే వాదు. మాకందరికీ వాడితో సరదాగా మాట్లాడ్డం చిన్న చిన్న పనులు చేయించుకోడం యెంతగా అలవాటయ్యిందంటే వాడు రాకపోతే రోజు గడిచేది కాదు.నిజానికి పనేమీ లేకపోయినా కూడా. ఒక రోజు వాణ్ణి షాపుకి వెళ్ళి యేదో తెమ్మని పదిరూపాయలిచ్చి [పెద్ద సొమ్మే ఆ రోజుల్లో] పంపించింది మా అమ్మ పొద్దున్న పది గంటలకి.ఒక పది నిమిషాల్లో రావలసిన వాడు మధ్యాహ్నం మూడు గంటలయినా రాలేదు. మా ఇంట్లో మేం పెద్దగా పట్టించుకోకపోయినా నలుగురూ నాలుగు మాటలనడం మొదలెట్టారు. అంత సొమ్మెవరయినా పనివాళ్ళకిస్తారా అంటూ.మూడున్నరకి విషయం తెలిసింది. కిరాణా షాపు కోమటాయనతో యెకసెక్కాలాడుతూ వీడన్న యేదో మాటకి కోమటాయనకి కోపం వచ్చి చేతికందిన వీశె గుండు [కిలోలు లేవప్పుడు] విసిరేశాడు. అది తగలరాని చోట తగిలి పోలీసు అక్కడికక్కడే మరణించాడు. అందుకే, పనివాళ్ళెవరైనా రాకపోతే నాకు వాళ్ళకేమయ్యిందోనన్న కలత బాధిస్తుంటుంది.
Saturday, June 14, 2008
marinni paatraluu vaati chappullu
ఆ రోజుల్లో మాకు వారానికి నాలుగు రోజులు ఉదయం తొమ్మిదిన్నరకి ప్రాక్టికల్సు ఉండేవి.ఫస్టియరుఒక బాచి సెకండియరు ఒక బాచి ఇద్దరికీ అప్పుడే ఉండేవి. మాతో చేసే సెకండియరుబాచిలో ముఖ్యుడు పిసుపాటి వెంకటేశ్వరరావు అనే పీవీరావు.ఈ నాటికీ ఆప్తమిత్రుడు. రిటయిరయ్యాక కలవడం కొంచెం తగ్గింది కాని కలిసినప్పుడు హృదయరంజకంగా కబుర్లు తప్పవు. రిటైరు కాకముందు రోజూ కొన్ని గంటలుకలిసినవ్వుకోకుండా ఉండే ప్రసక్తేలేదు.అతనితో పాటు ఎం వీ రావు, రామకృష్ణ విఠల్ మరొకరూ [పేరు గుర్తుకి రాటంలేదు-విచిత్రంగా] ఉండే వాళ్ళం. నా బాచిలో టి నాగేశ్వరరావు, హనుమంతశాస్త్రీ మల్లికార్జునాచారీ ఉండే వాళ్ళు. నాగేశ్వరావు సంగతి వదిలేస్తే[ అతనూ ఆప్తమితృడే] మిగిలిన వాళ్ళిద్దరూ విలక్షణ వ్యక్తులే. అందులో మల్లికార్జునాచారి ఎం ఎస్ సీ నేను డిపార్ట్మెంట్ హెడ్డుగా 87 లో చార్జి తీసుకున్నాక గాని పూర్తికాలేదు. అతనిది ఒక విచిత్రమైన కధ. ముందు మాథమాటిక్స్ ఎం ఎస్ సీ లో చేరాదు. అతనూ పిఠాపురం హాస్టల్లోనే వుండేవాడు. అక్కడే పరిచయమయ్యాడు. ఒక రోజు పొద్దున్న టిఫిన్ టయిములో నా పక్కకి వచ్చి కూర్చుని అప్లయిడ్ ఫిజిక్స్ లో ఎలెక్ట్రానిక్స్ చెపుతారుటకదా అన్నాడు. అవునన్నాను. నాకుతెలీనే తెలీదు . తెలిస్తే అందులోనే చేరే వాణ్ణి అన్నాడు. యెవరో అతనికోసం యెదురు చూస్తున్నట్టు. సరే మరి యెవరి కాళ్ళు పట్టుకున్నాడో యేంచెశాడో కాని ఒక వారం తరవాత కనపడి అప్లయిడ్ ఫిజిక్సుకి మారిపోయా అన్నాదు.మంచిదే అనుకున్నాను.అతనిది హోస్పేట . రెండో సంవత్సరంలో ఒక సారి క్లాసు పరీక్ష్లో అతనికి నూటికి పదిమార్కులొచ్చాయి. సీతారామస్వామిగారు నిండుక్లాసులో నిలబెట్టి యే వూరు నించి వచ్చావు అని అడిగేరు. చెప్పాడు. మైలుకి ఒక్క మార్కు వచ్చినా మూడు సబ్జెక్టుల్లో పాసయే వాడివి కదా అన్నారు. ఇలాటిదే కధ మా సీనియర్ భూప్ రాజ్ పాండే ది. అతను నేపాల్ నించి వచ్చేడు. తరువాత నేపాల్‌లో గూఢచారిశాఖలో ఉన్నత పదవిలో వున్నాడని తెలిసింది.అతని మాట వద్దులెండి .యెందుకన్నా మంచిది.చెప్పొచ్చిన సంగతేమంటే సరైన సమయంలో మల్లిఖార్జునాచారి పరీక్ష పాసవలేదని తెలుస్తూనే వుందికదా.ఫైనలియరయ్యాక కొన్నేళ్ళపాటు ప్రతి సంవత్సరమూ పరీక్షకి వచ్చాడు.ఆ రోజుల్లో పోయిన పేపరొక్కటీ రాసే సౌలభ్యం లేదు. ప్రాక్టికల్స్ తో సహా మొత్తం పరీక్షంతా రాయాల్సిందే. దానితో యేళ్ళు గడుస్తుంటే పని కష్టతరం అవడం మొదలుపెట్టి మూడు నాలుగేళ్ళ తరవాత ఇక కనపడ్డం మానేశాడు.విరక్తి చెందాడేమో అనుకున్నాము. తరవాత తెలిసిందేమంటే పాసైపోయానని చెప్పి యేదో కర్ణాటకలో మారుమూల కాలేజిలో లెక్చరరు ఉద్యోగం సంపాదించాడు. సర్టిఫికెట్ అడిగితే యెక్కడో ఉండిపోయాయి తరవాత చూపిస్తానని నెట్టుకొచ్చాడు. వాళ్ళడిగినప్పుడల్లా ఇతను తెస్తాను పదిహేను రోజుల సెలవివ్వండి అనడమూ దానికి ఇష్టపడక వాళ్ళు సరేలే తరవాత చూద్దాం అనడమూ జరిగేది.ప్రైవేటు కాలేజిలకి తక్కువ జీతంతో యెన్ని క్లాసులైనా తీసుకునే వాడు చాలుకదా! కొన్నాళ్ళకి ఇక సాగని పరిస్థితి వచ్చింది. ఆచారి దానికీ తయారుగానే వున్నాడు. ఆంధ్రా యూనివర్సిటీ ఆఫీసులో పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందనిన్నీ అక్కడ రికార్డులన్నీ కాలిపోయాయనీ నమ్మబలికాడు. తరవాత యెండాకాలంలో ఇక యేదో చెయ్యాలని తెలుసుకుని విశాఖకి వచ్చాడు. దైవ సాక్షాత్కారం అయినట్టు నేను హెడ్డు గా కనిపించేను. కధంతా చెప్పి తనమీద పోలీసు కేసు పెట్టకుండా నేనే రక్షించాలని బతిమాలేడు.నేనేదో మతలబు పెట్టి ముఫ్ఫయ్యేళ్ళ తరవాత అతనికి మళ్ళీ పరీక్ష పెట్టించి పేపర్లు నేనే సెట్ చేయించి తెలిసిన వాళ్ళ తోనే దిద్దించి గట్టున పడేశాను. యెందుకంటే యేభయ్యేళ్ళొచ్చి యింక అతను యెవర్నీ మోసం చెసే స్థితిలో లేడనిపించింది.
Monday, June 9, 2008
paatra parichayam
తెన్నేటి సత్య గౌరీపతిశాస్త్రితో నా పరిచయం అలా మొదలైంది.అలాగే ఎన్ సీ విజయా . అతని గురించి ముందో మారు చెప్పాను.అతను ఫ్లూటు ముగ్ధమనోహరంగా వాయించే వాడు. అతని విలక్ష్ణతలో అదో భాగమే అయినప్పటికీ నన్ను అతని పక్క ముందుగా ఆకర్షించినది అదే. అతనిలా ఫ్లూటు వాయించాలని చాలా ప్రయత్నించి బొమ్మలు గియ్యడం నించి లాగానే మరోసారి అస్త్ర సన్యాసం చేశాను. తరవాతి రోజుల్లో అతనితో పరిచయం అంతలా పెరుగుతుందని నేనూ వూహించలేదు. వీళ్ళు కాకుండా విజయనగరంలో నాతోపాటు చదివి ఇక్కడ తేలిన వాళ్ళలో రామం మాట ముందే చెప్పాను. యు ఎన్ బీ రావుగా ప్రసిధ్ధికెక్కిన ఐ పీ ఎస్ ఆఫీసరు నాగభూషణరావు ముఖ్యుడు. అతను ఢిల్లీలో ముఖ్యపదవులు అలంకరించి రిటైరై మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.అతనూ నేనూ ఆప్తులం శ్రేయోభిలాషులం. నన్ను సివిల్ సర్వీసులో అనురక్తుణ్ణి చెయ్యలని అతనికి చాలా కోరిక వుండేది. ఇంకా చంద్రరాజు, సూర్యనారాయణా మరో కొందరూ వుండేవాళ్ళు. మా అప్లయిడ్ ఫిజిక్స్ క్లాసులో పదహారుమందిమి వుండేవాళ్ళం. అందరందాదాపుగా ఇంకా సంబంధాలు కొనసాగిస్తూనే వున్నాం. ప్రత్యక్షంగా వీలు పడనప్పుడు పరోక్షంగానైనా యోగక్షేమాలు తెలుసుకుంటూనే వుంటాం. నేను కాకుండా ఆరాథ్థి నరసిం హమూర్తి, జివివి సుబ్బారావు , షడాననరావు.చతుర్వేదుల హనుమంతశాస్త్రి, మల్లికార్జునాచారి, వ్యాకరణం వెంకటరావు, తాతినాగేశ్వరరావు, మంథా శ్రీనివాసరావు, ఎస్ వీ రమణమూర్తి, జె ఎస్ ప్రకాశరావు, సి ఉపేంద్రనాథ్, వి నరసిం హమూర్తి, ఎన్ వేణుగోపాలరావు కే మారుతిరామారావు,వి సీతారామారావు అనే పదహారుమందిమీ ఒకే కుటుంబంలాగ వుండే వాళ్ళం. ఒకళ్ళిద్దరు డే స్కాలర్లున్నా వాళ్ళూ హాస్టలుకి వచ్చాక అందరం కలిసి గుంపుగా క్లాసుకి వెళ్ళే వాళ్ళం.ఇది ఆ రోజుల్లో కూడా కొంచెం ప్రత్యేకంగానే వుండేది.
Subscribe to:
Posts (Atom)